
ప్రభుత్వ కార్యాలయంలో టీడీపీ కార్యకర్త హల్‌చల్
వేపంజేరి ఆర్‌బీకేలో ప్రభుత్వ ఉద్యోగితో కలిసి పార్టీ
టీడీపీ ఎమ్మెల్యేపై అసభ్య పదజాలంతో దూషణ
గంగాధర నెల్లూరు: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం వేపంజేరి రైతు భరోసా కేంద్రం (ఆర్‌బీకే)లో కాంట్రాక్టు టీచర్ అయిన టీడీపీ కార్యకర్త మద్యం తాగిన వైనం బయటకు వచ్చింది. అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదే వ్యక్తి మరో వీడియోలో టీడీపీ నాయకులను దూషించిన వీడియో కూడా బయటకు వచి్చంది. గంగాధర నెల్లూరు మండలం చిన్న వేపంజేరి గ్రామానికి చెందిన దివ్యాంగుడు హరిప్రసాద్ వేపంజేరి ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్ట్ టీచర్. ఈయన టీడీపీ కార్యకర్త. వారం క్రితం ఓ ప్రభుత్వ ఉద్యోగితో కలిసి ఆర్‌బీకేలో మద్యం తాగాడు.
కాగా, ఆదివారం చిన్న వేపంజేరిలో ఓ వ్యక్తి కర్మక్రియలు జరిగాయి. దీంట్లో నాయీబ్రాహ్మణ వృత్తి చేసేందుకు తనను పిలవలేదని హరిప్రసాద్ గ్రామస్థులను దుర్భాషలాడగా, అతనిపై స్థానికుడు ఆనందరెడ్డి చేయిచేసుకున్నాడు. ముందస్తు ప్రణాళికలో భాగంగా హరిప్రసాద్ ఈ వీడియో చిత్రీకరించి పోలీసు ఉన్నతాధికారులకు పంపాడు. ఆనంద్‌రెడ్డిపై కేసు నమోదైంది. అయితే, గ్రామస్థులు సోమవారం స్థానిక స్టేషన్‌లో హరిప్రసాద్ విపరీత ప్రవర్తనపై ఫిర్యాదు చేశారు. హరిప్రసాద్ వాహనంపై ప్రెస్ స్టిక్కర్ వేసుకుని అందరినీ బెదిరించి, డబ్బులు తీసుకుని తిరిగివ్వడని పోలీసులకు వివరించారు.
నన్నెవరూ ఏమీ చెయ్యలేరు..
కాంటాక్ట్ పద్ధతిలో ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ... టీడీపీ కార్యకర్తగా పనిచేస్తున్న హరిప్రసాద్ సొంత పార్టీ నాయకులపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. టీడీపీ ఎమ్మెల్యేను కూడా అసభ్యంగా దూషించాడు. తననెవరూ ఏమీ చేయలేరని ఎమ్మెల్యే, ఎంపీకి కూడా తన రేంజ్ తెలుసని, తాను తలుచుకుంటే రేషన్ డీలర్లను క్షణాల్లో మార్చేస్తానని, మండల అధ్యక్షుడు సైతం ఏమీ చేయలేడని, సంతకం పెడితే ఎంత పని అయినా అయిపోతుందంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.