బీరేన్ సింగ్ ప్రభుత్వానికి షాక్‌.. మద్దతు ఉపసంహరించుకున్న కీలక పార్టీ.. | Sakshi
Sakshi News home page

బీరేన్ సింగ్ ప్రభుత్వానికి షాక్‌.. మద్దతు ఉపసంహరించుకున్న కీలక పార్టీ..

Published Sun, Aug 6 2023 9:51 PM

Manipur BJP Ally Withdraws Support From Biren Singh Led Government - Sakshi

ఇంఫాల్‌: మణిపూర్‌లో గత మూడు నెలలుగా అల్లర్లు చెలరేగుతున్న నేపథ్యంలో భాజపా నేతృత్వంలోని ప్రభుత్వం తన మిత్రున్ని కోల్పోయింది. ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న కుకీ పీపుల్ అలయెన్స్ (కేపీఏ) ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్‌ అనుసూయా ఉకేకి లేఖ రాసింది. కేపీఏ నిర్ణయంతో సీఎం బీరేన్ సింగ్ ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు ఉండదు.

'ఇన్ని రోజుల అల్లర్ల పరిణామల తర్వాత ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంలో ఎలాంటి ఉపయోగం లేదు. సీఎం బీరేన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకుంటున్నాం. ఇది ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేనప్పటికీ నిర్ణయం తీసుకుంటున్నాం.' అని కేపీఏ చీఫ్ టోంగ్‌మాంగ్ హాకిప్ లేఖలో పేర్కొన్నారు.    

60 మంది సభ్యుల అసెంబ్లీలో సైకుల్ నుంచి కిమ్నియో హౌకిప్ హాంగ్‌షింగ్, సింఘత్ నుంచి చిన్లుంతంగ్  ఇద్దరు కేపీఏ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతునిచ్చారు. బీజేపీకి 32 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరికి ఐదుగురు నాగ కూటమి సభ్యులు, ముగ్గురు స్వతంత్రులు మద్దతుగా నిలిచారు. 

మణిపూర్‌లో అల్లర్లు గత మూడు నెలలుగా ఆందోళనలు చెలరేగాయి. కుకీ, మైతేయి తెగల మధ్య అల్లర్లు హింసాత్మకంగా మారాయి. ఈ అల్లర్లు కొద్ది రోజుల క్రితం తగ్గినట్టే తగ్గి మళ్లీ రాజుకున్నాయి. అల్లర్లను తగ్గించడానికి కేంద్రం తాజాగా మరో 900 మంది బలగాలను కొత్తగా మోహరించింది. ఇప్పటికే ఆ ప్రాంతంలో దాదాపు 4000 మంది ఆర్మీ సిబ్బంది పరిస్థితులను చక్కదిద్దుతున్నారు. కాగా.. మణిపూర్‌ అల్లర్లలో ఇప్పటికే దాదాపు 170 మంది మరణించారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

ఇదీ చదవండి: సీఎంను కించపరుస్తూ పోస్టులు.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ అరెస్టు..

Advertisement
 
Advertisement