ప్రభుత్వం, ఆటో పరిశ్రమ కలిసి పని చేయాలి | No short-term solutions for rare earth crisis says ACMA president Shradha Suri Marwah | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం, ఆటో పరిశ్రమ కలిసి పని చేయాలి

Sep 13 2025 4:52 AM | Updated on Sep 13 2025 4:52 AM

No short-term solutions for rare earth crisis says ACMA president Shradha Suri Marwah

అప్పుడే రేర్‌ మ్యాగ్నెట్స్, టెక్నాలజీ సవాళ్లను అధిగమించవచ్చు 

ఏసీఎంఏ ప్రెసిడెంట్‌ శ్రద్ధా సూరి మార్వా  

న్యూఢిల్లీ: భౌగోళికరాజకీయ పరిస్థితులు మారిపోతున్న నేపథ్యంలో రేర్‌ ఎర్త్‌ మ్యాగ్నెట్స్‌లాంటి ముడి వస్తువులు, ఇతరత్రా టెక్నాలజీలపరమైన సమస్యలను అధిగమించాలంటే ప్రభుత్వం, ఆటో పరిశ్రమ కలిసి పని చేయాల్సి ఉంటుందని ఆటో విడిభాగాల సంస్థల సంఘం ఏసీఎంఏ ప్రెసిడెంట్‌ శ్రద్ధా సూరి మార్వా తెలిపారు. సవాళ్లను అవకాశాలుగా మల్చుకోవాలని, మొబిలిటీ విడిభాగాలకు భారత్‌ను విశ్వసనీయమైన హబ్‌గా నిలబెట్టాలనేదే తమ ఉమ్మడి లక్ష్యమని ఏసీఎంఏ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆమె వివరించారు. ‘కీలకమైన ముడి వస్తువులు, రేర్‌ ఎర్త్‌ మ్యాగ్నెట్లు, సెమీకండక్టర్లు మొదలైన వాటి కొరత పెద్ద సవాలుగా మారింది. దీనిపై జాతీయ స్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. 

అపారమైన అవకాశాల కూడలిలో మనం ఇప్పుడు ఉన్నాం. కానీ అదే స్థాయిలో సవాళ్లు కూడా ఉన్నాయి. వాణిజ్య యుద్ధాలు, భౌగోళికరాజకీయ ఒడిదుడుకులు, 
టారిఫ్‌లపరమైన ఉద్రిక్తతలు, ఎగుమతులపరంగా పరిమితుల్లాంటివన్నీ కూడా సరఫరా వ్యవస్థ స్వరూపాన్ని మార్చివేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కీలక ముడి వస్తువులను దక్కించుకునేందుకు ప్రభుత్వంతో మరింతగా కలిసి పనిచేయాలి. అలాగే కొత్త మార్కెట్లలోకి ప్రవేశించేందుకు ప్రపంచవ్యాప్తంగా భాగస్వామ్యాలను పటిష్టం చేసుకోవాలి. అంతర్జాతీయంగా పోటీపడే విధంగా మన పరిశ్రమ బలోపేతం కావాలి‘ అని మార్వా చెప్పారు.  

సరఫరా వ్యవస్థ పటిష్టం కావాలి: సియామ్‌ 
మరోవైపు, సరఫరా వ్యవస్థలనేవి కేవలం వ్యయాలను తగ్గించుకునే అంశానికే పరిమితం కాకుండా వైవిధ్యంగా, ఎలాంటి అవాంతరాలెదురైనా నిలదొక్కుకునే విధంగా పటిష్టంగా మారాలని వాహనాల తయారీ సంస్థల సంఘం సియామ్‌ ప్రెసిడెంట్‌ శైలేష్‌ చంద్ర సూచించారు. ఇందుకోసం వనరులు సమృద్ధిగా ఉన్న దేశాలతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం ద్వారా ప్రత్యామ్నాయ సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి పెట్టాల్సి ఉందని ఆయన వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపార సంస్థల మధ్య సంబంధాలు ఎంత ముఖ్యమో, అలాగే అలాంటి భాగస్వామ్యాలకు దోహదపడేలా ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు చొరవ తీసుకోవడం కూడా ముఖ్యమేనని చంద్ర చెప్పారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement