
న్యూఢిల్లీ: ఈరోజు(బుధవారం) దేశవ్యాప్తంగా 25 కోట్లకు పైగా ప్రభుత్వ రంగ కార్మికులు సమ్మెకు దిగనున్నారు. బ్యాంకులు, పోస్టల్, బొగ్గు గనులు, ప్రజా రవాణా, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడనున్నారు. రైళ్ల రాకపోకల్లో ఆలస్యంతో పాటు విద్యుత్ సరఫరా అంతరాయాలు సంభవించే అవకాశం ఉంది.
కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ, వివిధ ప్రభుత్వ రంగాలకు చెందిన 25 కోట్లకు పైగా కార్మికులు దేశవ్యాప్త భారీ సమ్మెకు సిద్ధమయ్యారు. రైతు సంఘాలు, గ్రామీణ కార్మిక సంఘాల మద్దతుతో 10 కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది.
ఈ రంగాల్లో తీవ్ర ప్రభావం
బ్యాంకింగ్,బీమా సేవలు
పోస్టల్ కార్యకలాపాలు
బొగ్గు గనులు, పారిశ్రామిక ఉత్పత్తి
ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రజా రవాణా
ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ యూనిట్లు
గ్రామీణ ప్రాంతాల్లో రైతుల నిరసనలు
స్వల్ప ప్రభావం
పాఠశాలలు, కళాశాలలు
ప్రైవేట్ కార్యాలయాలు
రైలు సేవల్లో స్వల్ప ఆటకం
దేశవ్యాప్తంగా రైతులు, గ్రామీణ కార్మికులు కూడా ఈ నిరసనల్లో పాల్గొంటారని ఏఐటీయూసీ నేత అమర్‌జీత్ కౌర్ తెలిపారు. ప్రభుత్వం తమ 17 అంశాల డిమాండ్ జాబితాను విస్మరించిందని, గత పదేళ్లలో ఒక్క వార్షిక కార్మిక సమావేశాన్ని కూడా నిర్వహించలేదని కౌర్ పేర్కొన్నారు. భారత్ బంద్ దేశవ్యాప్తంగా పలు సేవలకు అంతరాయం కలిగిస్తుందని, ముఖ్యంగా బ్యాంకింగ్, పోస్టల్, బొగ్గు గనులు, కర్మాగారాలు, రాష్ట్ర రవాణా సేవలు సమ్మె కారణంగా ప్రభావితమవుతాయని హింద్ మజ్దూర్ సభ నేత హర్భజన్ సింగ్ సిద్ధూ మీడియాకు తెలిపారు.
సమ్మెలో పాల్గొంటున్న యూనియన్లు
ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (AITUC)
ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (INTUC)
ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ సెంటర్ (CITU)
హింద్ మజ్దూర్ సభ (HMS)
స్వయం ఉపాధి మహిళా సంఘం (SEWA)
లేబర్ ప్రోగ్రెసివ్ ఫెడరేషన్ (LPF)
యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (UTUC)
మద్దతు పలుకుతున్న సంఘాలు
సంయుక్త కిసాన్ మోర్చా తదితర రైతు సంఘాలు
గ్రామీణ కార్మిక సంఘాలు
రైల్వేలు, ఎన్‌ఎండీసీ లిమిటెడ్, ఉక్కు పరిశ్రమల ప్రభుత్వ రంగ సిబ్బంది
పార్లమెంట్ ఆమోదించిన నాలుగు కొత్త కార్మిక కోడ్‌లను కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ కోడ్‌ల కారణంగా కార్మికుల హక్కులు దెబ్బతింటాయని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ప్రభుత్వ రంగ యూనిట్ల ప్రైవేటీకరణ, ఉద్యోగాల అవుట్‌సోర్సింగ్ మొదలైన విధానాలను కార్మిక సంఘాలు ప్రతిఘటిస్తున్నాయి. 2020, 2022, 2024లలో జరిగిన ఈ తరహా దేశవ్యాప్త సమ్మెలలో లక్షలాది మంది కార్మికులు రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలిపారు.