
మూడు రోజుల నష్టాలకు బ్రేక్..
ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్ చివరకు లాభాల్లోనే ముగిసింది...
రోజంతా ఒడిదుడుకులే
- 88 పాయింట్ల లాభంతో 27,661కు సెన్సెక్స్
- 32 పాయింట్ల లాభంతో 8,361కు నిఫ్టీ
ముంబై: ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్ చివరకు లాభాల్లోనే ముగిసింది. దీంతో మూడు రోజుల వరుస నష్టాలకు తెరపడింది. మే పారిశ్రామికోత్పత్తి గణాంకాల వెల్లడి సందర్భంగా ట్రేడింగ్ చివర్లో ఇన్వెస్టర్ల కొనుగోళ్లకు దిగడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 88 పాయింట్ల లాభంతో 27,661 పాయింట్ల వద్ద, నిఫ్టీ 32పాయింట్లు లాభపడి 8,361 పాయింట్ల వద్ద ముగిశాయి. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో చైనా షాంగై మార్కెట్ 4.5 శాతం లాభపడడం, , ఇతర ఆసియా మార్కెట్లు లాభాల్లోనే ఉండడం, ఇటీవల మూడు రోజుల క్షీణత కారణంగా బాగా తగ్గి ఆకర్షణీయంగా ఉన్న షేర్లలో కొనుగోళ్లు జరగడం, గ్రీస్ రుణ సంక్షోభం పరిష్కార దిశగా పయనిస్తుండడం, యూరప్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతుండడం సెంటిమెంట్‌పై సానుకూల ప్రభావం చూపాయని నిపుణులంటున్నారు. ఆర్థిక సేవల,లోహ, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్, గ్యాస్, ఫార్మా షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి.
ఐటీ షేర్లకు నష్టాలు: టీసీఎస్ అంతంత మాత్రం ఆర్థిక ఫలితాలను వెల్లడించడంతో టెక్నాలజీ షేర్లు నష్టపోయాయి.