బ్యాంకింగ్‌కు బాండ్‌ జోష్‌! | Bond Josh to banking | Sakshi
Sakshi News home page

బ్యాంకింగ్‌కు బాండ్‌ జోష్‌!

Mar 28 2018 12:26 AM | Updated on Mar 28 2018 12:26 AM

Bond Josh to banking - Sakshi

సాక్షి, బిజినెస్‌ విభాగం :  గత శుక్రవారం అమెరికా మార్కెట్లు బారీగా పతనమయ్యాయి. మామూలుగా చూస్తే సోమవారం మన మార్కెట్లూ బలహీనంగానే ఉండాలి. కానీ... బ్యాంకు షేర్లలో భారీ ర్యాలీ జరగటంతో నిఫ్టీ ఏకంగా 133 పాయింట్లు పెరిగింది.

బ్యాంకింగ్‌ షేర్లలో జరిగిన ర్యాలీని సూచిస్తూ... బ్యాంక్‌ నిఫ్టీ 2.5 శాతం... అంటే 600 పాయింట్లకుపైగా పెరిగింది. పీఎస్‌యూ బ్యాంకులైతే మరింత భారీగా పెరిగాయి. మంగళవారం కూడా ఈ ర్యాలీ కొనసాగింది. దీనికి ప్రధాన కారణం... బాండ్‌ మార్కెట్‌!!. కేంద్రం అనుకున్న దానికన్నా తక్కువ రుణాలు సమీకరించవచ్చనే వార్తలు రావటంతో బాండ్‌ మార్కెట్లో హడావుడి మొదలై ఈ షేర్ల పరుగుకు కారణమైంది. దాని వెనకున్న ఆసక్తికరమైన వివరాలే ఈ ప్రత్యేక కథనం...

రుణ సమీకరణ ఎందుకు తక్కువంటే...
బ్యాంకుల్లో డిపాజిట్లకు సంబంధించి కొత్త చట్టం రానుందని, దాంతో డిపాజిట్లకు భద్రత లేకుండా పోవచ్చని కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి. దీంతో బ్యాంకుల్లో విత్‌డ్రాయల్స్‌ బాగానే పెరిగాయి. సురక్షితమైన సాధనాల కోసం చూస్తూ జనం పోస్టాఫీసు పథకాలను ఎంచుకుంటున్నారు. గడిచిన కొద్ది నెలల్లో చిన్నమొత్తాల పొదుపులు భారీగా పెరగటమే దీనికి నిదర్శనం. ఈ డబ్బు కేంద్రం చేతికొస్తుంది కనక కేంద్రం రుణాల్ని తగ్గించుకోవాలని అనుకుంది. అందుకే... బాండ్‌ మార్కెట్‌ నుంచి ఓ 50వేల కోట్లు తక్కువ సమీకరిస్తామని ప్రకటించింది.

నిజానికి ఈ ఆర్థిక సంవత్సరం (2017–18) ప్రథమార్ధంలో కేంద్రం బాండ్ల ద్వారా రూ.3.72 లక్షల కోట్లు సేకరించింది. మొత్తం లక్ష్యంలో ఇది 48 శాతం. ప్రభుత్వం ద్రవ్య అవసరాల కోసం విపరీతంగా బాండ్లను జారీ చేస్తుండటంతో కొద్ది నెలలుగా బాండ్లకు పూర్తిగా కొనుగోలు మద్దతు కరువై ఈల్డ్‌ పెరిగిపోతూ వచ్చింది. గత ఏడు నెలల్లో ఈల్డ్స్‌ 1.26 శాతం మేర పెరిగాయి కూడా.

తాజా పరిణామాలతో ప్రభుత్వం బాండ్లపై ఆధారపడటం తగ్గుతుందని తెలియగానే ఈల్డ్స్‌ ఒక్కసారిగా 25 బేసిస్‌ పాయింట్లు తగ్గి 7.37 శాతానికి దిగొచ్చాయి. ఈ స్థాయిలో ఈల్డ్‌ తగ్గడం 2013 నవంబర్‌ తర్వాత ఇదే ప్రథమం. మరోవంక బాండ్ల కొనుగోలుకు విదేశీ ఇన్వెస్టర్లకున్న పరిమితిని కూడా కేంద్ర పెంచనుందని, ఇందుకు సంబంధించి ఆర్థికశాఖ, ఆర్‌బీఐ మధ్య చర్చలు జరుగుతున్నాయని ఆర్థిక వ్యహారాల కార్యదర్శి సుభాష్‌ గార్గ్‌ వెల్లడించారు. ఇది బాండ్ల భారీ ర్యాలీకి కారణమయ్యింది.

బ్యాంకు షేర్లలో కొనుగోళ్లు ఎందుకంటే...
ప్రభుత్వం జారీచేసే బాండ్లలో అధికం ప్రభుత్వ బ్యాంకులే పెట్టుబడి పెడతాయి. అయితే ఈ బాండ్ల ధరల మార్పులకు అనుగుణంగా కలిగే లాభనష్టాల్ని (అవి పుస్తకాల్లో వచ్చే లాభనష్టాలైనప్పటికీ) ఆర్థిక ఫలితాల్లో చూపించాల్సి ఉంటుంది. గత కొద్ది నెలల్లో బాండ్ల ధరలు పతనమై, ఈల్డ్స్‌ పెరిగిపోవటంతో పీఎస్‌యూ బ్యాంకులు... బాండ్లకు సంబంధించి నష్టాల్ని చవి చూడాల్సి వచ్చింది.

ఈ జనవరి–మార్చి క్వార్టర్లో అన్ని బ్యాంకులు కలిపి రూ.10,000 కోట్ల బాండ్ల నష్టాల్ని ఫలితాల్లో ప్రకటిస్తాయన్న అంచనాలు ఇప్పటికే మార్కెట్లో వున్నాయి. ఇందు లో 75% ప్రభుత్వ బ్యాంకులవే కాగా... అందులోనూ ఎస్‌బీఐ వాటా అధికం. అందుకే ఈ షేరు ఇటీవల 52 వారాల కనిష్ట స్థాయి రూ.230కి పడింది.  2017–18 క్యూ2లో రూ.3,772 కోట్ల ట్రెజరీ లాభాల్ని (బాండ్ల ట్రేడింగ్‌ ద్వారా వచ్చేవి) చూపించిన ఎస్‌బీఐ... మూడో త్రైమాసికంలో రూ.3,260 కోట్ల నష్టాన్ని ప్రకటించిందంటే బాండ్లు ఈ బ్యాంకుకు ఎంత ప్రధానమో అర్థమవుతుంది.

నాల్గో త్రైమాసికంలో బాండ్ల నష్టాలు భారీగా ఉంటాయని ఎస్‌బీఐ ఛైర్మన్‌ సంకేతాలిచ్చారు. కానీ నాటకీయంగా బాండ్ల ర్యాలీ ప్రారం భవడంతో... ఈ క్యూ4లో ప్రభుత్వ బాండ్లు అధికంగా కలిగివున్న బ్యాం కుల ట్రెజరీ నష్టాలు తక్కువే ఉంటాయి. ఈ అంచనాలే మార్కెట్లో ఈ షేర్ల పెరుగుదలకు కారణమైనట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

వడ్డీ రేట్లు తగ్గే అవకాశం...
1998 తర్వాత ఈ స్థాయిలో బాండ్ల గిరాకీ పడిపోయి ఈల్డ్స్‌ పెరిగిపోవటం గత 7 నెలల్లోనే జరిగింది. ఈల్డ్స్‌ పెరగడంతో ప్రభుత్వం జారీచేసే బాండ్లను అధిక వడ్డీ రేటుకు విడుదల చేయాల్సి ఉంటుంది. దాంతో సహజంగానే వ్యవస్థలో వడ్డీ రేట్లు పెరగడం జరుగుతోంది. అందువల్ల తర్వాతి నెలల్లో ఆర్‌బీఐ కూడా రేట్లను పెంచుతుందనే అంచనాలు ఊపందుకున్నాయి. అయితే తాజా గా ప్రభుత్వం రుణ సమీకరణ లక్ష్యాన్ని కుదించిన సంకేతాలతో బాండ్‌ ఈల్డ్స్‌ తగ్గి, వడ్డీ రేట్ల అంచనాలు దిగిరావడానికి కారణమవుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement