యాక్సిస్‌ బ్యాంక్‌ లాభం 25% అప్‌

Axis Bank's profit up 25% - Sakshi

మెరుగుపడిన రుణ నాణ్యత

9 శాతం పెరిగిన నికర వడ్డీ ఆదాయం

ఏడాది గరిష్టాన్ని తాకిన షేరు   

ముంబై: యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.726 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం(రూ.580 కోట్లు)తో పోల్చితే 25 శాతం వృద్ధి సాధించామని యాక్సిస్‌ బ్యాంక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం స్వల్పంగా తగ్గినప్పటికీ, ఇతర, నిర్వహణ ఆదాయాలు కూడా తగ్గినప్పటికీ, కేటాయింపులు తక్కువగా ఉండడం, నికర వడ్డీ ఆదాయం అధికంగా ఉండడంతో నికర లాభంలో మంచి వృద్ధి సాధించినట్లు వివరించింది.

రిటైల్‌ రుణాలు 29 శాతం వృద్ధి...
ఈ త్రైమాసికంలో బ్యాంకు స్థూల మొండి బకాయిలు 5.22 శాతం నుంచి 5.28 శాతానికి, నికర మొండి బకాయిలు 2.18 శాతం నుంచి 2.56 శాతానికి పెరిగాయి. అయితే క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌ పరంగా చూస్తే రుణ నాణ్యత మెరుగుపడింది. ఈ క్యూ2లో  స్థూల మొండి బకాయిలు 5.90 శాతంగా, నికర మొండి బకాయిలు 3.12 శాతంగా ఉన్నాయి. మొత్తం  రుణాలు 21 శాతం వృద్ధితో రూ.4,20,923 కోట్లకు చేరాయి. రిటైల్‌ రుణాలు 29 శాతం వృద్ధితో రూ.1,93,296 కోట్లకు పెరిగాయి. మొత్తం రుణాల్లో 41 శాతంగా ఉండే కార్పొరేట్‌ రుణాలు 12 శాతం పెరిగి రూ.1,72,743 కోట్లకు చేరాయి.

స్వల్పంగా తగ్గిన మొత్తం ఆదాయం...
గత క్యూ3లో రూ.14,501 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో  రూ.14,315 కోట్లకు తగ్గిందని బ్యాంక్‌ తెలిపింది. ఇతర ఆదాయం 24 శాతం తగ్గి రూ.2,593 కోట్లకు, నిర్వహణ లాభం 17 శాతం తగ్గి రూ.3,854 కోట్లకు పరిమితమయ్యాయి. క్యూ3లో రూ.3,796 కోట్లుగా ఉన్న కేటాయింపులు ఈ క్యూ3లో రూ.2,811 కోట్లకు తగ్గాయి.

మొండి బకాయిలకు కేటాయింపులు 26 శాతం, క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌ ప్రాతిపదికన 11% చొప్పున తగ్గాయి. నికర వడ్డీ ఆదాయం రూ.4,334 కోట్ల నుంచి 9% వృద్ధితో రూ.4,732 కోట్లకు, వ్యాపారం 11% వృద్ధితో రూ.6,43,938 కోట్లకు పెరిగింది. డిపాజిట్లు 10 శాతం ఎగిశాయి. ఈ క్యూ3లో 105 కొత్త బ్రాంచీలను ప్రారంభించామని, మొత్తం బ్రాంచీల సంఖ్య 3,589కు పెరిగిందని బ్యాంకు తెలియజేసింది.

25 శాతం తగ్గిన కేటాయింపులు
ఏడు క్వార్టర్ల క్రితం రూ.22,600 కోట్లుగా ఉన్న సందేహాస్పద ఖాతాలకు సంబంధించిన వాచ్‌లిస్ట్‌ ఈ క్యూ3లో రూ.5,300 కోట్లకు తగ్గిందని బ్యాంక్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ జైరామ్‌ శ్రీధరన్‌ చెప్పారు.  మొత్తం కేటాయింపులు 25% తగ్గి రూ.2,811 కోట్లకు తగ్గాయని, ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో 65%కి పెరిగిందని వివరించారు.

క్యూ2  ఫలితాలు ప్రకటించక ముందే వాట్సాప్‌లో లీకైన కేసు దర్యాప్తు విషయంలో సెబీకి సహకరిస్తున్నామని, ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.ఫలితాలు అంచనాలను మించడంతో షేర్‌ 3.5% లాభంతో రూ.611 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్‌ ఏడాది గరిష్ట స్థాయి, రూ.621ను తాకింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top