డోర్ల తయారీలోకి ఎన్‌సీఎల్‌!  | Automotive Door, the global market size will reach US$ xx million by 2023 | Sakshi
Sakshi News home page

డోర్ల తయారీలోకి ఎన్‌సీఎల్‌! ! 

Mar 13 2019 12:09 AM | Updated on Jul 15 2019 9:21 PM

Automotive Door, the global market size will reach US$ xx million by 2023 - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సిమెంటు తయారీ సంస్థ ఎన్‌సీఎల్‌ గ్రూప్‌ ప్రీమియం డోర్స్‌ విభాగంలోకి ప్రవేశిస్తోంది. టర్కీకి చెందిన ఏజీటీ సాంకేతిక సహకారంతో ‘డ్యూరాడోర్‌’ బ్రాండ్‌ కింద కంపెనీ వీటిని లైఫ్‌టైం వారంటీతో విక్రయించనుంది. దీనికోసం చౌటుప్పల్‌ వద్ద రూ.50 కోట్లతో ప్లాంటును నిర్మించింది. బుధవారం ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తోంది. భారత్‌లో అతిపెద్ద, ప్రీమియం రెడీమేడ్‌ డోర్ల తయారీ ప్లాంటు ఇదేనని, షిఫ్టుకు 1,000 డోర్లు తయారు చేయగల సామర్థ్యం ఈ యూనిట్‌కు ఉందని ఎన్‌సీఎల్‌ చెబుతోంది. తొలుత భారత మార్కెట్‌ లక్ష్యంగా డోర్లను సరఫరా చేస్తారు. ఈ కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా 100 మందికి ఉపాధి లభించనుంది. నాగార్జున బ్రాండ్‌ కింద సిమెంట్, రెడీమిక్స్‌ కాంక్రీట్, బైసన్‌ ప్యానెల్‌ బ్రాండ్‌లో సిమెంట్‌ బోర్డులను సైతం ఎన్‌సీఎల్‌ విక్రయిస్తోంది. 

ఈ ఏడాది బాగుంటుంది.. 
2017–18లో కంపెనీ రూ.1,097 కోట్ల టర్నోవరుపై రూ.49 కోట్ల నికరలాభం ఆర్జించింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ – డిసెంబరు కాలంలో రూ.855 కోట్ల టర్నోవరుపై రూ.20 కోట్ల నికరలాభం సాధించింది. తొలి 9 నెలలూ సిమెంటుకు ధర లేక నిరుత్సాహపరిచినట్లు ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌ ఎండీ కె.రవి చెప్పారు. ‘రెండు నెలలుగా సిమెంటు ధరలు పెరిగాయి. ఈ త్రైమాసికం బాగుంటుంది. సిమెంటుతోపాటు సిమెంటు బోర్డులు, రెడీ మిక్స్‌ కాంక్రీట్‌కు డిమాండ్‌ బాగుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,400 కోట్ల ఆదాయం ఆశిస్తున్నాం. ఇదే డిమాండ్‌ కొనసాగుతుందన్న అంచనాల నేపథ్యంలో 2019–20లో మెరుగైన ఫలితాలు నమోదు చేస్తామన్న ధీమా ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో బోర్డ్స్‌ ప్లాంటు పూర్తి స్థాయి సామర్థ్యం వినియోగించుకుంటాం’ అని ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో చెప్పారు.  

రూ.100 కోట్లతో విద్యుత్‌ ప్లాంట్‌.. 
సూర్యాపేట సమీపంలోని మట్టపల్లి వద్ద ఎన్‌సీఎల్‌ సిమెంటు ప్లాంటు విస్తరించింది. 17 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యం గల గ్రైండింగ్‌ యూనిట్‌తోపాటు ఇక్కడ సిమెంటూ ఉత్పత్తవుతోంది. ప్లాంటులో జనించే వేడి నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే పవర్‌ ప్రాజెక్టును ఈ ఏడాది ఏర్పాటు చేస్తున్నారు. 8 మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టుకు రూ.80–100 కోట్లు వెచ్చిస్తామని రవి వెల్లడించారు. కంపెనీకి విజయవాడ సమీపంలోని కొండపల్లి వద్ద 10 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యం గల గ్రైండింగ్‌ యూనిట్‌ ఉంది. 2018–19లో సిమెంటు విక్రయాలు 20 లక్షల టన్నులు దాటతాయని చెప్పారాయన. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి సామర్థ్యం 27 లక్షల టన్నులకు చేరుకుంటామన్నారు. ప్రస్తుతమున్న ప్లాంటులోనే విస్తరణ చేపట్టే అవకాశం ఉందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement