మనది అని రాసుంటే ఎప్పటికైనా అది మన దగ్గరకే వస్తుంది. మనది కాకపోతే చేతుల వరకు వచ్చినా సరే దక్కకుండా చేజారిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున.. ఓ అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకున్నారనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒకవేళ ఆ ఛాన్స్ నాగ్ అందుకుని ఉంటే ఎలా ఉండేదా అని ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఏంటి విషయం?
రీసెంట్ టైంలో ఊహించని సక్సెస్ అందుకున్న సినిమా 'ధురంధర్'. థియేటర్లలోకి వచ్చేంతవరకు దీనిపై పెద్దగా బజ్ లేదు. పాన్ ఇండియా రిలీజ్ కూడా కాదు. కేవలం హిందీ వెర్షన్ మాత్రమే విడుదల చేశారు. టికెట్ పెంపు లాంటివి అసలే లేవు. డిసెంబరు తొలివారంలో బిగ్ స్క్రీన్స్‌పైకి రాగా ఇప్పటికీ వసూళ్లు రాబడుతూనే ఉంది. ప్రస్తుతానికైతే రూ.1300 కోట్ల మేర వసూలు చేసింది. ఇందులో హీరో పాత్ర కంటే రహమాన్ డకాయిత్ అనే విలన్ పాత్రకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
(ఇదీ చదవండి: మృణాల్ ఠాకుర్ రొమాంటిక్ సినిమా.. టీజర్ రిలీజ్)
రహమాన్ డకాయిత్‌గా అక్షయ్ ఖన్నా అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అయితే తొలుత ఈ పాత్ర కోసం నాగార్జునని అనుకున్నారట. స్క్రిప్ట్ కూడా నచ్చింది గానీ అదే సమయానికి కూలీ, కుబేర చిత్రాలతో నాగ్ బిజీగా ఉండటం వల్ల చేజేతులా ఈ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందట. సినిమా చూసిన ప్రతిఒక్కరూ ఆ పాత్రలో అక్షయ్ తప్ప మరొకరిని ఊహించుకోలేరు. అంతలా అదరగొట్టేశారు. అలాంటి పాత్ర నాగార్జున చేసుంటే ఎలా ఉండేదో మరి?
రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఆదిత్య ధర్ దర్శకుడు. 1990ల్లో పాకిస్థాన్ కరాచీలోని లయరీ అనే ప్రాంతంలో జరిగిన గ్యాంగ్ వార్స్, అక్కడికి వెళ్లిన ఓ భారత రహస్య ఏజెంట్.. తర్వాత ఏం జరిగింది? అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశారు. జనవరి 30 నుంచి ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కావొచ్చనే ప్రచారం నడుస్తోంది. మరోవైపు 'ధురంధర్' సీక్వెల్.. ఈ మార్చి 19నే థియేటర్లలోకి రానుంది. తొలి పార్ట్ హిందీ వరకే రిలీజ్ చేయగా.. సీక్వెల్ మాత్రం తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లోనూ విడుదల చేయనున్నారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 28 సినిమాలు)


