అరబిందో చేతికి సాండోజ్‌

Aurobindo to buy Sandoz’s dermatology business for $1 billion - Sakshi

డీల్‌ విలువ రూ.7,200 కోట్లు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజం అరబిందో చేతికి అమెరికాకు చెందిన సాండోజ్‌ డెర్మటాలజీ చిక్కింది.  నోవార్టిస్‌ ఏజీ జనరిక్‌ వ్యాపార విభాగమే ఈ సాండోజ్‌. డీల్‌ విలువ 1 బిలియన్‌ డాలర్‌ (రూ.7,200 కోట్లు). దీనికి అమెరికా ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ అనుమతి ఇవ్వాల్సి ఉందని.. 2019 కి ఈ డీల్‌ ముగిసే అవకాశముందని అరబిందో ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సాండోజ్‌ వ్యాపారం 0.6 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఈ కొనుగోలులో సాండోజ్‌కు చెందిన ఉత్తర కరోలినాలోని విల్సన్‌ తయారీ కేంద్రం, న్యూయార్క్‌లోని హిక్స్‌విల్లీ, మెల్‌విల్లీ తయారీ కేంద్రాలు అరబిందో వశమవుతాయని కంపెనీ ఒక ప్రకటనతో తెలిపింది. దీంతో పాటూ హిక్స్‌విల్లీ, మిల్‌విల్లీ, విల్సన్, ప్రిన్స్‌టన్, న్యూజెర్సీల్లోని సుమారు 750 మంది ఉద్యోగుల, ఫీల్డ్‌ రిప్రజెంట్స్‌ కూడా అరబిందోకు బదిలీ అవుతారు. ప్రస్తుతం సాండోజ్‌కు చెందిన సుమారు 300 ఉత్పత్తులతో పాటూ అభివృద్ధి చేస్తున్న పలు ప్రాజెక్ట్‌లు కూడా అరబిందోకు విక్రయిస్తున్నట్లు సాండోజ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. 

యూఎస్‌లో ఎంట్రీ కోసమే.. 
అమెరికాలో వ్యాపార వృద్ధి, విస్తరణలో భాగంగానే ఈ కొనుగోలు జరిగిందని అరబిందో ఫార్మా ఎండీ ఎన్‌ గోవిందరాజన్‌ పత్రికా సమావేశంలో చెప్పారు. దీంతో అమెరికాలో జనరిక్‌ డెర్మటాలజీ మార్కెట్లో విస్తరణకు, మా ఉత్పత్తుల ప్రవేశానికి తలుపులు తెరిచినట్లయిందని చెప్పారు. ‘‘అత్యంత సమర్థవంతమైన ఉత్పాదన, నిర్వహణ, లాభదాయకమైన మార్కెట్‌ వంటివి ప్రధాన లక్ష్యంగా చేసుకొనే సాండోజ్‌తో పాటూ గతంలో జరిపిన ఇతర కంపెనీల కొనుగోళ్లు జరిగాయని’’ గోవిందరాజన్‌ వివరించారు. 

2వ అతిపెద్ద కంపెనీగా.. 
సాండోజ్‌కు జనరిక్‌ బ్రాండ్‌ డెర్మటాలజీ విభాగంతో పాటూ అభివృద్ధి కేంద్రం కూడా ఉంది. కొనుగోళ్ల లావాదేవీలతో పరిశీలిస్తే అమెరికాలో డెర్మటాలజీ విభాగంలో అరబిందో 2వ అతిపెద్ద కంపెనీగా అవతరించింది. వాస్తవానికి సాండోజ్‌ విభాగంలో డెర్మటాలజీ కంటే ఓరల్‌ సాలిడ్స్‌ (టాబ్లెట్స్‌ మరియు క్యాçప్సూల్స్‌) వ్యాపార విభాగం పెద్దది. కానీ, అరబిందో ప్రధాన లక్ష్యం తక్కువ ధర, నిర్వహణ ద్వారా డెర్మటాలజీ విభాగాన్ని లాభంలోకి తీసుకురావాలనేది. గురువారం బీఎస్‌ఈలో అరబిందో షేరు క్రితం ముగింపుతో పోలిస్తే 9.12 శాతం పెరిగి రూ.759.55 వద్ద స్థిరపడింది.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top