తక్కువ స్థాయి పన్ను రేట్లు అవశ్యం | Arun Jaitley said, India now needs lower level of taxation | Sakshi
Sakshi News home page

తక్కువ స్థాయి పన్ను రేట్లు అవశ్యం

Dec 27 2016 12:33 AM | Updated on Sep 4 2017 11:39 PM

తక్కువ స్థాయి పన్ను రేట్లు అవశ్యం

తక్కువ స్థాయి పన్ను రేట్లు అవశ్యం

దేశ ఆర్థిక వ్యవస్థ విస్తృత స్థాయిలో బలోపేతం కావాలంటే తక్కువ స్థాయి పన్ను రేట్లు తప్పనిసరి అని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పేర్కొన్నారు.

ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా మారాల్సిందే...
అప్పుడే ఆర్థిక వ్యవస్థ విస్తరణ..
ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ వ్యాఖ్యలు  


ఫరీదాబాద్‌: దేశ ఆర్థిక వ్యవస్థ విస్తృత స్థాయిలో బలోపేతం కావాలంటే తక్కువ స్థాయి పన్ను రేట్లు తప్పనిసరి అని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పేర్కొన్నారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా మనం మారాల్సిన అవసరం ఉందని చెప్పారు. సోమవారమిక్కడ ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌(ఐఆర్‌ఎస్‌) అధికారుల వృత్తినైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ జైటీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘1991 నుంచి మన ఆర్థిక వ్యసస్థ అనేక మార్పులను చవిచూస్తూవస్తోంది. ప్రభుత్వానికి అధిక ఆదాయం లభించాలంటే ఎక్కువ పన్నులను విధించాలన్న విధానానికి కాలం చెల్లింది.

ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను మరింత విస్తృతం చేయాల్సిన ఆవశ్యకత నెలకొంది. ఇందుకు తక్కువ స్థాయి పన్ను రేట్లు ముఖ్యం. తయారీ ఉత్పత్తుల నుంచి సేవల వరకూ అంతర్జాతీయంగా మరింత పోటీతత్వాన్ని అలవర్చుకోవాలి. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఆమోదయోగ్యత ఉండేలా మన పన్ను రేట్లు కూడా తక్కువగా ఉండాలి. అని జైట్లీ చెప్పారు. పోటీ అనేది దేశీయంగానే లేదని ప్రపంచస్థాయిలో నెలకొందన్నారు. దీనికి అనుగుణంగానే గత రెండున్నర దశాబ్దాల్లో ప్రభుత్వాలు పన్నుల విధానాలను అమలు చేస్తూ వస్తున్నాయని ఆర్థిక మంత్రి వివరించారు.

పన్ను ఎగవేత అనైతికం కాదన్న ధోరణిలో...
‘గడిచిన 70 ఏళ్లలో ప్రజల ప్రవర్తనను నిశితంగా గమనిస్తే.. ప్రభుత్వానికి పన్నులు చెల్లించపోయినా అదేమీ అనైతికం కాదని, తప్పు లేదన్న ధోరణి నెలకొంది. దీన్ని తెలివిగా తప్పించుకోవడంగా కొందరు భావిస్తున్నారు. అయితే, మరికొందరు మాత్రం తీవ్ర పరిణామాలనే ఎదుర్కొన్నారు కూడా’ అని జైట్లీ పేర్కొన్నారు. రానున్న దశాబ్దాల్లో స్వచ్ఛందంగా పన్ను చెల్లింపు ధోరణులు పెరిగేవిధంగా యువ ఐఆర్‌ఎస్‌ అధికారులు కృషి చేయాలన్నారు. ‘చట్టబద్ధమైన పన్నులను చెల్లించడం తమ బాధ్యత అన్న విధంగా ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు రావాలి. పన్ను చెల్లింపుదారులను ప్రోత్సహించే విధంగా వారిలో విశ్వాసం నెలకొనేలా చేయడం మీ(అధికారుల) బాధ్యత. పన్నులకు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన పన్ను కేసుల్లో మాత్రమే తీవ్రమైన పరిశీలన అవసరం’ అని ఆర్థిక మంత్రి సూచించారు.

జీఎస్‌టీ నేపథ్యంలో నైపుణ్యాలు పెరగాలి...
ప్రతిపాదిత వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) త్వరలోనే కార్యరూపం దాల్చనున్న నేపథ్యంలో పన్నుల విభాగాలకు చెందిన అధికారులు తమ నైపుణ్యాలను మరింతగా సానబెట్టుకోవాల్సిన అవసరం ఉందని జైట్లీ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement