మొబైల్‌ యాప్స్‌పై ఆపిల్‌ కీలక నిర్ణయం

Apple Releases App Store Review Guidelines For Applications - Sakshi

న్యూఢిల్లీ : క్రిప్టో కరెన్సీకి సంబంధించిన అప్లికేషన్ల (యాప్స్‌)పై ఆపిల్‌ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. వర్చువల్‌ కరెన్సీ అయిన క్రిప్టో కరెన్సీ (బిట్‌ కాయిన్‌) అప్లికేషన్లను అభివృద్ధి చేసేవారు ఇకపై తప్పనిసరిగా ఒక సంస్థగా నమోదు కావాల్సి ఉంటుందని ఆపిల్‌ సంస్థ తెలిపింది. అలాంటి సంస్థలకు చెందిన అప్లికేషన్లకు మాత్రమే ఆపిల్‌ యాప్‌ స్టోర్‌లో అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. ఆపిల్‌ ఫోన్‌ స్టోరేజీతో సంబంధం లేకుండా కేవలం క్లౌడ్‌-బేస్డ్‌ స్టోరేజీలో క్రిప్టో మైనింగ్‌ చేసే అప్లికేషన్లను మాత్రమే అనుమతిస్తామని తెలిపింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. బ్యాటరీని ఎక్కువగా వినియోగించే, మొబైల్‌ను త్వరగా వేడెక్కించే అప్లికేషన్లపై కూడా ఆంక్షలు విధిస్తున్నట్లు కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. 

క్రిప్టోనే ఎందుకంటే..
క్రిప్టో కరెన్సీ అప్లికేషన్లలో థర్డ్‌పార్టీ అడ్వర్టయిజింగ్‌లు ఉంటాయనీ.. యాప్స్‌తో సంబంధం లేని ప్రకటనలతో వినియోగదారునికి అసౌకర్యం కలుగుతుందని పేర్కొంది. ఇలాంటి వాటిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఆపిల్‌ వెల్లడించింది. ‘బిట్‌ కాయిన్లలో ట్రేడింగ్‌ చేసే అప్లికేషన్లు మిగతా వర్చువల్‌ కరెన్సీ అప్లికేషన్లను అడ్డుకుంటాయి. డౌన్‌లోడ్‌ ప్రక్రియను మందకొడిగా మారుస్తాయి. సోషల్‌ మీడియా యాప్‌లపైన కూడా వీటి వల్ల  ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఆయా యాప్స్‌ను చురుగ్గా పనిచేయనీయవు’ కనుకనే ఆపిల్‌ ఫోన్‌ స్టోరేజీలో ఎలాంటి క్రిప్టో కరెన్సీ మైనింగ్‌ని అనుమతించబోమని ఆపిల్‌ స్పష్టం చేసింది. న్యాయబద్ధంగా వర్చువల్‌ ట్రేడింగ్‌ సేవల్ని అందించే యాప్‌లను అనుమతిస్తామని తెలిపింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top