‘చోక్సీని భారత్‌కు అప్పగించం’

Antiguan Official Says Mehul Choksi Not Being Sent To India - Sakshi

న్యూఢిల్లీ : పీఎన్‌బీ స్కామ్‌లో ప్రధాన నిందితుడు మెహుల్‌ చోక్సీని భారత్‌కు రప్పించే ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చోక్సీ ప్రస్తుతం అంటిగ్వా పౌరుడని ఆయనను భారత్‌కు పంపబోమని ఓ అంటిగ్వా అధికారి స్పష్టం చేశారు. రూ 13,500 కోట్ల పీఎన్‌బీ స్కామ్‌లో నిందితుడైన చోక్సీని దేశానికి రప్పించేందుకు భారత్‌ ప్రత్యేక విమానాన్ని కరీబియన్‌ దీవులకు పంపుతోందన్న వార్తల నేపథ్యంలో అంటిగ్వా అధికారి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

మెహుల్‌ చోక్సీ కోసం భారత్‌ నుంచి అధికారులు అంటిగ్వా, బార్బుడాలకు వస్తున్నారన్న సమాచారం తమ ప్రభుత్వం వద్ద లేదని ప్రధాని గాస్టన్‌ బ్రౌన్‌ కార్యాలయ సిబ్బంది చీఫ్‌ మాక్స్‌ హర్ట్‌ పేర్కొన్నట్టు ఇండియా టుడే టీవీ వెల్లడించింది. మెహుల్‌ చోక్సీ ఇప్పుడు అంటిగ్వా పౌరుడని,ఆయన తన భారత పౌరసత్వాన్ని వదిలివేయడంతో భారత పౌరుడు కారని ఆయన అంటిగ్వా పౌరసత్వాన్ని తాము రద్దు చేయబోమని హర్ట్‌ పేర్కొన్నారు.

వెస్టిండీస్‌ క్రికెట్‌ మ్యాచ్‌ను వీక్షించేందుకు భారత బృందం అంటిగ్వాకు రానుందని తాను భావిస్తున్నాన్నారు. చోక్సీని అరెస్ట్‌ చేయడం లేదా ఆయనను తీసుకువెళ్లేందుకు భారత బృందం అంటిగ్వా వస్తుందని తాము భావించడం లేదన్నారు. జనవరి 31న వెస్టిండీస్‌తో రెండో టెస్ట్‌ మ్యాచ్‌ అంటిగ్వాలో ప్రారంభమవుతుండటంతో భారత అధికారులు అంటిగ్వా రావచ్చని చెప్పుకొచ్చారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top