ఇన్ఫోసిస్‌ సీఈవోపై మరోసారి సంచలన ఆరోపణలు

Another Whistleblower Guns At Infosys CEO Salil Parekh - Sakshi

ఇన్ఫోసిస్‌లో ముదురుతున్న వివాదం

సీఈవో సలీల్‌ పరేఖ్‌పై మరోవిజిల్‌ బ్లోయర్‌  ఆరోపణలు

సాక్షి,  బెంగళూరు : టెక్‌ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌ వివాదం మరింత ముదురుతోంది. సెప్టెంబర్ 20 న బోర్డుకు 2 పేజీల లేఖలో అనైతిక పద్ధతులపై ఆరోపించిన స్వల్ప వ్యవధిలోనే మళ్లీ ఇలాంటి ఫిర్యాదు రావడం ఇది రెండోసారి. విజిల్ బ్లోయర్‌ ఈ ఆరోపణలు రేపిన సెగ ఇంకా చల్లారకముందే, ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్‌పై మరో విజిల్‌ బ్లోయర్‌ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు సలీల్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఇన్ఫీ చైర్మన్‌ నందన్ నీలేకనితోపాటు, బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌కు ఒక లేఖ రాశారు. సీఈవో పరేఖ్‌ కంపెనీలో చేరి ఒక సంవత్సరం 8 నెలలు అయినప్పటికీ,  ముంబైలో కాకుండా బెంగళూరులో నివాసం ఉండాలన్న షరతును ఉల్లంఘించారని ఆరోపించారు. 

11 బిలియన్ డాలర్ల కంపెనీ ఫైనాన్స్ విభాగ ఉద్యోగిని అని చెప్పుకున్న విజిల్‌బ్లోయర్, పరేఖ్‌ అక్రమాలను బహిర్గతం చేసినందుకు తనపై ప్రతీకారం తీర్చుకుంటారనే భయంతో తన గుర్తింపును వెల్లడించలేకపోతున్నానంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఉద్యోగిగా, వాటాదారుగా, సంస్థ విలువ వ్యవస్థలను క్షీణింపజేస్తున్న పరేఖ్ గురించి కొన్ని వాస్తవాలను ఛైర్మన్, బోర్డు దృష్టికి తీసుకురావడం తన కర్తవ్యంగా భావిస్తున్నానని  చెప్పారు. తక్షణమే స్పందించి, సంస్థ భవిష్యత్తు కనుగుణంగా చర్యలు చేపట్టాలని కోరారు.

పరేఖ్‌కు రెండు నెలల గడువు ఇచ్చినప్పటికీ కేవలం తన వ్యాపార ప్రయోజనాలకోసమే బెంగళూరుకు మకాం మార్చకుండా, ముంబైలోనే ఉంటున్నారని ఆరోపించారు. సీఈవోకు స్టాక్ మార్కెట్ కనెక్షన్లు ఉన్నాయని, అనేక సంస్థలలో పెట్టుబడులు పెట్టారని ఆరోపించిన ఫిర్యాదుదారుడు, పరేఖ్ తన పెట్టుబడుల పర్యవేక్షణ కోసమే ఇదంతా చేస్తున్నారన్నారు. దీన్ని ఆదర్శంగా తీసుకున్న చాలామంది ఉద్యోగులు ఇంటి నుండి పనిచేయడం ప్రారంభించారన్నారు. సీఈవో నెలకు రెండు సార్లు ఆఫీస్‌కు వచ్చేందుకు విమాన చార్జీలు, ఇతర రవాణా చార్జీలకే సంస్థ రూ. 22 లక్షలు చెల్లించినట్టు తెలిపారు. నెలకు నాలుగు బిజినెస్ క్లాస్ విమాన టిక్కెట్లు, ఇంటికి నుంచి ముంబై, బెంగళూరు విమానాశ్రయాలకి, ఆఫీసు నుంచి విమానాశ్రయం వరకు పికప్‌, డ్రాప్‌ చా​ర్జీలు ఇందులో ఉన్నాయని విజిల్‌ బ్లోయర్‌ ఆరోపించారు. అయితే తాజా ఆరోపణలపై, అటు సంస్థ సీఈవో సలీల్‌ పరేఖ్‌, ఇటు ఇన్ఫోసిస్ ఇంకా స్పందించలేదు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top