అమెజాన్‌ ప్రైమ్‌ సర్వీసు ఛార్జీ డబుల్‌

Amazon to double price of Prime service to Rs 999 - Sakshi

సాక్షి, బెంగళూరు : అమెజాన్‌ ప్రైమ్‌ సర్వీసులకు భారత్‌లో ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇప్పటి వరకు అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాలంటే ఆ ధర రూ.499 మాత్రమే ఉండేది. కానీ ప్రస్తుతం ఈ ఛార్జీని అమెజాన్‌ రెండింతలు చేయబోతుంది. అమెజాన్‌ ఇండియా త్వరలోనే  తన పాపులర్‌ సబ్‌స్క్రిప్షన్‌ సర్వీసు ప్రైమ్‌ ధరను రూ.999కు పెంచబోతున్నట్టు తెలిసింది. గతేడాది జూలైలో ఈ సర్వీసులను అమెజాన్‌ లాంచ్‌ చేసింది. అప్పటి నుంచి అన్ని మేజర్‌ సేల్‌ ఈవెంట్లలో ప్రైమ్‌ టాప్-సెల్లింగ్‌ ప్రొడక్ట్‌గా ఉంటోంది. 

ప్రస్తుతం ఈ సర్వీసు సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీలను పెంచుతున్నప్పటికీ అమెరికాలో కంటే భారత్‌లోనే వీటి ధర తక్కువని తెలిసింది. ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ తీసుకున్న  సబ్‌స్క్రైబర్లకు అమెజాన్‌ చాలా వేగవంతంగా ఉత్పత్తులను డెలివరీ చేస్తోంది. తొలుత వీరికే సేల్‌ను అమెజాన్‌ ప్రారంభిస్తోంది. అంతేకాక ప్రైమ్‌ వీడియో, అమెజాన్‌ మూవీలు, టీవీ షోలను కూడా ఈ సబ్‌స్క్రైబర్లకు అందిస్తారు. ఎక్స్‌క్లూజివ్‌ డిస్కౌంట్లు, ఫ్రీ షిప్పింగ్‌, కొన్ని ఉత్పత్తులపై ఫ్రీ నెక్ట్స్‌ డే డెలివరీలు వీరికి లభిస్తాయి. 

1.3 మిలియన్‌ ఉత్పత్తులతో ప్రైమ్‌ షిప్‌మెంట్లను ప్రారంభించామని, ప్రస్తుతం అవి 11 మిలియన్లకు పెరిగినట్టు అమెజాన్‌ ప్రైమ్‌ ఇండియా అధినేత అక్షయ్‌ సాహి తెలిపారు. ప్రైమ్‌ను మరింత ఆకర్షణీయంగా తయారుచేయడానికి తాము ఎల్లవేళలా కృషిచేస్తామని చెప్పారు. అమెజాన్‌ ప్లాట్‌ఫామ్‌పై వచ్చే ఆర్డర్లలో ప్రతి మూడింటిలో ఒకటి ప్రైమ్‌ సబ్‌స్క్రైబర్ల నుంచే వస్తుందని తెలిపారు. పండుగ సీజన్‌లో, మేజర్‌ సేల్‌ ఈవెంట్లలో కొనుగోలు ఎక్కువగా ఉంటున్నాయన్నారు.  
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top