జెట్‌ దివాలా పరిష్కారానికి 90 రోజుల గడువు

90 Days Deadline For Jet Airways Solution - Sakshi

పరిష్కార నిపుణుడిని కోరిన ఎన్‌సీఎల్‌టీ  

ముంబై: జెట్‌ ఎయిర్‌వేస్‌కు వ్యతిరేకంగా దివాలా పరిష్కారం కోసం ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కూటమి దాఖలు చేసిన దరఖాస్తును జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) గురువారం నమోదు చేసుకుంది. గ్రాంట్‌ థార్న్‌టన్‌కు చెందిన ఆశిష్‌ చౌచారియాను పరిష్కార నిపుణుడిగా నియమించింది. ఈ అంశం జాతీయ ప్రాధాన్యం గలది కాబట్టి చట్ట ప్రకారం ఆరు నెలల గడువు ఉన్నప్పటికీ, మూడు నెలల వ్యవధిలోపు పరిష్కార ప్రక్రియ కనుగొనేందుకు ప్రయత్నించాలని పరిష్కార నిపుణుడిని ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ కోరింది. పిటిషన్‌లో ఎస్‌బీఐ జెట్‌ ఎయిర్‌వేస్‌ నుంచి రూ.967 కోట్లు తన వంతుగా వసూలు కావాల్సి ఉందని తెలిపింది.

ఇందులో మూలధన అవసరాలకు రూ.505 కోట్లు, ఓవర్‌డ్రాఫ్ట్‌ సదుపాయం కింద రూ.462 కోట్లను జెట్‌ ఎయిర్‌వేస్‌కు అందించినట్టు పేర్కొంది. ఈ దరఖాస్తులో జోక్యం చేసుకునేందుకు తమను అనుమతించాలంటూ నెదర్లాండ్‌కు చెందిన లాజిస్టిక్స్‌ విక్రయదారులు దాఖలు చేసిన పిటిషన్‌ను బెంచ్‌ తిరస్కరించింది.  ప్రతీ 15 రోజులకోసారి పరిష్కార పురోగతిపై నివేదికను సమర్పించాలని, తొలి నివేదిక జూలై 5న దాఖలు చేయాలని పరిష్కార నిపుణుడిని ఎన్‌సీఎల్‌టీ ఆదేశించింది. అదే రోజు ఈ పిటిషన్‌పై బెంచ్‌ తదుపరి విచారణ చేయనుంది. మొత్తం 26 బ్యాంకులకు జెట్‌ ఎయిర్‌వేస్‌ రూ.8,500 కోట్ల మేర బకాయిపడింది. వందలాది విక్రయదారులు, ఉద్యోగులకు రూ.13,000 కోట్లకు పైగా చెల్లింపులు చేయా ల్సి ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 17 నుంచి ఈ సంస్థ కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోవడం తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top