86 శాతం ఏటీఎంలు పనిచేస్తున్నాయి

86% ATMs are working - Sakshi

నగదు కొరత  తగ్గుముఖం పట్టింది 

ప్రభుత్వ అధికార వర్గాల వెల్లడి 

నేటితో సమస్యకు పరిష్కారం 

ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌కుమార్‌ 

న్యూఢిల్లీ: నగదు కొరత సమస్య శుక్రవారం నాటికి పరిష్కారమవుతుందని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌కుమార్‌ తెలిపారు. మరోవైపు దేశవ్యాప్తంగా 86 శాతం ఏటీఎంలు పనిచేస్తున్నాయని, నగదు కొరత సమస్య తగ్గుముఖం పట్టిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ‘‘దేశమంతటా ఒకే విధంగా ఉన్న సమస్య కాదు ఇది. తెలంగాణ, బిహార్‌ వంటి ప్రదేశాల్లో సమస్య ఉంది. శుక్రవారంతో పరిష్కారం అవుతుంది. ఎందుకంటే ఆయా ప్రాంతాలకు నగదు గురువారం సాయంత్రానికి చేరుకుంటుంది’’ అని రజనీష్‌ కుమార్‌ మీడియాకు చెప్పారు. కరెన్సీ అనేది చేతులు మారాలని, దాన్ని తీసుకుని అలానే ఉంచేసుకుంటే బ్యాంకులు ఏమి సరఫరా చేయగలవని ఆయన ప్రశ్నించారు. బ్యాంకుల నుంచి నగదును ఉపసంహరించుకుంటే అది తిరిగి బ్యాంకులకు చేరాలన్నారు. మరోవైపు డిమాండ్‌ ఏర్పడిన ప్రాంతాలకు నగదు సరఫరా పెంపునకు చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. 2.2 లక్షల ఏటీఎంలకు గాను 86 శాతం ఏటీఎంలు  నగదు నిల్వలతో పనిచేస్తున్నాయని ప్రకటించాయి. మంగళవారం 60 శాతం ఏటీఎంలే పనిచేసిన విషయాన్ని గుర్తు చేశాయి. ఎన్నికలకు ముందు నగదును నిల్వ చేయడం, ఏటీఎంలను రూ.200 నోట్లకు అనుగుణంగా మార్పు చేయకపోవడం సమస్యకు కారణంగా పేర్కొన్నాయి. రూ.70,000 వేల కోట్ల మేర నగదు కొరతను అధిగమించేందుకు నాలుగు కేంద్రాలు రోజులో పూర్తి సమయం పాటు రూ.500, రూ.200 నోట్లను ముద్రిస్తున్నట్టు తెలిపాయి.  

ఒక్క రోజు నిబంధనకు మారిపోవాలి 
వ్యాపార సంస్థలు ‘ఒక్కరోజు చెల్లింపు ఉల్లంఘన’ నిబంధనకు మారిపోవాలని రజనీష్‌  అన్నారు. రుణ బకాయిలను సమయానికి చెల్లించేయాలని సూచిం చారు. బకాయిలను ఒక్కరోజులోగా చెల్లించకపోతే పరిశీలన జాబితాలో చేర్చాల్సి వస్తుందని కస్టమర్లను హెచ్చరించాలంటూ బ్యాంకులను ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఎన్‌ఎస్‌ విశ్వనాథన్‌ ఆదేశించిన విషయంలో రజనీష్‌ కుమార్‌ దీనిపై ప్రకటన చేయడం గమనార్హం. చాలా వరకు బ్యాంకులు ఒక్క రోజు నిబంధనను అమలు చేయడంలో విఫలమవుతుండటంపై స్వామినాథన్‌ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు.   

ప్రైవేటీకరణకు ఇది సమయం కాదు! 
ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు ఇది సమయం కాదని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ప్రస్తుత సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఇందుకు సహకరించడం లేదని ఆయన పేర్కొన్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top