చైనా, పాక్‌కు ‘పవర్‌’ కట్‌!

45 Crore Loss For China With Ban Of TikTok Application - Sakshi

విద్యుత్‌ పరికరాలు దిగుమతులు చేసుకోబోము

కేంద్ర మంత్రి ఆర్‌కే సింగ్‌ స్పష్టీకరణ

చైనా సంస్థలకు ఆర్డర్లివ్వొద్దని రాష్ట్రాల డిస్కంలకు సూచన

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా నుంచి భారత్‌ విద్యుత్‌ పరికరాలను దిగుమతి చేసుకోబోదని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ స్పష్టం చేశారు. అలాగే, చైనా, పాకిస్తాన్‌ల నుంచి వచ్చే పరికరాల దిగుమతులను కేవలం తనిఖీల ఆధారంగా అనుమతించేది లేదని పేర్కొన్నారు. తనిఖీల తర్వాతైనా అవసరమైతే అనుమతులు రద్దు చేస్తామన్నారు. రాష్ట్రాల విద్యుత్‌ శాఖల మంత్రులతో శుక్రవారం జరిగిన వర్చువల్‌ సమావేశంలో ఆయన ఈ విషయాలు తెలిపారు. ‘మనం ఇక్కడ ప్రతీదీ తయారు చేసుకుంటున్నాం. అయినా కూడా భారత్‌ రూ. 71,000 కోట్ల విలువ చేసే విద్యుత్‌ పరికరాలను దిగుమతి చేసుకుంది. ఇందులో రూ.21,000 కోట్ల మేర చైనా నుంచి దిగుమతయ్యాయి. మన దేశంలోకి చొరబడే పొరుగు దేశం నుంచి ఈ స్థాయిలో దిగుమతులను అనుమతించలేం. చైనా, పాకిస్తాన్‌ల నుంచి ఏదీ కొనుగోలు జరిపే ప్రసక్తే లేదు. ఆయా దేశాల నుంచి దిగుమతులకు అనుమతులివ్వబోము.

ఈ దిగుమతి చేసుకున్న వాటిల్లో (చైనా నుంచి) ఏ మాల్‌వేర్‌ ఉందో ట్రోజన్‌ హార్స్‌ ఉందో (వైరస్‌లు). వీటి సాయంతో వారు అక్కడెక్కణ్నుంచో మన విద్యుత్‌ వ్యవస్థలను చిన్నాభిన్నం చేయొచ్చు’ అని మంత్రి వ్యాఖ్యానించారు. టవర్‌ ఎలిమెంట్లు, కండక్టర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు మొదలైనవి భారత్‌లోనే తయారవుతున్నా.. వాటిని దిగుమతి చేసుకోవడం ఆందోళనకరమైన విషయమన్నారు. ‘మీ డిస్కంలు చైనా కంపెనీల నుంచి పరికరాలను దిగుమతి చేసుకుంటున్నాయి. చైనా కంపెనీల నుంచి కొనుగోళ్లు చేయొద్దని కోరుతున్నాం’ అని రాష్ట్రాల విద్యుత్‌ శాఖ మంత్రులకు మంత్రి సూచించారు. స్వయం సమృద్ధి భారత్‌ నినాదంలో భాగంగా ఇక్కడ లభించే ఏ పరికరాన్నీ చైనా నుంచి భారత్‌ దిగుమతి చేసుకోబోదని చెప్పారు. దిగుమతి చేసుకున్న వాటిని కూడా క్షుణ్నంగా తనిఖీ చేస్తుందని, ఆ తర్వాత అవసరమైతే వాటిని రద్దు కూడా చేయొచ్చని కూడా ఆయన తెలిపారు.

డిస్కంలకు ఆర్థిక ఊరట...
డిస్కంలకు ఆర్థికంగా ఊరటనిచ్చేలా కొత్త పథకాన్ని మంత్రి ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న ఉదయ్, డీడీయూజీజేవై, ఐపీడీఎస్‌ పథకాల స్థానంలో ఇది అమల్లోకి వస్తుందని తెలిపారు. కొత్త స్కీమ్‌ కింద డిస్కంల నష్టాలను తగ్గించేందుకు రాష్ట్రాలు తగు ప్రణాళికలు సమర్పించాల్సి ఉంటుంది. నష్టాలను తగ్గించుకునే ప్రణాళికల్లో లేని డిస్కంలకు ఈ పథకం కింద రుణాలు గానీ గ్రాంట్లు గానీ ఇవ్వడం జరగదని సింగ్‌ స్పష్టం చేశారు. ఢిల్లీలో లాగా ప్రభుత్వ రంగ సంస్థ లేదా ప్రైవేట్‌ సంస్థల ద్వారానైనా డిస్కంలను లాభసాటిగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. డిస్కంలకు రూ. 90,000 కోట్ల మేర నిధులు అందిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ప్యాకేజీ కింద రాష్ట్రాలు రూ. 93,000 కోట్లు అడిగాయని, ఇప్పటిదాకా రూ. 20,000 కోట్లు మంజూరు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

చైనా దిగుమతులకు ముందస్తు అనుమతులు తప్పనిసరి.. 
చైనా, పాకిస్తాన్‌ వంటి దేశాల నుంచి విద్యుత్‌ పరికరాల దిగుమతులకు ముందస్తుగా అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేస్తూ కేంద్ర విద్యుత్‌ శాఖ ఆదేశాలు జారీ చేసింది. భారత్‌తో సరిహద్దులున్న దేశాలు.. ముఖ్యంగా చైనా నుంచి దిగుమతులను తగ్గించే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం విద్యుత్‌ సరఫరా వ్యవస్థలో వినియోగించేందుకు దిగుమతి చేసుకున్న అన్ని రకాల యంత్రాలు, పరికరాలు, విడిభాగాలతో మాల్‌వేర్, ట్రోజన్లు, సైబర్‌ ముప్పులాంటివి పొంచి ఉన్నాయేమో తెలుసుకునేందుకు, భారత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేవా అని చూసేందుకు దేశీయంగా పరీక్షించడం జరుగుతుందని కేంద్ర విద్యుత్‌ శాఖ పేర్కొంది. విద్యుత్‌ శాఖ నిర్దేశించిన అధీకృత ల్యాబొరేటరీల్లో టెస్టింగ్‌ చేయాల్సి ఉంటుంది.

టిక్‌టాక్‌కు... 45 వేల కోట్ల నష్టం! 
చైనా యాప్‌లపై భారత నిషేధం కారణంగా చైనాకు చెందిన బైట్‌డాన్స్‌ లిమిటెడ్‌కు రూ.45,000 కోట్లు(600 కోట్ల డాలర్లు) నష్టం వస్తుందని అంచనా. సరిహద్దుల ఉద్రిక్తతల నేపథ్యంలో టిక్‌టాక్‌తో సహా మొత్తం 59 చైనా యాప్‌లను భారత దేశం నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధ యాప్‌ల జాబితాలో బైట్‌డాన్స్‌కు చెందిన యాప్‌లు మూడు(టిక్‌టాక్, విగో వీడియో, హెలో యాప్‌) ఉన్నాయి. మిగిలిన యాప్‌ల నష్టాలతో పోల్చితే ఈ మూడు యాప్‌ల నష్టాలే అధికమని కైయాక్సిన్‌గ్లోబల్‌డాట్‌కామ్‌ పేర్కొంది.  విదేశాల్లో అత్యధికంగా ప్రాచుర్యం పొందిన చైనా యాప్‌ల్లో టిక్‌టాక్‌ కూడా ఒకటి. టిక్‌టాక్‌కు చైనా తర్వాత అత్యధిక యూజర్లు ఉన్నది భారత్‌లోనే. ఈ ఏడాది తొలి 3 నెలల కాలంలో 61.1 కోట్ల డౌన్‌లోడ్స్‌ జరిగాయి. ఇది ప్రపంచవ్యాప్త టిక్‌టాక్‌ డౌన్‌లోడ్స్‌లో 30 శాతం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top