పరిహారమివ్వండి ఊరొదిలిపోతాం | villagers protest against singareni pollution | Sakshi
Sakshi News home page

పరిహారమివ్వండి ఊరొదిలిపోతాం

Jan 24 2018 4:43 PM | Updated on Jan 24 2018 4:43 PM

villagers protest against singareni pollution - Sakshi

బాధితులతో మాట్లాడుతున్న సింగరేణి అధికారులు, పోలీసులు

మణుగూరుటౌన్‌(భద్రాద్రికొత్తగూడెం) : మణుగూరు ఓసీ నుంచి వచ్చే దుమ్ము, ధూళి తో ఇళ్లల్లో ఉండలేకపోతున్నాం.. అని రాజుపేట గ్రామస్తులు మంగళవారం గ్రామంలోని రహదారిపై ఆందోళనకు దిగారు. రోడ్డుపై వంటావార్పు నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాధితులు  మాట్లాడుతూ... లారీల మితిమీరిన వేగంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయన్నారు. లారీలకు కనీసం పట్టాలు కట్టకుండా బొగ్గును రవాణా చేయడం ద్వారా బొగ్గు చూర ఇళ్లల్లోకి  చేరుతోందన్నారు. బ్లాస్టింగ్‌ వల్ల ఇళ్లు ధ్వంసం అవుతున్నాయని వాపోయారు. తమకు పరిహారం చెల్లిస్తే ఊరు ఖాళీ చేస్తామన్నారు. మణుగూరు ఓసీ రహదారికి బైపాస్‌ ఏర్పాటు చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్‌ చేశారు.

తమ సమస్యలను పరిష్కరించాలని సింగరేణి యాజమాన్యానికి ఎన్ని సార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని, సమస్య పరిష్కారించే వరకు వెళ్లేది లేదని భీష్మించారు. సుమారు నాలుగు గంటల పాటు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న మణుగూరు సీఐ మొగిలి, ఎస్సై జితేందర్‌  సింగరేణి ఎస్వోటు జీఎం ఎం.సురేష్, గని ఏజెంట్‌ లలిత్‌కుమార్, సెక్యూరిటీ అ«ధికారి నాగేశ్వర్‌రావు అక్కడకు చేరుకుని బాధితులతో మాట్లాడారు.  ఇళ్ల తొలగింపు విషయం హెడ్‌ ఆఫీస్‌  పరిధిలోనిదని,  సమస్య  పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు.

11 మందిపై కేసు నమోదు 
అనుమతులు లేకుండా రోడ్డుపై ఆందోళన చేపట్టారంటూ రాజుపేటకు చెందిన 11 మంది వ్యక్తులపై మణుగూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మణుగూరు ప్రాజెక్టు అధికారి లలిత కుమార్‌ ఫిర్యాదు మేరకు రాజుపేటకు చెందిన సాంబశివరావు, తార, అక్బర్, పన్నాలాల్, చంద్రశేఖర్, యాణోత్‌ సతీష్‌ నాగరాజు, తులసీరాం, భూక్యా వినోద్, బాణోత్‌ సతీష్, లక్‌పతి, మంగమ్మలపై కేసు నమోదు చేసినట్లు మణుగూరు సీఐ మొగిలి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement