
తీవ్ర గాయాలపాలైన బాలుడు అరవింద్
టేకులపల్లి : రిమోట్ కారు పేలి బాలుడికి తీవ్ర గాయాలైన సంఘటన టేకులపల్లి మండలం కొప్పురాయి పంచాయతీ కొత్తూరు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పాయం శ్రీను, రజిత దంపతుల కుమారుడు అరవింద్ అదే గ్రామంలో నాలుగో తరగతి చదువుతున్నారు. శుక్రవారం పాఠశాల అనంతరం ఇంటికి వచ్చి తన రిమోట్ కారుతో సరదాగా ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో రిమోట్ కారు పేలి ముక్కలైంది. అరవింద్ ఎడమ చేయికి, పొట్టపై తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు ప్రథమ చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు. రిమోట్ కారు పేలినపుడు బాంబు పేలినట్లు పెద్ద శబ్దం రావడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు.