సౌరమానం: ఈ వారం రాశి ఫలితాలు(జులై 6 నుంచి12 వరకు)

Weekly Horoscope in Telugu - Sakshi

జన్మనక్షత్రం తెలియదా? నో ప్రాబ్లమ్‌! మీ పుట్టినరోజు తెలుసా? మీ పుట్టిన తేదీని బట్టి ఈవారం (జులై 6 నుంచి12 వరకు) మీ రాశి ఫలితాలు

మేషం(మార్చి 21 –ఏప్రిల్‌ 19)
దానికోసం ఏమాత్రమూ వెంపర్లాడటం, ఏదోవిధంగా సంపాదించెయ్యాలన్న తపన, పట్టుదల అనేవి ఏమాత్రమూ లేకుండానూ ధర్మబద్ధంగానూ ధనం దానంతట అదే వచ్చేస్తుంది. అకస్మాత్తుగా ధరల పెంపుదలా జీతాల పెరుగుదలా కొన్న వస్తువుల అమ్మకాలు పెరగడం వంటి వాటి కారణంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంపాదన బాగా ఉంటుంది. ఇది కేవలం ధర్మబద్ధ సంపాదన కావడమనేది నిజంగా సంతోషించదగిన విషయం. అనుసరించ వలసిన అంశం కూడా.

ఇలా ఆర్థికంగా ఎదిగిన కారణంగా దాన్ని సద్వినియోగం చేసేందుకై పొలాలూ స్థలాలూ ఇళ్లూ వాహనాలూ అంటూ అనేక ప్రాంతాలు తిరిగే అవకాశముంది. బంగారం వెండీ మొదలైన లోహాల మీదికి దృష్టి పోక పోవచ్చుగాని భూ గృహాల మీద ఇష్టం మరింతగా ఉండచ్చు.

అయితే బంధువుల నుండి కొనుక్కోవడంలో కొన్ని మొహమాటాలకి సంబంధించిన ఇబ్బందులు (పత్రాలు సరిగా లేకపోయినా ఫరవాలేదనుకుంటూ కొనుక్కోదలచడం వంటివి) ఉండచ్చు కాబట్టి వీలైనంత వరకూ మానుకోవడం మంచిది. లేదా వ్యవహార రీత్యా కచ్చితంగా ఉండడం మంచిది.మరో అదృష్టకరమైన అంశమేమిటంటే నిరుద్యోగులకు ఏదో తీరు ఉద్యోగం వ్యాపారం వంటి ఉపాధి లభించే అవకాశం ఉంది కూడా. ఒక్కసారిగా ధనాన్ని సంపాదించెయ్యాలనే అత్యాశ వచ్చే ఆలోచనని మాత్రం విరమించుకోవాల్సిందే. వయసు పెరిగిన కారణంగా కూడా ఈ అత్యాశ ఆలోచన కలగవచ్చు. మంచిది కాదు.
లౌకిక పరిహారం: మొహమాటం వద్దు వ్యవహార విషయంలో.
అలౌకిక పరిహారం: ఆదిత్య హృదయ స్తోత్రం మంచిది.

మిథునం(మే 21 –జూన్‌ 20)
మంచి తెలివితేటలనీ దాంతోపాటు ఆరోగ్యాన్నీ ఇచ్చే రవి అర్ధశుభునిగా ఉన్న కారణంగా మీకు మీరుగా ఏ విషయంలోనూ ఓ నిర్ణయాన్ని తీసేసుకోకండి. ఎవరైనా అనుభవజ్ఞులైన పెద్దల్ని సంప్రదించి ఆ మీదటే ఓ నిర్ణయానికి రావడం మంచిది.ఇక ఆరోగ్య విషయానికొస్తే సకాల భోజనం సకాల నిద్రా అవసరమని గుర్తించండి. ఎంత ఉద్యోగాన్ని చేస్తున్నప్పటికీ ఇది శరీరమే కాబట్టి కొన్ని గంటలపాటు చేసిన పనికి అలిసిపోక తప్పదు. ఆ కారణంగా కేవలం పనిమీద ధ్యాసా పై అధికారుల మెప్పూ మాత్రమే ముఖ్యమనుకుంటూ మరింత శ్రమకి శరీరాన్ని గురి చేయకండి. సరైన సమయంలో శరీరం ఈ శ్రమభారాన్ని మోయలేక మొండికేస్తే పనులన్నీ నిలిచిపోయే ప్రమాదముంది.

సంగీతంలో వినోద కార్యక్రమాల్లో లేదా సాహిత్య రంగంలో గాని ఓ స్థాయి మీకున్నట్లయితే ప్రచారం ద్వారా మరింత ఎత్తుకెదిగే అవకాశముంది కాబట్టి తప్పక ప్రయత్నాలని ప్రారంభించండి. ప్రతిభ లేని పక్షంలో ప్రయత్నాన్ని గాని చేసినట్లయితే సమయం ధనం అనే రెండూ కూడా వ్యర్థమవుతాయి.
న్యాయస్థానంలో ఏదైనా తీర్పు రాకుండా గాని ఉన్నట్లయితే వాటిలో అనుకూలపు తీర్పు రాకపోవచ్చుననే ఆలోచనతో ఉండడం మంచిది. అయితే వ్యతిరేకపు తీర్పు ప్రభావం మీ మీద ఉండే అవకాశం ఉండదు– దానిక్కారణం మీరు వెంటనే ఈ తీర్పుని సవాలు చేస్తూ మరో న్యాయస్థానాన్ని ఆశ్రయించడమే.
ప్రస్తుతం వేటినైనా కర్మాగారాలు గాని గృహాలు గాని లేదా ఇతరమైన కట్టడాలు గాని నిర్మాణ దశలో ఉంటే మరింత నిదానంగా నడుస్తాయి లేదా ఆగిపోవచ్చు కూడా. ముందుకి ముందే ఉత్సాహ ప్రదర్శన కోసం నిరుత్సాహకరంగా ఉండకపోవడం కోసం ఇలా చెప్పడం జరుగుతోంది.
లౌకిక పరిహారం: న్యాయస్థానపు తీర్పు సంతానపు ఎదుగుదల గురించి ఆలోచించండి.
అలౌకిక పరిహారం: శివాభిషేకం మంచిది.

సింహం(జూలై 23 –ఆగస్ట్‌ 22)
పని చేయాలని అనుకునేసరికి ఎన్నో చిక్కులూ ఇబ్బందులూ ఉన్నాయని అనిపిస్తుంది. అనిపించడమే కాదు ఆ విషయం నిజం కూడా. అయినా మీరంటూ ఓ ప్రయత్నాన్ని గాని చేసినట్లయితే మీరెలా పని ముగిస్తే బాగుంటుందని భావిస్తారో సరిగ్గా అలాగే ఆ పని ముగుస్తుందనేది యథార్థం. కాబట్టి ధైర్యంగా పనిలోకి దిగండి. వెనకబాటుతనం వద్దు.
యంత్రరంగం కార్మికవృత్తిలో ఉన్నవాళ్లు కొన్ని సంవత్సరాలుగా అదే పనిని చేస్తూ ఎంతో అలవోకగా పనిని చేస్తూ అడిగేవాళ్లే అయినా తగిన భద్రత జాగ్రత్తలని తీసుకోని పక్షంలో కొంత వ్యతిరేక ఫలితం గోచరిస్తోంది కాబట్టి, కొత్తగా ఈ పనిలో చేరినప్పుడు మీరెంత శ్రద్ధ జాగ్రత్తలతో ఉన్నారో అవే శ్రద్ధా జాగ్రత్తలని పాటించడం అత్యవసరం.
కుడిచేతితో సొమ్ము వస్తూనే ఉంటుంది. అయితే ఎడమచేతితో అలా ఖర్చు కూడా అదే స్థాయిలో అయిపోతూ ఉంటుంది. అలాగని దుర్వినియోగం వ్యర్థమైన వ్యయం. అప్పులిచ్చెయ్యడం... ఇలా వెళ్లిపోదు సొమ్ము. శాస్త్ర పరిభాషలో దీన్నే సత్‌వ్యయం అంటారు. అలాగే ఖర్చవుతుంది కాబట్టి కొత్త వస్తువుల కొనుగోళ్లూ ఇతరాలూ మనసులోగాని ఉంటే వాటిని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం ఉత్తమం.
దూరభార ప్రయాణమొకటి దాదాపు కంఠం మీదికి వచ్చి వెళ్లి తీరాల్సిన పరిస్థితికి వచ్చి ఉండచ్చు. మళ్లీ అదే ప్రయాణం ఆగిపోయుండచ్చు. ఆ కారణంగా చెప్పలేనంతటి ఆనందం మీకు కలిగి ఉండచ్చు. అయితే అదే ప్రయాణం మీకు తప్పనిసరి అయ్యే అవకాశముంది కాబట్టి శారీరకంగా మానసికంగా ఆర్థికంగా కూడా సిద్ధపడి ఉండండి. స్నేహ బాంధవ సంబంధాలని పెంచే ప్రయాణమే తప్ప ఆర్థిక ప్రయోజనాన్ని కల్గించే ప్రయాణం మాత్రం కాదిది.

లౌకిక పరిహారం: తప్పక అడ్డంకి వస్తుంది. అయినా ఎదుర్కోగలననే ధైర్యంతో ఉండండి.
అలౌకిక పరిహారం: కుంకుమ జలంతో శ్రీహరికి అభిషేకాన్ని చేయండి.

వృషభం (ఏప్రిల్‌ 20 –మే 20)
ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న పదవీ ఉన్నతి (ప్రమోషన్‌) తప్పక వచ్చే అవకాశముంది. అయితే ఓ విషయాన్ని ఈ సందర్భంగా ఆలోచించుకోవాలి. మీతోపాటు ఎదురు చూసిన మరికొందరు ఈ పదవీ ఉన్నతి తమకి కూడా రాని కారణంగా అసూయతో ఉంటారు. కాబట్టి వాళ్లు మానసికమైన భేదంతో– ఈ పదవీ ఉన్నతి అన్యాయమంటూనో మరో తీరుగానో మిమ్మల్ని తక్కువ చేస్తూ మాట్లాడినా మౌనంగా మీరు ఉండడం మంచిది తప్ప వాదానికి దిగకండి. అలాగని వాళ్లు ఏమేమి అన్నారో వాటిని పై అధికారికి చేరవేయకండి. కుటుంబంలో మంచి ఐకమత్యం ఉన్న కారణంగా మనసంతా పరమానందకరంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించిన కొత్త కొత్త ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది కూడా. సంతానం కూడా మాటలో నడిచేవాళ్లు అయిన కారణంగా ప్రస్తుతానికి ఏ తీరు సమస్యా లేదు. అష్టమంలో శని ఉన్నప్పటికీ హాని చేసే ఉద్దేశ్యంలో ఉండడు. పైగా రవి కుజ గురు శుక్రులు అనుకూలతతో ఉన్న కారణంగా సౌఖ్యం అనిపిస్తుంటుంది.
వ్యసనంగాని ఉండి ఉన్నట్లయితే మానుకోవడం తప్పనిసరి. అంతేగాక వ్యసనపరులతో గాని స్నేహం ఉన్నట్లయితే వాళ్లని దూరంగా ఉంచడం మంచిది. ప్రదేశం మారి వ్యసనాన్ని కొనసాగించడం మరింత కష్టాన్ని తెచ్చిపెడుతుంది. దానధర్మాల మీదికి దృష్టి వెళ్తుంది. ఆ కారణంగా తీర్థయాత్రలూ పుణ్యనదీ స్నానాలూ చేస్తారు. ధనం ఉన్న కారణంగానూ మరింత వస్తున్న కారణంగానూ అర్హులైనవారికి దానం చేయాలనే ఊహలు కూడా వస్తాయి.సంఘంలో ఓ మంచిపేరూ ప్రతిష్ఠ లభించే అవకాశముంది కాబట్టి చేయరాని పనుల్లో వేలు పెట్టడం, ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చడం, వాగ్వివాదాలవైపు వెళ్తూండడం సరికాదు.

లౌకిక పరిహారం: పదవీ ఉన్నతికి అవకాశముంది. అహంకరించకండి.
అలౌకిక పరిహారం: దుర్గాదేవీ స్తోత్రం మంచిది.

కర్కాటకం(జూన్‌ 21 –జూలై 22)
ఏనుగులన్నీ గజశాలలనుండి తప్పించుకుపోతూంటే సంచిలో నుండి జారిపోతున్న ఆవాల గురించి ఆలోచించాడని సామెత. అలాగే మీరు కూడా సకాలంలో స్పందించని కారణంగా మీరు ప్రభుత్వానికి కట్టవలసిన పన్నులో మరేమో మొదలైన వాటిమీద వడ్డీ బాగా చెల్లించవలసిన అవసరం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం అంతంత మాత్రంగానూ, అప్పుడప్పుడు మాత్రమే ఉంటూండే కారణంగానూ మానసికంగా కొంత నిరుత్సాహం అనిపించవచ్చు ప్రతి విషయంలోనూ. అయితే ఏ పనిని చేయబోయినా ప్రస్తుత దశకి అనుగుణంగా భార్యకీ సంతానానికీ ముందుగా చెప్పి చేయడం ఎంతైనా అవసరం. గురు శుక్ర శని కేతువులు శుభులుగా ఉన్న కారణంగా ఏ విధమైన ప్రతికూల ఫలితాలూ బయటివారినుండి ఉండవు– వచ్చే అవకాశం కూడా లేదు. అయితే ఉండేదల్లా అనవసర వ్యయం, నిష్కారణ జాప్యమూ మాత్రమే. దీని నివారణ కోసం మీరు ఇతరుల పనుల్లో మరింత శ్రద్ధని పెట్టకుండా ఉంటే సరి. తప్పనిసరిగా ఓ ఆర్థిక విషయంలో మీరు మధ్యవర్తిత్వాన్ని వహించవలసి రావచ్చు. ప్రస్తుతం నేను సహకరించలేననే విషయాన్ని నిష్కర్షగా చెప్పేయడం అవసరం.

వ్యాపారమేగాని మీరు చేస్తూ ఉన్నట్లయితే వ్యాపారంలో భాగస్వాములతో చక్కటి స్నేహభావంతోనే ఉండండి తప్ప అనుమాన దృక్పథంతో అసలుండద్దు. ఎవరినైనా భాగస్వాముల్ని గురించి ఏవైనా చాడీలు చేరవేయబోతే– మాటకి నిలబడగలవా. ఆ చెప్పిన వానితో అడగమంటావా? అని ఈ తీరుగా అడగండి. కేవలం మీకూ మీ భాగస్వాములకీ మధ్య ఆంతరంగిక భేదాన్ని కావాలని ఏర్పాటు చేయాలనే భావంతో చేస్తున్న పనే ఇదంతా. మీరు గట్టిగా ఉన్నారని తెలిసిన పక్షంలో ఇలాంటివాళ్లు మీ దగ్గరకి చేరరు సరికదా మీ భాగస్వాములు కూడా మీ గురించి ఆనందపడతారు.
లౌకిక పరిహారం: కుటుంబ సభ్యులతో ఎక్కువసేపు గడుపుతూ ఉండండి.
అలౌకిక పరిహారం: ఆంజనేయుని ద్వాదశ నామాలనీ పఠిస్తూ ఉండండి.

కన్య(ఆగస్ట్‌ 23 –సెప్టెంబర్‌ 22)
ఎంత సమర్థతతో మీరు అన్ని పనుల్నీ నిర్వహించుకుపోతున్నా ఎందుకో తెలియని అడ్డంకులూ ఏవేవో అనవసరమైన నిందలూ నిష్కారణమైన సమస్యలూ రావచ్చు. చెరువులో దిగి నడిచి అవతలి ఒడ్డున ఉన్న ఊరికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఎలా ముందుకి ముందే అన్ని జాగ్రత్తలనీ తీసుకుని తగినంత భద్రతని పాటిస్తూ వెళ్తామో అలాగే మీరూ సిద్ధంగా ఉండండి. ఆనందించదగిన అంశమేమంటే మీకు ఏ తీరు వ్యతిరేక ఫలితమూ రాదు. అంతా సవ్యంగానే సాగిపోతుంది చివరి వరకూ.

దురదృష్టవశాత్తూ ఏదైనా ఓ వ్యవహారం చినుకు చినుకు గాలివానగా మారి న్యాయస్థానం వరకూ వెళ్లి ఉన్నట్లయితే ప్రస్తుత దశలో దాని గురించిన అనుకూలపు తీర్పు రాకపోవచ్చు. అంతమాత్రాన నిరాశ పడవలసిన అవసరం లేదు. తప్పక పై న్యాయస్థానానికి మనవి చేసుకుని విజయాన్ని పొందగలిగే అవకాశముంది. ఆ మనవికి కావలసిన వెసులుబాటుని న్యాయస్థానమే ఇస్తుంది కూడా. వాహనం పని చేస్తూనే ఉంది కదాని అలా పని చేయిస్తూ చేయిస్తూ ఉన్న పక్షంలో ఎలా ఒక్కసారి అనుకోకుండా మొరాయిస్తుందో సరిగ్గా అలాగే వేళాపాళా లేకుండా ఇంత అంత అనకుండా శరీరాన్ని మీరు శ్రమింపజేస్తున్న కారణంగా ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉండచ్చు– ఔషధ సేవ తప్పకపోవచ్చు చకూడా. సంస్కృతంలో ఓ మాట ఉంది– శరీరం బాగున్న దశలోనే ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ ఉండడం సరైన పని తప్ప, మూల పడ్డాక వైద్యం చేయించుకోవడమనేది చిల్లుపడిన సంచి నుండి బియ్యం జారిపోతుంటే సంచి నిండుగా ఉండేందుకు పైనుండి బియ్యాన్ని పోసి పూరిస్తున్నట్లే– అని. గమనించుకోండి. తలిదండ్రుల్ని చూడ్డం కోసమో లేక ఆస్తుల పరిరక్షణ నిమిత్తమో ఓసారి స్వస్థలానికి వెళ్లొచ్చే అవకాశముంది. అదీగాక దానధర్మాల దృష్టితోపాటు తీర్థయాత్రలూ పుణ్యనదీస్నానాలూ చేసే అవకాశమూ ఉంది.

లౌకిక పరిహారం: తక్కువ మాట్లాడుతూ ఎక్కువ ఆలోచనని చేస్తూ ఉండండి.
అలౌకిక పరిహారం: శంకరునికి మారేడు పత్రాలు ముంచిన నీటితో అభిషేకం చేయండి.

తుల(సెప్టెంబర్‌ 23 –అక్టోబర్‌ 22)
కావాలనే మీ పై అధికారులు మీ చేత మీరు చేసిన పనినే మళ్లీ చేయించవచ్చు. అలాగే వృత్తిలో ఉన్నవారితో వారు చేసిన వస్తువునే కొద్ది మార్పులతో మళ్లీ చేయవలసిందిగా పురమాయించవచ్చు. ఇదే తీరుగా వ్యాపారపు లెక్కల్ని సరిగానే సమర్పించినప్పటికీ మరికొన్ని సూచనలు చేసి ఆ పద్ధతిగా దాఖలు చేయవలసిందిగా చెప్పవచ్చు. దీని సారాంశమేమంటే మీకు మీరుగా చేసిన పనినే తిరిగి చేయడానికి సిద్ధంగా–  శారీరకంగానూ మానసికంగానూ కూడా ఉండవలసిందని చెప్పడమే.

వ్యాపారం చేస్తుండేవారైతే కందులూ మినుములూ పెసలూ వడ్లూ మొదలైన వ్యాపారాలు అనుకూలంగా ఉంటూ, వెండి బంగారు లోహ వ్యాపారాలు అంత వేగంగా ఉండకపోవచ్చు. అయితే రాగికి మాత్రం మంచి విలువతోపాటు వ్యాపారానికి అవకాశం బాగా ఉండే పరిస్థితి గోచరిస్తోంది. ఇత్తడి ద్వితీయ స్థానంలో ఉంది. అలాగని దురాశతోనో అత్యాశతోనో ఎక్కువెక్కువగా లోహాన్ని నిల్వ చేసి ఉంచుకోవద్దు.
ఎందరెందరో దూరప్రాంతపు వారితో కూడా పరిచయాలు లభించే అవకాశముంది. ‘అతి సర్వత్ర వర్జయేత్‌’ అనే మాట ప్రకారం మీకు కలిగిన ఆ పరిచయాన్ని కావాలని దూసుకుపోతూ పెంచేసుకోకండి. నిదానంగా పెరిగే స్నేహం మాత్రమే చిరకాలం నిలుస్తుందని అనుభవజ్ఞులు చెప్తుండే మాట.

అవకాశం ఉన్నంతలో వచ్చిన సమస్యా పరిష్కారానికి పట్టుదల మాత్రమే కారణమేమో గమనించుకుని పట్టుదల విషయంలో ఒక అడుగు కిందికి దిగుదామనే భావంతో ఉండడం మంచిది. జీవితంలో ఎక్కువకాలం కోపం పట్టుదలలతో గడిచిపోతే ఆనందించే కాలం ఎంత ఉటుందని ఆలోచించుకోండి!
లౌకిక పరిహారం: సమయాన్ని వ్యర్థం చేసుకోకుండానూ శారీరక శ్రమకి సిద్ధపడుతూ ఉండండి.
అలౌకిక పరిహారం: శంకరునికి భస్మజలంతో అభిషేకాన్ని చేయండి.

ధనుస్సు(నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
శుక్రుడూ రాహువూ కేతువూ కూడ అర్ధశుభులుగా ఉన్న కారణంగా శరీరంలో ఉన్న 24 అవయవాల్లో ఒకదానిలో అస్వస్థత తొలగి ఆనందంగానూ ఆరోగ్య స్థితిలోనూ ఉన్నానని భావించేంతలోనే మరో అవయవంలో అస్వస్థత గోచరించవచ్చు కాబట్టి శరీరాన్ని అధిక శ్రమకి గురి చేయకండి. దాంతో పాటు సకాలంలో నిద్రించడం, సకాలంలో భోజనాన్ని ముగించడం చేస్తూ ఉండండి.
శాస్త్రం గృహంలో చేసిన భోజనానికి ప్రాధాన్యాన్ని ఇచ్చిన కారణంగా వీధి భోజనాలని మానినట్లయితే చక్కని ఫలితం ఉంటుంది. ఎప్పుడో దూరం వెళ్లిపోయిన కారణంగానో, రాకపోకలు సక్రమంగా లేకపోయిన కారణంగానో ఆప్తులే అయినప్పటికీ కూడ దూరపు బంధువులుగా మారినవాళ్లు దగ్గరయ్యే అవకాశముంది.

బంధువుల్ని కలుపుకోండి. ధైర్యంగా ఉంటుందిగా! ఎంతటి వాదం వచ్చినా కేవలం వాదం వరకే పరిమితం కండి తప్ప వాదాన్ని మరింతగా పెంచుకుని న్యాయస్థానం తలుపుల్ని తట్టకండి. జన్మ (1వ యింట) శని అయిన కారణంగా వాదాన్ని మరింత బలంగా చేసి, సమస్యకి పరిష్కారం లభించకుండా ఉండేలా చే(సే)స్తాడు.
ఆ తర్వాత ఇబ్బంది పడేది మీరే. ఆర్థికంగా మానసికంగా శారీరకంగా కీర్తి ప్రతిష్టల పరంగా అన్నిటా నష్టపోతారు. ఇంట్లో కొద్ది వృద్ధాప్యదశలో ఉన్న వారెవరైనా ఉంటే ఒంటరిగా పంపడం సరికాదు. తోడిచ్చి పంపించండి. అలాగని భయపడుతూ కూర్చోకండి. ఇది ముందు జాగ్రత చర్య మాత్రమే. వృద్ధాప్యంలో నిజానికి బుర్ర ఖాళీగా ఉండాల్సి ఉన్నప్పటికీ లేని బాధ్యతలని గురించి ఆలోచిస్తూ బాహ్యదృష్టిలో ఉండరని గుర్తుంచుకోండి.
లౌకిక పరిహారం: ఇతరుల పనుల్ని నెత్తిమీద పెట్టుకోకండి.
అలౌకిక పరిహారం: శివ కేశవుల్ని ఒకే పీఠం మీద ఉంచి ఆర్చించండి.

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
శత్రుశేషం అగ్నిశేషం రుణశేషం ఉంచుకోవడం సరికాదు. ప్రభుత్వానికి కట్టవలసిన పన్నుల్నీ ఏవేవో కారణాలతో ఏ కొద్దిపాటి మొత్తాన్ని కట్టకపోయినా అవి అతి ముఖ్యమైన పనుల్ని చేసుకోబోతున్నవేళ అడ్డుగా నిలిచి విఘ్నాలుగా మారి తీరుతాయి. అప్పుడు ఆ రుణం విలువ తెలిసే అవకాశం రావచ్చు మీకు.
అంతదాకా ఎందుకు? కట్టెయ్యండి, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడంలో భాగం రుణాన్ని సకాలంలో తీర్చేయడం కూడ. ఎరిగున్నవారి నుండి ఇంకా కొందరి నుండీ ఏవేవో అవసరాల నిమిత్తం తెచ్చిన రుణాలని కూడ తీర్చగలిగితే తీర్చండి. తీర్చలేని పరిస్థితే అయితే ఎప్పుడు తీర్చగలరో స్పష్టంగా చెప్పండి తప్ప వాయిదాలు వేస్తూ నమ్మకాన్ని చెడగొట్టుకోకండి. ఒక్కసారంటూ నమ్మకాన్ని కోల్పోతే ఆ అవిశ్వాసమనే పిచ్చుక మనకి గట్టి అవసరం వచ్చిన వేళ గ్రద్ద పరిమాణంలో హానిని కల్గించవచ్చు. గమనించుకోండి.
ఇంటికి సంబంధించి చేసుకోవలసిన ఎన్నెన్నో పనులుంటాయి ఎవరికైనా. ఎప్పటికప్పుడు ‘చేసుకోవచ్చులే’ అనుకుంటూ దాటేస్తూండే పనులు అలాటి వాటిని పూర్తి చేసుకోడానికి అనువైన సమయమిది. వీటిని ఇలా పేరబెట్టుకుంటూ వినోదం విహారం కబుర్లతో కాలక్షేపం చేసుకుంటూ రోజుని వ్యర్థం చేసుకోకండి.
విత్తనాలు చల్లవలసిన కాలంలో వినోదం సరికాదు గదా! సంతానానికి తమ తమ రంగాల్లో మంచి కీర్తి ప్రతిష్టలు లభించే అవకాశముంది కాబట్టి వాళ్లని ప్రోత్సహిస్తూనే ఉండండి. నిరుత్సాహపరుల్ని వారితో చేరనీయకండి.

లౌకిక పరిహారం: రుణాలని తీర్చేసి మనశ్శాంతితో ఉండండి.
అలౌకిక పరిహారం: రోజూ దేవాలయానికి ఈ వారం రోజుల పాటు వెళ్లండి.

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
ప్రభుత్వంలో ఎక్కువమంది నాకు తెలుసుననే ధీమాతోగాని ఎన్నెన్నో సమస్యలొచ్చినా చక్కగా పరిష్కరించుకోగలిగాననే మనోధైర్యంతోనూ, ఇప్పట్లో రాగలిగిన సమస్యలంటూ ఏమీ లేనేలేవనే భావనతోనూ వృత్తి ఉద్యోగ వ్యాపారాలని అశ్రద్ధ చేస్తూ ఉన్నట్లయితే తప్పక తాత్కాలికమైన ఇబ్బందికి గురయ్యే అవకాశముంది కాబట్టి జాగ్రత్తతో మాత్రమే బాధ్యతలని నిర్వహించుకోండి. కాలం కలిసి రాని పక్షంలో తాడే పామై కరుస్తుందని గదా పెద్దలమాట! ప్రారంభంలో మీరు వేసుకున్న అంచనాలన్నీ కొద్దిగా మార్పులకీ చేర్పులకీ గురయ్యే అవకాశమున్న కారణంగా– ప్రారంభంలోనే ‘ఇంతవుతుందంటూ’ బహిరంగ ప్రకటనలని ఎక్కువ సంఖ్యలో చేయకండి దయచేసి. అంతేగాక మరికొంత వ్యయమయ్యే అవకాశముందని ముందుకి ముందే మీకు తెలుస్తున్న కారణంగా ధనాన్ని కొద్దిగా నియంత్రించుకుంటూ రుణాన్ని అడగాల్సిన అవసరం లేకుండా/రాకుండా వ్యయాన్ని కొద్ది జాగ్రత్తగా చేస్తుండడంతోపాటు మరికొంత సొమ్ముని కూడా చేతిలో ఉంచుకోండి. ఎవరో ఇచ్చేవాళ్లున్నారనే ధీమాతో ఉండకండి. చేతిలో కనిపిస్తున్నదీ ఉన్నదీ మాత్రమే ధనం అని భావించుకోండి.
ఆప్తులూ బంధువులూ వీరేగాక మీరు నిరంతరం వాళ్లకి సహకరిస్తుండే కారణంగా కొందరు దగ్గరతనం ఉన్న మిత్రులూ మీకు ఉండవచ్చునేమో గాని ప్రస్తుత దశలో (3వ ఇంట శని ఉన్న కారణంగా)మీరు పిలిచిన వెంటనే పలికే దూరంలోగాని, అవకాశం ఉన్న స్థితిలో గాని వారుండకపోవచ్చు. ఆ కారణంగా– వాళ్లున్నారు గదా! అనే ధీమాతో ఉండకండి! సొంతంగానే చేసుకోవాలనే స్థిర నిర్ణయంతోనే ఉండండి.
దాంపత్య సంఘర్షణ అలాగే ఉంటుంది. న్యాయస్థానం కూడా మీకు సహకరించకపోవచ్చు. శారీరక ఆర్థిక మానసిక శ్రమ తప్పదు.
లౌకిక పరిహారం: సహాయం ఏవిధంగానూ ఉండకపోవచ్చుననే ఆలోచనతోనే ఉండండి.
అలౌకిక పరిహారం: నవధాన్యాలని ముంచిన జలంతో శివాభిషేకాన్ని చేయండి/ చేయించండి.

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
దైవమంటే భక్తి విశ్వాసాలుండడం అవసరం గాని అది కూడ శ్రుతి మించడం సరికాదు. అలాగే దాన ధర్మాల విషయంలో కూడ. సంతానం కలిగిన ఆనందం, పెద్దగా లాభాలు లేకున్నా వ్యాపారం ద్వారా ఇల్లు నడిచిపోతోందనే సంతోషం, ఇంట్లో వృద్ధులున్నా ఆరోగ్యవంతులుగానే కాలాన్ని నెడుతున్నారనే ఉత్సాహంతో విందున్నప్పటికీ కూడ వ్యాపారం లేదా ఉద్యోగపరంగా సూర్యుడు పొడిచిందగ్గర్నుండి రాత్రి పొద్దు పోయేవరకూ తిరగడమే ఔతున్న కారణంగా శారీరకశ్రమ అధికం అత్యాధికం అయ్యే అవకాశం ఉంది.
ఈ తిప్పటకి తట్టుకోవలసిందే తప్ప దాటే ఉపాయం లేదు. గురువూ రాహువూ శుభులుగా ఉన్న కారణంగా వ్యతిరేకమంటూ జరిగే సూచనలేదు గాని ఎందుకో సంతోషం మాత్రం దుఃఖం అనే పొట్లంలో చుట్టి కన్పిస్తున్నట్లే అన్పిస్తుంది. జీవితానికి ఆధారభూతమైన/ ఆధారభూతురాలైన వ్యక్తికి ఓపిక తగ్గడం లేదా సహకరించ(లే)కపోవడం వీటికి తోడుగా కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకోవాలనే ఊహని బలంగా బంధువులెందరో ఉపదేశించి ఉండడం కారణంగా ఆ సహాయæహస్తానికి సంబంధించిన సేవని పొందలేకపోవచ్చు. ఈ హఠాత్పరిణామం ఒక్కసారి కుటుంబాన్ని కుదిపేయచ్చు. వారి ఓపిక విషయం అనేది మనం కూడా ఆలోచించవలసిన అంశమే కదా! మీరు వ్యసనానికి లొంగే అవకాశమైతే లేదుగాని, వ్యసనపరులతో ఉన్నా స్నేహం మాత్రం మానలేరు. ఆ కారణంగా కుటుంబసభ్యులకి మాత్రం మీ గురించి కొంత ఆందోళనగానే ఉంటుంది. కుటుంబం అందరి మధ్యలోనూ ఏదో ఓ సందర్భంలో ఈ వ్యసనం గురించిన మీ స్థిరనియమాన్ని ప్రతిజ్ఞ చేసినట్లు చేయండి. దీంతో కుటుంబం మొత్తానికి మీ మీద గురి ఏర్పడుతుంది.
లౌకిక పరిహారం: వ్యసనాల జోలి వద్దు.
అలౌకిక పరిహారం: అనుభవజ్ఞుల్ని సంప్రదిస్తూనే ఉండండి.

మీనం(ఫిబ్రవరి 19 – మార్చి 20)
ఆర్థికంగా బాగా పుంజుకుంటారు. మంచిదే. సంఘంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు. మరింత మంచిదే. మరి ఇంట్లో వివాహాలకి సిద్ధంగా ఉన్న కన్యల మాట? అలా ఉన్నట్లయితే ఈ సంపాదనల ధోరణి నుండి పక్కకి మరలి, పిల్లల పెళ్లిళ్ల కోసం తిరగడమనేదాన్ని గమనించి అది కూడా ఓ పనిగా పెట్టుకోవడం కాకుండా, అదే పనిగా పెట్టుకుని తిరగండి. తొందరలో వివాహాలు నిశ్చయమౌతాయి.
పెద్ద బరువు తీరిపోతుంది. పదిమంది పరామర్శలూ తొలగిపోతాయి. కుటుంబంలో ఐకమత్యం ఉన్న కారణంగా మనశ్శాంతిగా ఉంటారు. బంధువుల రాకపోకలుండచ్చు. వాళ్లు వచ్చిన సందర్భంలో కుటుంబానికి సంబంధించిన ఆస్తివ్యవ్యవహారాలూ వ్యక్తిగత విశేషాలూ గురించిన వివరాలూ వాళ్లకి తెలియనవసరం లేదని భావించి అలాటి విషయాల్లో గుంభనని పాటించండి.
గుచ్చి గుచ్చి వాళ్లు అడిగేంతటి అవకాశాన్నీ చనువునీ ఈయకండి. సంతానం చదువులో బాగుండచ్చు గాని వాళ్ల ప్రవర్తనలో ఏ విధమైన తేడాలు గానీ ఉన్నాయేమో ఓ కంట కనిపెడుతూ ఉండడం అవసరం. అలాగని నిఘాపెట్టినట్లూ ప్రతి విషయంలోనూ సంశయిస్తూన్నట్లూ గాని మీరు వాళ్లకి అర్థమైతే పరిస్థితి పూర్తిగా తారుమారౌతుంది. జాగ్రత్త!
రుణాన్ని దగ్గర వాళ్లు అడిగే అవకాశముంది. అలాగే దగ్గరవాళ్లు వాళ్ల ఆస్తిని అమ్మే అవకాశం కూడ రావచ్చు. పూర్తిగా పత్రాలని సరిగా చూసుకున్న తర్వాతనే ఆస్తి గురించి ఆలోచించండి తప్ప వ్యవహార విషయంలో మొగమాటం వద్దు. మీ ఆస్తిగాని మీ పెదనాన్న చిన్నాన్నల వద్ద కొన్ని సమస్యల్లో లేదా పంపకాలు కాని స్థితిలో ఉన్నట్లయితే పెద్ద మనుష్యులతో పరిష్కరించుకునేందుకిది చక్కని కాలం.
లౌకిక పరిహారం: పిల్లల ప్రవర్తనని కూడ గమనిస్తూ ఉండండి.
అలౌకిక పరిహారం: గణపతి షోడశనామాలనీ చదువుతూ ఉండండి.

- డాక్టర్‌ మైలవరపు శ్రీనివాసరావు
జ్యోతిష్య పండితులు

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top