జెడ్పీ సారథి నామన

జెడ్పీ సారథి నామన - Sakshi


సాక్షి, కాకినాడ : ముహూర్తం ముంచుకొచ్చినా.. జెడ్పీ చైర్మన్ అభ్యర్థిత్వంపై తేల్చుకోలేకపోవడంతో టీడీపీ జెడ్పీ టీసీలు శనివారం మధ్యాహ్నం వరకూ పార్టీ కార్యాల యానికే పరిమితమయ్యారు. దాంతో ఉదయం పదిగంటలకే జరగాల్సిన ఎక్స్ అఫిషియా సభ్యుల ఎన్నిక,  సభ్యుల ప్రమాణస్వీకారం, చైర్మన్, వైస్ చైర్మన్ జాప్యమయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి టీడీపీ జెడ్పీటీసీలు  జెడ్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పతో పాటు పలువురు పార్టీ ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరయ్యారు. ఎక్స్ అఫిషియా సభ్యులుగా కొవ్వాడకు చెందిన మట్టా సూర్య సత్యప్రకాశరావు, ద్రాక్షారామకు చెందిన మీర్జా ఖాసిం ఖాజీ హుస్సేన్‌లను టీడీపీ ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రిసైడింగ్ అధికారి, కలెక్టర్ నీతూ ప్రసాద్ ప్రకటించారు.

 

 జెడ్పీ ఎన్నికల ఆర్వో, సీఈఓ మజ్జి సూర్యభగవాన్ జెడ్పీటీసీ, కో ఆప్షన్ సభ్యులతో అక్షర క్రమంలో ప్రమాణం చేయించారు. తొలుత టీడీపీకి చెందిన అమలాపురం జెడ్పీటీసీ సభ్యురాలు అధికారి జయ వెంకటలక్ష్మి ప్రమాణం చేశారు.పార్టీ కండువాలతో హాజరైన వైఎస్సార్ సీపీ సభ్యులుచిర్ల జగ్గిరెడ్డి, వంతల రాజేశ్వరిల ఆధ్వర్యంలో పార్టీకి చెందిన 14 మంది జెడ్పీటీసీ సభ్యులు పార్టీ కండువాలు ధరించి సమావేశానికి హాజరయ్యారు. వారిలో తొలుత దేవీపట్నం జెడ్పీటీసీ సభ్యురాలు మట్ట రాణి, తర్వాత జ్యోతుల నవీన్‌కుమార్, మిగిలిన సభ్యులు ప్రమాణం చేశారు. వారిని ఆ పార్టీ యువజన, వాణిజ్య విభాగం కన్వీనర్లు అనంత ఉదయభాస్కర్, కర్రి పాపారాయుడు అభినందించారు.

 

 రాంబాబును ప్రతిపాదించిన పేరాబత్తుల

 ప్రమాణ స్వీకారాల అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నిక చేపట్టారు. పి.గన్నవరం జెడ్పీటీసీ సభ్యుడు నామన రాంబాబు పేరును చైర్మన్ పదవిని ఆశించి భంగపడిన ఐ.పోలవరం జెడ్పీటీసీ సభ్యుడు పేరాబత్తుల రాజశేఖర్ ప్రతిపాదించగా, కడియం జెడ్పీటీసీ సభ్యురాలు పాలపర్తి రోజా బలపర్చారు. వైస్ చైర్మన్‌గా రంగంపేట జెడ్పీటీసీ సభ్యుడు పెండ్యాల నళినీకాంత్ పేరును గొల్లప్రోలు జెడ్పీటీసీ సభ్యుడు మడికి సన్యాసిరావు ప్రతిపాదించగా, తాళ్లరేవు జెడ్పీటీసీ సభ్యురాలు పొన్నమండ రామలక్ష్మి బలపర్చారు. నామన, పెండ్యాల ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించిన కలెక్టర్ నీతూ ప్రసాద్ వారితో ప్రమాణం చేయించారు.

 

 ‘నామన ’కు అభినందనల వెల్లువ

 జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికైన నామన రాంబాబును ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, టీడీపీ ఎమ్మెల్యేలు గొల్లపల్లి సూర్యారావు, తోట త్రిమూర్తులు, పులపర్తి నారాయణమూర్తి, దాట్ల బుచ్చిరాజు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వేగుళ్ల జోగేశ్వరరావు, ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ, పెందుర్తి వెంకటేష్, మాజీ మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, పార్టీ రాష్ర్ట ప్రధానకార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం అభినందించారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెలేలు నెహ్రూ, జగ్గిరెడ్డి, రాజేశ్వరి, ఆ పార్టీ జెడ్పీటీసీ సభ్యులు జ్యోతుల నవీన్‌కుమార్ తదితరులు నామనను అభినందించారు. ప్రజలకు మంచి చేస్తే  సహకరిస్తామని, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడితే ఎండగడతామని నెహ్రూ పేర్కొన్నారు. జెడ్పీ కార్యాలయ సిబ్బంది, ఎంపీడీఓలు, వివిధశాఖల అధికారులు నామనను అభినందించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top