దోపిడీ పాలనకు చరమగీతం పాడదాం

YV Subba Reddy to take out padayatra for Veligonda project - Sakshi

రాజన్న రాజ్యం తెచ్చుకుందాం

సమస్యలన్నీ    పరిష్కరించుకుందాం

వెలిగొండ ప్రాజెక్ట్‌ కోసం నిరంతర పోరాటం

మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

మూడోరోజు 15.3 కి.మీ మేర పాదయాత్ర

వైవీ యాత్రకు మద్దతు పలికిన ప్రజానీకం

నాగంపల్లిలో రైతులతో ముఖాముఖి

కొనకనమిట్ల: ప్రజల విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు దోపిడీ ప్రభుత్వానికి చరమ గీతం పాడుదామని ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. త్వరలోనే రాజన్న రాజ్యం తెచ్చుకుందామన్నారు. పశ్చిమ ప్రాంత ఆశాజ్యోతి వెలిగొండ ప్రాజెక్ట్‌ను తక్షణమే పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ వైవీ చేపట్టిన పాదయాత్ర మూడో రోజు శుక్రవారం కొనకనమిట్ల మండలం గొట్లగట్టు నుంచి ప్రారంభమైంది. పాదయాత్ర ప్రారంభంలో స్థానిక మహిళలు సుబ్బారెడ్డికి హారతులిచ్చి ఆయన వెంట అడుగులో అడుగేస్తూ ముందుకు కదిలారు.

 పాదయాత్ర గొట్లగట్టు, బ్రాహ్మణపల్లి, చినమనగుండం, నాగంపల్లి, వింజవర్తిపాడు, మీదుగా వెలుగొండ స్వామి ఆలయం వరకు కొనసాగింది. చినమనగుండం బస్టాండ్‌ సెంటర్లో యువకులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో వైవీకి పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. బ్రాహ్మణపల్లి, నాగంపల్లి వద్ద మహిళలు పూలు చల్లుతూ వైవీకి స్వాగతం పలికారు. గొట్లగట్టు పొలాల్లో పనులు చేసే మహిళా కూలీలు వైవీ బస చేసిన శిబిరం వద్దకు వచ్చి మద్దతు తెలిపారు. 

ఆయా గ్రామాలకు వైఎస్సార్‌సీపీ నాయకులు పెద్ద ఎత్తున స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేసి అమ అభిమానాన్ని చాటుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కేపీ.కొండారెడ్డి, ఉడుముల శ్రీనివాసులరెడ్డి, సానికొమ్ము పిచ్చిరెడ్డి, నాయకులు వెన్నా హనుమారెడ్డి, రమణారెడ్డి, వై.వెంకటేశ్వరావులు వైవీతో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బిళ్లా వసంతరావు వైవీతో కలిసి పాదయాత్రకు మద్దతు పలికారు. 

ఆరు నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది..
‘ఇన్నాళ్లు ఓపిక పట్టాం.. ఇంకో ఆరు నెలలు ఓపిక పడితే మనమందరం కోరుకున్న ప్రభుత్వం జగనన్న సారధ్యంలో వస్తుందని, జగన్‌ ముఖ్యమంత్రి కాగానే అన్ని సమస్యలు పరిష్కరించుకొందాం’ అంటూ వైవీ సుబ్బారెడ్డి ప్రజలకు భరోసా ఇచ్చారు.  ఆయా గ్రామాల్లో ప్రజలు భారీ సంఖ్యలో వచ్చి వెలిగొండ ప్రాజెక్ట్‌ సాధించే వరకు నిరంతరం పోరాడాలని, అందుకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. 

సమస్యలు విన్నవించిన రైతులు..
నాగంపల్లిలో రైతులతో వైవీ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. వారు విన్నవించిన సమస్యలను ఓపికగా విని రైతులు ఈ ప్రభుత్వంలో ఇంత ఇబ్బందులు పడుతున్నారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మన ప్రభుత్వం వస్తుందని ధైర్యంగా ఉండాలన్నారు. రైతులతో ఇన్సూరెన్‌ కట్టించుకొన్నప్పటికి వారు సాగు చేసిన పంటలు ఎండిపోయి నష్ట పోతే ఇప్పుడు ఎవరూ పట్టించుకోవటం లేదని నాగంపల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ వస్తేనే ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుందని, మహానేత వైస్సార్‌ ఆ నాడు ప్రాజెక్ట్‌కు అంకురార్పన చేశారని పలువురు రైతులు గుర్తు చేశారు. గ్రామానికి చెందిన యలమంద కాశమ్మ మూడేళ్లుగా ఇళ్లు పడగొట్టి కాలనీ కోసం దరఖాస్తు చేసుకొంటే ఇప్పటికి కాలనీ మంజూరు చేయలేదని వైవీ ఎదుట వాపోయింది. 

బాధితులకు భరోసా..
నాగంపల్లి ఎస్సీ కాలనీలో సైడు కాలువలు లేక ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు వైవీ దృష్టికి తెచ్చారు. ఓ వీధిలో ఉన్న విద్యుత్‌ స్తంభం విరిగి పడిపోయే స్థితిలో ఉండటాన్ని వైవీ గుర్తించారు. స్పందించిన ఆయన ఫోన్‌లో విద్యుత్‌శాఖ ఏఈతో మాట్లాడి రెండు రోజుల్లో కొత్త స్తంభం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కాలనీకి చెందిన వికలాంగుడు కొండ్రు జోజయ్య వైవీని కలిసి తన సమస్యలను వివరించి మూడు చక్రాల సైకిల్‌ కావాలని అడిగాడు. మూడు చక్రాల సైకిల్‌ ఇప్పిస్తానని వైవీ హామీ ఇచ్చారు. గొట్లగట్టుకు చెందిన ఉప్పుటూరి శ్రీనివాసులు కుమారుడు అనిల్‌ వెంకటరామచరణ్‌ ఇటీవల విద్యుత్‌ ప్రమాదానికి గురై చేయి దెబ్బతిన్నది ఆదుకోవాలని శ్రీనివాసులు వైవీని కోరారు. పాదయాత్రకు ఆయిన తరువాత ఒంగోలుకు రావాలని వైవీ సూచించారు. 

పాదయాత్ర కార్యక్రమంలో వైవీ భద్రారెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి వాకా వెంకటరెడ్డి, సానికొమ్ము శ్రీనివాసులరెడ్డి, వెంకటకొండారెడ్డి, ఎంపీపీలు ఉడుముల రామనారాయణరెడ్డి, కె.నరసింహరావు, జడ్పీటీసీలు మెట్టు వెంకటరెడ్డి, సాయిరాజేశ్వరరావు, భాషాపతిరెడ్డి, తాళ్లూరు వెంకటరెడ్డి, వైస్‌ ఎంపీపీ ఉన్నం శ్రీనివాసులు, ఎంపీటీసీ ఉప్పుటూరి పెద్దవెంకటయ్య, సొసైటీ చైర్మన్‌లు కామసాని వెంకటేశ్వరరెడ్డి, ఉడుముల కాశిరెడ్డి, మాజీ ఎంపీపీ గాయం బలరామిరెడ్డి, వైస్‌ ఎంపీపీ సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి, పార్టీ మండల కన్వీనర్‌ రాచమళ్ల వెంకటరామిరెడ్డి, గుజ్జుల సంజీవరెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ పాతకోట వెంకటకృష్ణారెడ్డి, నాగరాజుగౌడ్, గొట్టం వెంకటరెడ్డి, మహిళా నాయకులు కంది ప్రమీళారెడ్డి పాల్గొన్నారు.

పాదయాత్ర సాగింది ఇలా...
మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోరుతూ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేపట్టిన పాదయాత్ర శుక్రవారం మార్కాపురం నియోజకవర్గంలోని కొనకనమిట్ల మండలం గొట్లగట్టు గ్రామం నుంచి ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. గొట్లగట్టు వద్ద మహిళలు హారతులు ఇచ్చి ఘనస్వాగతం పలుకగా, బ్రాహ్మణపల్లె, చినమనగుండం మీదుగా మధ్యాహ్నం 1 గంటకు నాగంపల్లి గ్రామానికి చేరుకుంది. భోజన విరామం  తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు  యాత్ర వింజవర్తిపాడు మీదుగా సాయంత్రం 5.30 గంటలకు వెలుగొండ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చేరింది. మూడోరోజు సుమారు 15.3 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top