పార్టీ బలోపేతానికి సైనికుల్లా పనిచేయాలి

YSRCP Spiritual meeting in srikakulam - Sakshi

వైఎస్సార్‌ సీపీ ఆత్మీయ సమావేశంలో దువ్వాడ, తమ్మినేని   

ఆమదాలవలస రూరల్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి గ్రామాల్లో బూత్‌ కమిటీ సభ్యులు, యువకులు సైనికుల్లా పనిచేయాలని వైఎస్సార్‌ సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాసరావు అన్నారు. మండలంలో వంజంగి గ్రామంలో మాజీ సర్పంచ్‌ బెండి గోవిందరావు అధ్యక్షతన వైఎస్సార్‌ సీపీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాన్ని హింసించడమే లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. 

జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి గ్రామాల్లో అరాచక పాలన సృష్టించిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ధనం, మద్యం పంపిణీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందని అలాంటి వాటిని అడ్డుకట్ట వేయడానికి ఇప్పటి నుంచే యువత ఉద్యమించాలని సూచిం చారు. 2019 ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. ప్రజా బలమే వైఎస్సార్‌ సీపీకి అండగా నిలుస్తుందని తెలిపారు.

 ప్రజాసంకల్ప యాత్ర చేపట్టిన జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సమస్యలు తెలుసుకుం టూ ముందుకు సాగుతున్నారని అలాంటి లక్ష్యానికి మరింత బలం చేకూర్చాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో పార్టీ తరఫున సమగ్ర సర్వే ఇంటింటా నిర్వహించి ప్రజా సమస్యలను నమోదు చేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. వీటి ఆధారంగా ప్రభుత్వ పథకాలను అందజేయడానికి వీ లుపడుతుందని అన్నారు. వైఎస్సార్‌ సీపీ శ్రీకా కుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు తమ్మినేని సీతారాం మాట్లాడుతూ టీడీపీ దుష్ట పరిపాలన అంతం చేయడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని తెలిపారు. 

పార్టీ బలోపేతానికి యువజన విభాగం అత్యంత అవసరమని అన్నారు. గ్రామాల్లో సమస్యలను తెలుసుకునేందుకు, పార్టీలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటింటా సమగ్ర సర్వే విజయవంతంగా పూర్తిచేయాలని కోరారు. ప్రజా సంకల్ప యాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని, వాటి గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. 

గ్రామాల్లో పార్టీ మరింత దూసుకుపోయేందుకు బూత్‌ కమిటీ సభ్యులు పాటుపడాలని అన్నారు. అనంతరం యువతతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్, మండల పార్టీ అధ్యక్షులు తమ్మినేని శ్రీరామూర్తి, ఎంపీటీసీ బెండి రమణ, చీమలవలస సర్పంచ్‌ గురుగుబెల్లి శ్రీనివాసరావు, నాయకులు తమ్మినేని మురళి, పొన్నాడ రాము, శ్రీరామ్, వంజంగి, వంజంగిపేట, తోటాడ పంచాయతీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top