
ఐకేపీ యానిమేటర్లంటే బాబుకు చులకనా?
ఇందిరా క్రాంతిపథం (ఐకేపీ) యానిమేటర్లను ఉద్దేశించి చంద్రబాబు హేళనగా మాట్లాడటం బాధాకరమని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు.
ఇందిరా క్రాంతిపథం (ఐకేపీ) యానిమేటర్లను ఉద్దేశించి చంద్రబాబు హేళనగా మాట్లాడటం బాధాకరమని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. వాళ్లకు ఇచ్చేది కేవలం 2 వేల రూపాయల గౌరవ వేతనం మాత్రమేనని, వాళ్ల ఆవేదన, ఆక్రోశం చంద్రబాబుకు కనిపించడం లేదా అని ఆమె అడిగారు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని, లేనిపక్షంలో వారికి నిరుద్యోగ భృతి ఇస్తామని కూడా చెప్పారని గుర్తుచేశారు. ఇప్పుడు 30 వేల మంది ఐకేపీ యానిమేటర్ల ఆందోళనపై చంద్రబాబు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వారికి మద్దతుగా తాము ఆందోళన చేస్తామని తెలిపారు.
తమ పార్టీని ఉద్దేశించి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ నేత అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆమె ఆరోపించారు. పాలెం బస్సు దుర్ఘటన కేసు నుంచి తప్పించుకోడానికే మీరు చంద్రబాబు పంచన చేరిన విషయం నిజం కాదా అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ఏ శిక్ష నుంచి తప్పించుకోడానికి చంద్రబాబు కాళ్లు పట్టుకున్నారో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు.