ఇంటింటా ‘రావాలి జగన్‌ – కావాలి జగన్‌’

YSRCP Ravali Jagan Kavali Jagan In Guntur - Sakshi

పట్నంబజారు(గుంటూరు):  అడుగులో అడుగయ్యారు... అన్నింటా అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు.. కష్టాలు తెలుసుకుని పరిష్కారం కోసం పాటుపడతామని హామీ ఇస్తున్నారు.. నవరత్నాలతో ప్రతి ఇంటా వెలుగులు నిండుతాయని చాటి చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ‘రావాలి జగన్‌ – కావాలి జగన్‌’ కార్యక్రమాన్ని చేపట్టిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నేతలు ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. ప్రతి ఇంటి తలుపు తడుతూ, వారి సమస్యలు ఆలకిస్తూ మంచి రోజులు వస్తాయనే భరోసా కల్పిస్తున్నారు. మంగళగిరి పట్టణంలో 3వ వార్డులో ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) ‘రావాలి జగన్‌ – కావాలి జగన్‌’ చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు జన్మించిన చిన్నారికి, ఒక వృద్ధురాలికి అవసరాల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పట్టణంలోని 34వ డివిజన్‌ బీసీ కాలనీలో కార్యక్రమాన్ని నిర్వహించారు. నవరత్నాల గురించి వివరించారు. గుంటూరు నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి కృష్ణనగర్‌ ప్రాంతంలో కార్యక్రమాన్ని చేపట్టారు.

అపార్టుమెంట్‌లు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున చుండూరు మండలం చినగాజులవర్రులో ‘రావాలి జగన్‌ – కావాలి జగన్‌’ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో విస్తృతంగా పర్యటించి గ్రామస్తుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. సత్తెనపల్లి పట్టణంలో 30వ వార్డు అంబేద్కర్‌ నగర్‌లో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు కార్యక్రమాన్ని చేపట్టారు. నవరత్నాల కరపత్రాలు పంపిణీ చేస్తూ వాటి ఆవశ్యకత వివరించారు. తెనాలి నియోజకవర్గంలో రూరల్‌ పరిధిలో సోమసుందరంపాలెంలో నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్‌ ‘రావాలి జగన్‌ – కావాలి జగన్‌’ కార్యక్రమం చేపట్టారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలో నియోజకవర్గ సమన్వయకర్త విడదల రజిని కార్యక్రమాన్ని నిర్వహించారు.

పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలం వైకుంఠపురం ఎస్సీ కాలనీలో నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడు కార్యక్రమాన్ని చేపట్టారు. బాపట్ల నియోజకవర్గంలోని బాపట్ల మండల పరిధిలోని అడవిపల్లిపాలెంలో ఎమ్మెల్యే కోన రఘుపతి తనయుడు కోన నిఖిల్‌ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రేపల్లె నియోజకవర్గంలోని నగరం మండలం పెద్దవరం గ్రామంలో ‘రావాలి జగన్‌ – కావాలి జగన్‌’ కార్యక్రమాన్ని నియోజకవర్గ సమన్వయకర్త మోపిదేవి వెంకటరమణ చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ‘రావాలి జగన్‌ – కావాలి జగన్‌’ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top