ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?  | Sakshi
Sakshi News home page

అడవులు అగ్ని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? 

Published Sat, Feb 8 2020 3:51 AM

YSRCP MPs questioned Central Govt In Lok Sabha - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అడవులు అగ్ని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ తలారి రంగయ్య కేంద్రాన్ని శుక్రవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల్లో ప్రశ్నించారు. దీనికి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి బాబుల్‌ సుప్రియో సమాధానమిస్తూ అడవుల్లో మంటలు అంటుకుంటే హెచ్చరించడానికి ఐదు రకాల హెచ్చరిక వ్యవస్థలు ఉన్నాయని వివరించారు. మంటలు ఆర్పేందుకు తగిన ఆర్థిక సాయం అందుతుందని వివరించారు. 

‘జగనన్న గోరుముద్ద’ను దేశవ్యాప్తంగా అమలు చేస్తారా? 
పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు తగిన పోషకాహారం అందించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ‘జగనన్న గోరుముద్ద’ పేరుతో పథకం అమలు చేస్తున్నారని, ఈ స్కీమ్‌ను దేశవ్యాప్తంగా అమలు చేస్తారా? అని వైఎస్సార్‌సీపీ ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజు కేంద్రాన్ని ప్రశ్నించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతీ ఇరానీ సమాధానమిస్తూ ఉత్తమ విధానాలు అమలు చేసే అన్ని రాష్ట్రాలను ప్రశంసిస్తామని, కేంద్ర ప్రభుత్వం తన సామర్థ్యాలకు అనుగుణంగా రాష్ట్రాలతో చర్చించి పథకాలు అమలు చేస్తుందని వివరించారు. ఆయా పథకాలను రాష్ట్రాలు తమకు అనుకూలంగా మార్చుకోవచ్చని వివరించారు. 

కొత్త టెక్స్‌టైల్‌ పాలసీ రూపకల్పన జరుగుతోంది 
టెక్స్‌టైల్‌ రంగం అభివృద్ధికి వీలుగా కేంద్ర ప్రభుత్వం కొత్త టెక్స్‌టైల్‌ పాలసీని రూపొందిస్తోందని కేంద్ర టెక్స్‌టైల్స్‌ శాఖ మంత్రి స్మృతీ ఇరానీ పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి, ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, బీశెట్టి వెంకటసత్యవతి, ఎంవీవీ సత్యనారాయణ, బెల్లాన చంద్రశేఖర్, ఎన్‌.రెడ్డప్ప, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, కోటగిరి శ్రీధర్, పోచా బ్రహ్మానందరెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. 

ఎగుమతుల సబ్సిడీలకు డబ్ల్యూటీవో ఆటంకాలు 
ఎగుమతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని సబ్సిడీలకు వ్యతిరేకంగా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) వివాదాన్ని లేవనెత్తిన విషయం వాస్తవమేనని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ శుక్రవారం రాజ్యసభకు తెలిపారు. వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ, ‘ప్యానల్‌ దశలో ఇండియా తన కేసును వాదించింది. కానీ వివాద పరిష్కార ప్యానల్‌ మాత్రం భారత్‌ చేపట్టిన చర్యలు డబ్ల్యూటీవో నిబంధనలకు విరుద్ధమని తన నివేదికలో పేర్కొంది. ప్యానల్‌ నివేదికను భారత్‌ 2019, నవంబర్‌ 19న అప్పిలేట్‌ సంఘం వద్ద సవాల్‌ చేసింది. కానీ తగినంత కోరం లేని కారణంగా కేసులో పురోగతి లేదు. అయినప్పటికీ డబ్ల్యూటీవోలోని ఇతర సభ్యులతో కలసి అప్పిలేట్‌ సంఘం వద్ద ఈ కేసును అనుకూలంగా పరిష్కరించుకోవడానికి భారత్‌ కట్టుబడి ఉంది..’ అని మంత్రి తెలిపారు.  

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌లో వయో పరిమితి సడలింపు ఇవ్వాలి 
ఆర్థికంగా బలహీన వర్గాలకు అందిస్తున్న 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లలో గరిష్ట వయోపరిమితి కూడా పెంచాలని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన రాజ్యసభ జీరో అవర్‌లో మాట్లాడారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఇచ్చే వయోపరిమితి సడలింపు తరహాలో ఈడబ్ల్యూఎస్‌లో కూడా ఇవ్వాలని కోరారు.  

Advertisement
Advertisement