ఎక్కడైతే ప్రభుత్వ భూమి అధికంగా ఉంటుందో అక్కడే రాజధాని ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
కడప: ఎక్కడైతే ప్రభుత్వ భూమి అధికంగా ఉంటుందో అక్కడే రాజధాని ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, రఘరాం రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా, కడప మేయర్ సురేష్ బాబు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ నేడు కడపలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఇంతవరకూ కడపలో ఒక్క యూనివర్శిటీ కూడా మంజూరు చేయలేదన్నారు. తెలుగు ప్రజలు, భావితరాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే రాజధాని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.
మరోవైపు కడపలో పర్యటిస్తున్న శివరామకృష్ణన్ కమిటీకి నిరసన సెగలు గట్టిగా తగిలాయి. రాయలసీమ స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థులు సమీక్షా సమావేశాల్లోకి దూసుకెళ్లి తమ నిరసన వ్యక్తం చేశారు. రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు తక్షణమే ప్రకటించాలని, ఇన్నాళ్లూ జరిగిన అన్యాయాన్ని ఇప్పటికైనా సరిచేయాలని డిమాండ్ చేశారు. అభిప్రాయ సేకరణను వారు తీవ్రంగా అడ్డుకున్నారు.