‘టీడీపీ నేతలు కన్ఫ్యూజ్‌ చేస్తున్నారు’

YSRCP Leaders Vasireddy Padma And MVS Nagireddy Meets AP CEO - Sakshi

సాక్షి, అమరావతి : ఈవీఎంలు పనిచేయడం లేదంటూ పుకార్లు పుట్టిస్తున్నారని.. ఈ విషయమై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌ సీపీ నేతలు వాసిరెడ్డి పద్మ, ఎంవీఎస్‌ నాగిరెడ్డి ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి విఙ్ఞప్తి చేశారు. గురువారం ఆయనను కలిసి ఎన్నికల నిర్వహణతో పాటు పలు అంశాలపై ద్వివేదికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా చాలా నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతున్న చోట డబ్బులు పంపిణీ చేస్తున్నారని ద్వివేది దృష్టికి తీసుకువెళ్లారు. ఈవీఎంల విషయంలో దుష్ప్రచారం చేస్తున్నారని, ఎన్నికల కమిషన్‌ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

అనంతరం వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. ఈవీఎంలు పని చేయడం లేదని టీడీపీ నేతలు పుకార్లు పుట్టిస్తున్నారని ఆరోపించారు. సాంకేతిక సమస్యతో పాటు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని ఎలక్షన్‌ కమిషన్‌ అధికారికంగా చెప్పినా.. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈవీఎంలను సాకుగా చూపి పోలింగ్‌ జరగకుండా చేయడంతో పాటు దాడులతో ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారన్నారు. ఎన్నికల సంఘమే స్వయంగా చెప్పినా తీరు మార్చుకోని టీడీపీ నేతలు ప్రజల్లో గందరగోళం సృష్టించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top