రాష్ట్ర విభజన అంశంలో కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జైలులో చేస్తున్న నిరాహార దీక్షకు మద్దతుగా మడకశిరలో వైఎస్సార్‌సీపీ కన్వీనర్ చౌడారెడ్డి, నాయకులు వన్నూరక్కసోమనాథ్, హనుమంతరాయ నాలుగు రోజులుగా చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను గురువారం స్థానిక పోలీసులు భగ్నంచేశారు.
మడకశిర, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన అంశంలో కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జైలులో చేస్తున్న నిరాహార దీక్షకు మద్దతుగా మడకశిరలో వైఎస్సార్‌సీపీ కన్వీనర్ చౌడారెడ్డి, నాయకులు వన్నూరక్కసోమనాథ్, హనుమంతరాయ నాలుగు రోజులుగా చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను గురువారం స్థానిక పోలీసులు భగ్నంచేశారు.
ఉదయం 11గంటలకు దీక్ష చేస్తున్న వారికి వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ సతీష్‌కుమార్ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని, వారికి తక్షణ వైద్యసహాయం అవసరమని సూచించారు. దీంతో సీఐ హరినాథ్ సిబ్బందితో దీక్ష శిబిరానికి చేరుకుని ముగ్గురినీ స్థానిక ఆసుపత్రికి తరలించారు. రాష్ట్ర విభజనపై చేసిన ప్రకటనను ఉపసంహరించుకునే వరకు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని ఈ సందర్నంగా వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి వైసీ గోవర్ధనరెడ్డి తెలిపారు.
సందీప్ రెడ్డి ఆసుపత్రికి తరలింపు
గుంతకల్లు,గుంతకల్లు పట్టణంలో ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఎంవీ సందీప్‌రెడ్డిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. గురువారం మధ్యాహ్నం పోలీసులు ప్రభుత్వ వైద్యునితో ఆయనకు ఆరోగ్య పరీక్షలు చేయించారు. రక్తపోటు తక్కువగా ఉందని, డీహైడ్రేషన్‌తో పాటు జాండిస్ కూడా సోకిందని వైద్యుడు నిర్ధారించడంతో వన్‌టౌన్ ఎస్‌ఐ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో పోలీసులు ఆయనను బలవంతంగా ఆసుపత్రికి తరలించి సెలైన్ ఎక్కించారు. ఈ సందర్భంగా అడ్డుకున్న కార్యకర్తలకు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది.
గోరంట్లలో దీక్షలు భగ్నం
గోరంట్ల, : గోరంట్ల వైఎస్సార్‌సీపీ నాయకులు సుధాకర్‌రెడ్డి, గంగంపల్లి వెంకటరమణారెడ్డి చేపట్టిన నిరాహార దీక్షను గురువారం సాయంత్రం పోలీసులు భగ్నం చేశారు. మూడు రోజులుగా దీక్ష చేస్తున్న నాయకులకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వారి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వైద్యులు నిర్ధారించడంతో పోలీసులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
అంతకు ముందు పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ మెంబర్ గంపల వెంకటరమణారెడ్డి, గోరంట్ల సర్పంచ్ మంజుల, నాయకులు రఘురామిరెడ్డి, గిరిధరగౌడ్, ధనుంజయరెడ్డి, రాజశేఖరరెడ్డి, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగంగా నాయకుడు మేదర శంకర్ తదితరులు వారికి మద్దతుగా దీక్షల్లో పాల్గొన్నారు.