ఎన్నాళ్లీ ‘ఆది’పత్యం?

YSRCP Leaders House Arrest In Kadapa - Sakshi

టీడీపీ సర్కారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. అధికారం చేతిలో పెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. ప్రాథమిక హక్కులను కాలరాస్తోంది. తన నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నాయకులను పర్యటించకుండా గృహ నిర్బంధం చేసిన సంఘటన మంత్రి ఆదినారాయణరెడ్డి దురహంకారానికి దర్పణం పడుతోంది. పులివెందులలో  వైఎస్‌ అవినాష్‌రెడ్డిని.. జమ్మలమడుగు నియోజకవర్గంలోని నిడుజివ్విలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ ఎం. సుధీర్‌రెడ్డిని శనివారం తెల్లవారుజామునే గృహ నిర్బంధం చేసిన సంఘటన ప్రజాస్వామిక వాదులను కలవర పరుస్తోంది. ప్రచారానికి ముందస్తు అనుమతి తీసుకున్నా జిల్లా మంత్రి ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు ఈ చర్యలకు పాల్పడి చట్టానికి తూట్లు పొడిచారు.     –పులివెందుల / ఎర్రగుంట్ల

పులివెందుల/ఎర్రగుంట్ల : జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లె, సుగుమంచిపల్లెలలో మాజీ ఎంపీ అవినాష్‌రెడ్డి.. నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ సుధీర్‌రెడ్డితో కలిసి శనివారం  ‘రావాలి జగన్‌ – కావాలి జగన్‌’ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. మూడు రోజుల క్రితమే వారు పోలీసుల అనుమతి కోరారు. అయినా ఆకస్మికంగా మంత్రి కూడా ఆ గ్రామాల్లో పర్యటిస్తారనే సాకు చూపుతూ పోలీసులు ప్లేటు ఫిరాయించారు.  శనివారం ఉదయం 5గంటలకే పులివెందుల స్వగృహంలో ఉన్న అవినాష్‌రెడ్డిని డీఎస్పీ నాగరాజ, సీఐలు శంకరయ్య, రామకృష్ణుడు, ఎస్‌ఐలు పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో వెళ్లి హౌస్‌ అరెస్టు చేశారు. అదే సమయంలో వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టరు ఎం సుధీర్‌రెడ్డిని కూడా గృహ నిర్బంధం చేశారు. ఇద్దరు సీఐలు, ఎస్‌ఐల నేతృత్వంలో ప్రత్యేక పోలీస్‌ బలగాలు ఆయన ఇంటిని చుట్టుముట్టాయి. గతంలో కూడా వైఎస్‌ అవినాష్‌రెడ్డి, డాక్టర్‌ ఎం.సుధీర్‌రెడ్డిని, ఎం.హర్షవర్దన్‌రెడ్డిలను గృహ నిర్బంధం చేశారు. కాగా ప్రస్తుతం అవినాష్‌ రెడ్డి, సుధీర్‌రెడ్డిలతో పాటు జమ్మలమడుగుకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు పోరెడ్డి మహేశ్వరరెడ్డి, రాష్ట్ర యువజన కార్యదర్శి హనుమంతరెడ్డిలను కూడా ముందస్తుగా హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

ప్రజాభిమానం చూసి ఓర్వలేక..
మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జమ్మలమడుగు నియోజకవర్గంలో  వైఎస్‌ అవినాష్‌రెడ్డి, సుధీర్‌రెడ్డిల రాకను సాదరంగా ఆహ్వానించేందుకు  వైఎస్సార్‌ అభిమానులు సిద్ధమయ్యారు. ఓర్వలేని మంత్రి ఆదినారాయణరెడ్డితోపాటు ఆయన సోదరులు శుక్రవారం రాత్రి ఆయా గ్రామాల ప్రజలను ప్రలోభాలకు గురి చేసినట్లు తెలిసింది. వారి మాటలను స్థానికులు లెక్క చేయలేదు.  వైఎస్సార్‌సీపీ నాయకులు గ్రామాల్లో పర్యటిస్తే తమ పట్టు కోల్పోతామోనన్న భయంతో అడ్డుకోవాలని ఆదినారాయణరెడ్డి కుటిల రాజకీయానికి తెర లేపారు. శుక్రవారం  అర్ధరాత్రి 12గంటలకు తాము కూడా ఆ గ్రామాల్లో పర్యటిస్తామని పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. దీంతో పోలీసులు శాంతి భద్రతలు సాకు చూపుతూ అవినాష్‌రెడ్డిని, సుధీర్‌రెడ్డిని హౌస్‌ అరెస్టు చేశారు.

నేతల పర్యటన అడ్డుకునేందుకు మంత్రి పోలీసులను అడ్డుపెట్టుకున్నట్లుగా ఈ విధంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అవినాష్‌రెడ్డిని హౌస్‌ అరెస్టు చేశారని తెలియగానే పులివెందుల నియోజకవర్గంలోని పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన స్వగృహానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులతో వైఎస్‌ అవినాష్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. అనుమతి ఇచ్చి అడ్డుకోవడం మంచి పద్దతి కాదన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడికైనా పర్యటించే హక్కు ఉంటుందన్నారు.  అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు. సాయంత్రం 5గంటల వరకు గృహ  నిర్బంధం చేశారు. మధ్యలో ఆయన పట్టణంలో  వివాహ కార్యక్రమాలు, వాటర్‌ ప్లాంట్ల ప్రారంభోత్సవాలకు హాజరయ్యారు.  ఆయన వెంట పోలీసు బలగాలు అనుసరించారు.

దమ్ముంటే తిరగనివ్వండి
మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలకు 30 ఏళ్ల రాజకీయ జీవితం ఉంది.. నాకు మూడేళ్ల రాజకీయ జీవితం మాత్రమే ఉంది.. అయినా  ఆ ఇద్దరు భయపడుతున్నారెందుకో  అర్థం కావడం లేదు.. దమ్మూ, ధైర్యం ఉంటే æతనను స్వేచ్ఛగా తిరగనివ్వాలని సమన్వయకర్త డాక్టర్‌ ఎం సుధీర్‌రెడ్డి సవాలు విసిరారు. గృహ నిర్బంధం చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  పదవుల కోసం రామసుబ్బారెడ్డి మాదిరిగా దిగజారుడు రాజకీయాలు చేయనన్నారు. 2004, 2009, 2014లలో ఆ గ్రామాలలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోలేదు. సున్నపురాళ్లపల్లె గ్రామంలో ప్రచారానికి  డీఎస్పీ  షరతులతో కూడిన అనుమతి ఇచ్చారన్నారు. తర్వాత అదే  ఊరిలో మంత్రి ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిలు కూడా ప్రచారం చేస్తారంటూ తమ అనుమతులను డీఎస్పీ రద్దు చేయడం కక్షపూరిత చర్య అన్నారు.

నియోజకవర్గంలో మంత్రి ఆది, మాజీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్సీ శివనాధ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులున్నారు. ఇంతమంది ఉన్నా భయపడుతూ తనను ప్రచారం చేయకుండా అడ్డుకున్నారని ఎద్దేవా చేశారు. తమ గ్రామమైన సిర్రాజుపల్లెకు మంత్రి ఆదినారాయణరెడ్డి వచ్చినా ఏం కాలేదని గుర్తు చేశారు. గుండ్లకుంటలోకి కూడా పోతాం.. నమ్మకం లేక భయపడుతున్నావని రామసుబ్బారెడ్డిని దృష్టిలో పెట్టుకుని సుధీర్‌ వ్యాఖ్యానించారు.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైపు  పార్టీ నాయకులు.. కార్యకర్తలు.. ప్రజలు ఉన్నారనే భయంతో ఇలా వ్యవహరిస్తున్నారన్నారు. ఇద్దరూ ఫిఫ్టీ ఫిఫ్టీ తరహాలో లాభాలు పంచుకుని చెట్టపట్టాలు వేసుకోని తిరుగుతున్నారని విమర్శించారు.  వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి హర్షవర్దన్‌రెడ్డితో పాటు నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు. 

హైకోర్టుకు వెళ్లయినా గ్రామాల్లో పర్యటిస్తాం
 వైఎస్‌ అవినాష్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గతంలో గొనిగెనూరు వెళ్లాలనుకున్నప్పుడు ఇదేవిధంగా అడ్డంకులు సృష్టిస్తే హైకోర్టును ఆశ్రయించి పర్యటించామని  చెప్పారు. హైకోర్టు సూచలను పాటిస్తూ పర్యటించామన్నారు. అప్పుడు ఆ గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికి తమకు, వైఎస్సార్‌సీపీకి అండగా ఉంటామని  చెప్పడం జరిగిందన్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డికి ప్రజాబలంపై, ఓటర్ల బలంపై నమ్మకంలేదన్నారు. అందువల్లే ఈ విధంగా పోలీసుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఆదినారాయణరెడ్డి అనేకసార్లు పులివెందులకు వస్తే ఏరోజు కూడా తాము గానీ, కార్యకర్తలు గానీ అడ్డుకోలేదనే సంగతి గుర్తుంచుకోవాలన్నారు. ఆదినారాయణరెడ్డి వచ్చినా, రాకున్నా పులివెందుల ప్రాంత ప్రజలు వైఎస్సార్‌సీపీకి పూర్తి అండగా ఉన్నారన్న విశ్వాసం తమకు ఉండటమేనన్నారు.

ఆ నమ్మకం ఆదినారాయణరెడ్డికి జమ్మలమడుగు ప్రజలపై లేదన్నారు. ఆదినారాయణరెడ్డికి నిజంగా ఆయా గ్రామాల్లో బలంలేదన్నారు. కేవలం భయపెట్టి రాజకీయం చేస్తున్నారన్నారు. జమ్మలమడుగు ప్రజలు వైఎస్సార్‌సీపీని గెలిపించాలని కోరుకుంటున్నారని.. ఈ నేపథ్యంలో తాము అక్కడ పర్యటించి మద్దతు కూడగడితే ఆయనకున్న దేవగుడి పరిసరాలలోని రిగ్గింగ్‌ బూత్‌లు పూర్తిగా వైఎస్సార్‌సీపీ వశమవుతాయని భయపడి  పోలీసులను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారన్నారు. ఏదీ ఏమైనా ఆయా గ్రామాల్లో పర్యటించి తీరుతామన్నారు. సమన్వయం కోల్పోకుండా, లాఅండ్‌ఆర్డర్‌ సమస్య లేకుండా ముందుకు వెళతామన్నారు. అవసరమైతే హైకోర్టును ఆశ్రయించి ఆ గ్రామాల్లో ప్రశాంతంగా పోలింగ్‌ జరిపిస్తామని మాజీ ఎంపీ స్పష్టం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top