
సంపత్ వినాయక గుడి వద్ద కొబ్బరికాయలు కొడుతున్న వైఎస్సార్‌సీపీ నాయకులు
ఆ అడుగు ఓ ప్రభంజనం..ఆ చిరునవ్వు కొండంత ధైర్యం..ఆ ఓదార్పు కష్టాల్లో ఉన్న వారికి మనోస్థైర్యం.. ఆ పలకరింపు నిజంగా ఊరడింపు..ఆ చేతి స్పర్శగొప్ప సాంత్వన..అలుపు..అలసట.. విసుగు.. విరామం లేకుండా సాగిన ప్రజాసంకల్పయాత్ర మరికొద్ది గంటల్లో ముగియనుంది(శ్రీకాకుళం జిల్లాఇచ్ఛాపురంలో..). దాదాపు 14 నెలల పాటు సాగినఈ సుదీర్ఘపాదయాత్ర ముగింపు మహోజ్వల ఘట్టాన్ని తలపించనుంది. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే మరే ఇతర రాజకీయ నాయకుడు తలపెట్టనిమహాయజ్ఞం ముగింపు దశకు చేరుకుంటున్న వేళఆ వజ్రసంకల్ప ధీరుడు అడుగుజాడలు జిల్లావాసులను ఉద్వేగానికి గురిచేస్తున్నాయి.
సాక్షి, విశాఖపట్నం: నడిచొచ్చిన నిలువెత్తు నమ్మకాన్ని చూసి జిల్లా ఉప్పొంగింది. నవ్య చైతన్య దీప్తిని వెలిగిస్తూ దూసుకొచ్చిన రాజన్న బిడ్డకు ఉత్తరాంధ్ర ముఖ ద్వారమైన విశాఖ జిల్లా అడుగడుగునా బ్రహ్మరథం పట్టింది. రాష్ట్రంలో నాలు గున్నరేళ్లుగా సాగుతున్న నారావారి నరకాసురపాలనను తుదముట్టించే సంకల్పంతో ఏపీ ప్రతి పక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర విశాఖ జిల్లాలో అడుగుపెట్టింది మొదలు జిల్లా దాటే వరకు ప్రజలు జననీరాజనాలు పలికారు. దాదాపు 32 రోజుల పాటు జిల్లాలో పాదయాత్ర చేసిన ఈ బహుదూరపు బాటసారిని చూసేందుకు పల్లెలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా పోటెత్తాయి.
గన్నవరం మెట్ట నుంచి..
నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద గతేడాది ఆగష్టు 14న విశాఖ జిల్లాలోకి ప్రవేశించింది మొదలు పెందుర్తి మండలం చింతలపాలెం వద్ద విజయనగరం జిల్లాలో అడుగుపెట్టే వరకు జనప్రభంజనంలా సాగింది. తొలి అడుగులో అడుగేసేందుకు వేలాది మంది ఎదురేగి గన్నవరం మెట్ట వద్ద ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజక వర్గాలు, విశాఖ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఐదు నియోజకవర్గాల మీదుగా సాగింది. నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర గ్రామీణ జిల్లాలో పాయకరావుపేట, యలమంచలి, అనకాపల్లి, చోడవరం, మాడుగుల, పెందుర్తి నియోజక వర్గాల మీదగా సాగింది. ఇక సిటీలో విశాఖ పశ్చిమలో అడుగు పెట్టిన పాదయాత్ర విశాఖ ఉత్తరం, విశాఖ దక్షిణం, విశాఖ తూర్పు, భీమిలి నియోజక వర్గాల మీదుగా సాగింది. గ్రామీణ ప్రాంతంలో శారద, వరహా, సర్పా నదులతో పాటు పోలవరం, ఏలేరు కాలువల చెంతన దుర్భేద్యమైన కొండలు..గుట్టల మధ్య అసలు సిసలైన పల్లె వాతావరణంలో పాదయాత్ర సాగింది. ఇక మహా విశాఖలో అడుగు పెట్టింది మొదలు చింతలపాలెం వరకు వేలాది అడుగులు కదంతొక్కాయి.
పచ్చతివాచీ..పూలదారులు..
పొలిమేరల్లోనే కాదు..ప్రతి గ్రామం, పట్టణాల పొలిమేరల్లోనూ ఇదే రీతిలో భారీ ముఖ ద్వారాలు.. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి స్వాగతం పలికారు. పాదయాత్రలో ఆధ్యాంతం అడుగుడగునా పూల వర్షం కురిపిస్తూ పచ్చ తివాచీ(గ్రీన్ కార్పేట్స్)లపై నడిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. నుదటపై తిలకం దిద్ది మంగళ హారతులిచ్చి మహిళలు దిష్టి తీస్తే.. లేవలేని, నడవలేని వృద్ధులు సైతం జననేతను చూసేందుకు గంటలతరబడి నిరీక్షించడం కన్పించింది. మహిళలు, యువత, పేదలు, రైతులు, చిరుద్యోగులు, వ్యాపారులు, వివిధ కుల వృత్తులు, ప్రజా సంఘాలు, విద్యార్థులు జన హృదయ నేతకు తమ కష్టాలు చెప్పుకుని ఊరడింపు పొందారు. ఇళ్లు, పింఛన్లు ఇవ్వడం లేదని, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్సుమెంట్ వర్తించడం లేదని, ఉద్యోగాలు రావడం లేదని, ఉన్న కొలువులు ఊడదీశారని, తాగు, సాగునీరు అందడం లేదని, అధికార టీడీపీ నేతల భూకబ్జాలు, దందాలు, అవినీతి, అక్రమాలు పెచ్చుమీరిపోయాయని ఇలా ఒకటేమిటి వేల వినతులు వెల్లువెత్తాయి. తన వద్దకు వచ్చిన ప్రతిఒక్కరినీ చిరునవ్వుతో పలకరించి వారి కష్టాలు తెలుసుకుని కన్నీళ్లు తుడుస్తూ ..నేనున్నానంటూ భరోసా ఇస్తూ ముందుకు సాగారు.
జిల్లాలో 277.1 కిలోమీటర్లు
ప్రజాసంకల్పయాత్ర 237వ రోజు 2721.4 కిలో మీటర్ల వద్ద నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద జిల్లాలో అడుగిడిగిన పాదయాత్ర జిల్లా లో 32 రోజులపాటు సాగింది. 264వ రోజు 2998.5 కిలోమీటర్ల వద్ద చింతల పాలెం వద్ద విజ యనగరం జిల్లాలోకి ప్రవేశించింది. గ్రామీణ జిల్లా లో 206.4 కిలోమీటర్లు, జీవీఎంసీ పరిధిలో 70.7 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. జిల్లాలో 277.1 కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్ర గ్రామీణ జిల్లాలో అత్యధికంగా భీమిలిలో తొమ్మిదిరోజులపాటు, ఆ తర్వాత వారంరోజుల పాటు యలమంచలి నియోజక వర్గంలో పాదయాత్ర సాగింది. ఇలా మొత్తమ్మీద గతేడాది ఆగష్టు 14వ జిల్లాలో అడుగుపెట్టిన ప్రజాసంకల్పయాత్ర సెప్టెంబర్ 24వ తేదీతో ముగిసింది.
పాదయాత్రకు వరుణుడు సైతం..
పాదయాత్రలో అడపాదడపా సూరీడు కాస్త చిటపట లాడించినా.. జననేత వెంటే నేనున్నానంటూ వరుణుడు మేఘచత్రం పడుతూ వచ్చాడు. నియోజకవర్గంలో అడుగు పెట్టకానే జడివానతో పలుకరిస్తూనే ఉన్నారు. కొన్ని చోట్ల కుండపోతగా వర్షం కురిసినా లెక్కచేయకుండా తన కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది చూపించే అభిమానం ముందు ఈ వర్షం ఏపాటిదంటూ జననేత ముందుకు సాగారు. నర్సీపట్నం సభకు ఓ మోస్తరుగా వర్షం కురవగా, యలమంచలి సభలో కుండపోతగా కురిసింది. భీమిలిలో అడుగు పెట్టన తర్వాత దాదాపు మూడురోజులు ప్రతిరోజు కనీసం పాదయాత్ర సమయంలో అరగంటకు పైగా కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. జోరు వానలో సైతం తడిసి ముద్దవుతూనే జననేత ముందుకు సాగారు.
మంత్రులపై ఎటాక్
నర్సీపట్నం, భీమిలి నియోజకవర్గాల్లో మంత్రులనే లక్ష్యంగా జగన్ పేల్చిన మాటల తూటాలు టీడీపీలో ప్రకంపనలు సృష్టించాయి. నర్సీపట్నం సభలో మంత్రి అయ్యన్నను లక్ష్యంగా చేసుకుని జగన్ చేసిన విమర్శలు అలజడని రేపాయి. బినా మీలకు కాంట్రాక్టులు, ఖనిజ దోపిడీలో కమీ షన్లు దండుకుంటున్నారంటూ నేరుగా అయ్యన్నపై వాగ్భాణాలు ఎక్కు పెట్టా రు. నాతవరం మండలం సరుగుడు దగ్గర బినా మీల పేరుతో లైసెన్సులు తీసుకొని పరిమితికి మించి భారీ ఎత్తున లేటరైట్ తవ్వకాలు చేస్తున్నారని ధ్వజ మెత్తారు. అవినీతిలో చంద్రబాబు కు బ్రాండ్ అంబాసిడర్ గంటా అని ఘాటుగా విమర్శించారు. దొంగల ముఠా స్థావరాలు మార్చినట్టు ఎన్నికలొచ్చేసరికి గంటా నియోజకవర్గాన్ని మార్చేస్తాడంటూ ఘాటుగా విమర్శించారు.
తొమ్మిది సభలు..రెండు ఆత్మీయ సదస్సులురికార్డు తిరగరాసిన కేరాఫ్ కంచరపాలెం
విశాఖ జిల్లాలో తొమ్మిది బహిరంగ సభల్లో జననేత ప్రసంగించారు. నర్సీపట్నం మొదలు కొని ఆనందపురం వరకు 9 సభల్లో పాల్గొన్నారు. గ్రామీణ సభలు రికార్డులు తిరగరాస్తే..కేరాఫ్ కంచరపాలెంగా జరిగిన విశాఖ బహిరంగసభ కొత్త రికార్డును సృష్టించింది. పూరిజగన్నాథ రథయాత్రను తలపించేలా లక్షలాది మంది జనం ఈ సభకు తరలిరావడంతో కంచరపాలెం మెట్ట నుంచి ఎన్‌ఏడీ వరకు జనసంద్రమైంది. ఇక విశాఖలో బ్రాహ్మణులు, ముస్లిం మైనార్టీలతో ఆత్మీయ సదస్సుల్లో పాల్గొన్నారు. విశాఖ వేదికగా జరిగిన పార్టీ కో ఆర్డినేటర్ల రాష్ట్ర స్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.