పోలీస్‌స్టేషన్‌లో వైఎస్సార్‌ సీపీ నేత ఆత్మహత్యాయత్నం | YSRCP Leader Suicide Attempt in Police Station | Sakshi
Sakshi News home page

పోలీస్‌స్టేషన్‌లో వైఎస్సార్‌ సీపీ నేత ఆత్మహత్యాయత్నం

Feb 11 2019 8:32 AM | Updated on Feb 11 2019 8:32 AM

YSRCP Leader Suicide Attempt in Police Station - Sakshi

పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరిన సింక అప్పారావు అప్పారావు రాసిన సూసైడ్‌ నోట్‌

శ్రీకాకుళం , రణస్థలం: ఫ్లెక్సీల చించివేత పేరుతో పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారంటూ కమ్మ సిగడాం పంచాయతీ లోచర్లపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ నాయకుడు సింక అప్పారావు ఆదివారం జె.ఆర్‌.పురం పోలీస్‌స్టేషన్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి      పాల్పడ్డారు. దీంతో బంధువులు కోపోద్రుక్తులై పోలీస్‌స్టేషన్‌ ఎదుట బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి బాధితుడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రణస్థలం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్‌.ఈశ్వరరావుకు, వైఎస్సార్‌సీపీ నాయకులు సింక అప్పారావు, పాశపు రాందాసుకు మధ్య కొంతకాలంగా రాజకీయ వైరం కొనసాగుతోంది. ఈ క్రమంలో నడుకుదిటిపాలెం జంక్షన్‌లో ఏర్పాటు చేసిన ఎన్‌.ఈశ్వరరావు ఫ్లెక్సీని సింక అప్పారావు, పాశపు రాందాసుల వర్గీయులు చింపుతుండగా చూశానని బంటుపల్లి గ్రామానికి చెందిన టొంపల పోతయ్య ఆదివారం జె.ఆర్‌.పురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ విషయమై ఆదివారం ఉదయం అప్పారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారణ జరిపారు. అనంతరం కేసు నమోదు చేశారు. ఇంతలో మరో వైఎస్సార్‌సీపీ నాయకుడు పాశపు ముకుందను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురైన అప్పారావు తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును ఎస్సై బి.అశోక్‌బాబు పక్కన ఉంటుండగానే తాగేశాడు. వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో హుటాహుటిన శ్రీకాకుళం తరలించారు. అప్పారావు ప్రస్తుతం రిమ్స్‌లో చికిత్స పొందుతున్నట్లు జె.ఆర్‌.పురం సీఐ ఎ.విశ్వేశ్వరరావు తెలిపారు. కాగా, ఎన్‌.ఈశ్వరరావు తనను నాలుగేళ్లుగా వేధింపులకు గురిచేస్తున్నారంటూ, తప్పుడు కేసులు పెట్టిస్తూ మానసిక వేధిస్తున్నారంటూ రాసిన సూసైడ్‌ నోట్‌ను అప్పారావు పోలీసులకు అందజేశారు.

బంధువుల ఆందోళన..
అప్పారావు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలుసుకున్న బంధువులు అధిక సంఖ్యలో జె.ఆర్‌.పురం పోలీసు స్టేషన్‌ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని మండిపడ్డారు.కాగా, స్టేషన్‌ వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement