ఉనికి కాపాడుకునేందుకే టీడీపీ దీక్షలు

YSRCP Leader Rage Parashuram Comments On TDP Anantapur - Sakshi

అనంతపురం టౌన్‌: ఉనికిని కాపాడుకునేందుకే టీడీపీ దీక్షలు చేస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగే పరశురాం ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వంచనపై జూలై 2న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘వంచనపై గర్జన దీక్ష’ విజయవంతం కావడంతో టీడీపీ నేతలు జీర్ణించుకోలేక నిరసన దీక్షల పేరిట కొత్త డ్రామాకు తెరలేపారన్నారు.  కేంద్రంలోని బీజేపీ రాష్ట్రానికి చేసిన మోసంపై నాలుగేళ్లల్లో ఏనాడూ విమర్శలు చేయని టీడీపీ నేతలు..ఎన్నికలు సమీపిస్తున్న వేళ దీక్షల పేరుతో డ్రామాలు ఆడుతున్నారన్నారు. టీడీపీ ఎన్నిడ్రామాలు ఆడినా... ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ఏపీ ప్రజల ఆత్మగౌరవ సమస్యగా మారిన ప్రత్యేక హోదా సాధన కోసం  నాలుగేళ్లుగా దశల వారీగా ఉద్యమాలు చేపట్టిన ఘనత ఒక్క వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు.

రాష్ట్రాభివృద్ధి కోసం 29సార్లు ఢిల్లీ పర్యటనలు చేసిన చంద్రబాబు... గడిచిన నాలుగేళ్లలో రాష్ట్రానికి ఎన్ని నిధులు తీసుకువచ్చాడో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీల ఆందోళనలు, ఆమరణ నిరాహార దీక్షలు చేస్తుంటే ఆవహేళనగా మాట్లాడిన చంద్రబాబుకు... దీక్షలు చేసే నైతికహక్కు లేదన్నారు. రాష్ట్రాభివృద్ధిపై చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే తన పార్టీ ఎంపీల చేత రాజీనామా చేయించి కేంద్రంపై పోరాటం సాగించాలన్నారు. ప్రత్యేకహోదా, విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా మోసం చేసిన బీజేపీ, టీడీపీలకు బుద్ధి చెప్పేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నరన్నారు. సమావేశంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పెన్నోబిలేసు, జిల్లా అధికార ప్రతినిధి చింత కుంట మధు, విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు మారుతి    ప్రకాష్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top