నామినేషన్ల దాఖలుకు తెర!

 YSRCP Candidates Ram Reddy, Kotamreddy Nominations In Nellore - Sakshi

జిల్లా వ్యాప్తంగా 173 నామినేషన్లు

నెల్లూరు, తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గాలకు 33 

10 అసెంబ్లీ నియోజకవర్గాలకు 140  

సాక్షి, నెల్లూరు(పొగతోట): సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. నామినేషన్లకు చివరి రోజైన సోమవారం 96 నామినేషన్లు సమర్పించారు.  ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. రెండు పార్లమెంట్, 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 173 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నెల్లూరు పార్లమెంట్‌కు 17, తిరుపతి పార్లమెంట్‌కు 16 నామినేషన్లు, పది అసెంబ్లీలకు 140 నామినేషన్లు దాఖలయ్యాయి. నెల్లూరు పార్లమెంట్‌కు కలెక్టరేట్‌లో జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌ ముత్యాలరాజు నామినేషన్లు స్వీకరించారు. తిరుపతి పార్లమెంట్‌కు సంబంధించి జాయింట్‌ కలెక్టర్‌ వెట్రిసెల్వి డీఆర్డీఏ పీడీ  కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించారు.

కావలి, ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు సిటీ, రూరల్, సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, ఉదయగిరి నియోజకవర్గాల్లో ఆర్వోలు నామినేషన్లు స్వీకరించారు. ఈ నెల 18, 19 తేదీల్లో నామినేషన్లు ఎవరూ వేయలేదు. 20న ఆరుగురు నామినేషన్లు వేశారు. ఈ నెల 21వ తేదీ 12, 22వ తేదీ 59 మంది నామినేషన్లు వేశారు. 23, 24వ తేదీలు సెలవులు కావడంతో నామినేషన్లు స్వీకరించలేదు. చివరి రోజు 96 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన, 28న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నిర్వహించనున్నారు.  నెల్లూరు పార్లమెంట్‌కు 17 మంది, తిరుపతి పార్లమెంట్‌కు 16 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 15 మంది అభ్యర్థులు, అంతకన్నా ఎక్కువ మంది పోటీలో ఉంటే రెండు ఈవీంఎలు ఏర్పాటు చేయాల్సి వస్తుంది.

నెల్లూరు, తిరుపతి పార్లమెంట్‌కు సంబంధించి 2856 పోలింగ్‌ కేంద్రాల్లో ఎంపీలకు రెండు ఈవీఎంలు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. అసెంబ్లీకి సంబంధించి నెల్లూరు నియోజకవర్గంలో 20 మంది, ఉదయగిరిలో 18 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నామినేషన్లు వేసిన అభ్యర్థులందరూ పోటీలో ఉంటే పోలింగ్‌ కేంద్రాల్లో రెండు ఈవీఎంలు ఏర్పాటు చేయాల్సి వస్తుంది.  28వ తేదీన నామినేషన్ల ఉపసంహరణన తర్వాత ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉంటారో తెలుస్తుంది. 29వ తేదీ తరువాత బరిలో ఉండే పార్టీలకు సంబంధించిన అభ్యర్థులకు పార్టీ గుర్తులు కేటాయిస్తారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థులకు గుర్తులు కేటాయించనున్నారు. గుర్తులు కేటాయించిన తరువాత బ్యాలెట్‌ పత్రాన్ని సిద్ధం చేస్తారు. బ్యాలెట్‌ పత్రంలో గుర్తులతో పాటు అభ్యర్థుల ఫొటో ఉంటుంది. వచ్చే నెల 11న ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top