సమర సైనికులు వీరే..

YSRCP Assembly Candidates In Guntur District - Sakshi

సాక్షి, గుంటూరు : ఎన్నికల సమరానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమైంది. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను పార్టీ అధిష్టానం ఆదివారం ప్రకటించింది. టిక్కెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం పాటించింది. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు లభించింది. అసెంబ్లీ టిక్కెట్ల కేటాయింపులో 17 మంది సమన్వయకర్తలకు అవకాశం దక్కింది. ముగ్గురు మహిళలకు టిక్కెట్లు దక్కాయి. మొత్తం ఆరుగురు కొత్త అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ముగ్గురు పార్లమెంట్‌ అభ్యర్థులు, 17 మంది అసెంబ్లీ అభ్యర్థులు నూతనోత్సాహంతో సమరశంఖం పూరిస్తూ ఎన్నికల యుద్ధానికి సిద్ధమయ్యారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమరానికి పార్టీ సైనికులను సన్నద్ధం చేసింది. వైఎస్సార్‌ కడప జిల్లాలోని ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి చెంత ఆదివారం ఉదయం జిల్లాలోని 17 అసెంబ్లీ, మూడు పార్లమెంటు స్థానాలకు ఒకే సారి అభ్యర్థులను ప్రకటించారు. జిల్లాలో కష్టపడి పనిచేసిన వారందరికీ ముందుగా మాటిచ్చిన ప్రకారం టిక్కెట్లు కేటాయించిన పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశ్వసనీయతను నిలుపుకొన్నారు. కష్టకాలంలో పార్టీకోసం కృషి చేసిన సమన్వయకర్తలందరికీ టిక్కెట్లు ఇచ్చి మాటతప్పని, మడమతిప్పని నాయకుడిగా నిరూపించుకున్నారు. టిక్కెట్ల కేటాయింపులో అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పించడంతో జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

అందరికీ ప్రాధాన్యం కల్పిస్తూ..
మూడు పార్లమెంట్‌ స్థానాల్లో ఒకటి కమ్మ, ఒకటి రెడ్డి, ఎస్సీ రిజర్వుడ్‌ స్థానంలో సామాన్యునికి పట్టంకట్టారు. అన్ని సామాజిక వర్గాలకూ ప్రాధాన్యం కల్పిస్తూ టిక్కెట్లు కేటాయించడంతో జిల్లాలో అభ్యర్థుల ఎంపికపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 17 అసెంబ్లీ స్థానాల్లో కమ్మ సామాజిక వర్గానికి మూడు సీట్లు, రెడ్డి సామాజిక వర్గానికి నాలుగు సీట్లు, ఎస్సీలకు మూడు స్థానాలు, బీసీలకు మూడు, కాపులకు రెండు, ముస్లిం మైనార్టీ, బ్రాహ్మణ వర్గాలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించడం విశేషం.

వీటిల్లో తాడికొండ, ప్రత్తిపాడు, చిలకలూరిపేటలో మహిళా అభ్యర్థులను నిలపటంతో, జిల్లా ప్రజలు మహిళలకు పెద్ద పీట వేశారని వ్యాఖ్యానిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా నుంచి ఒక పార్టీ తరఫున ముగ్గురు మహిళలు పోటీ చేయడం విశేషం. రాజధాని కీలక నియోజకవర్గంలో మహిళా అభ్యర్థి ఉండవల్లి శ్రీదేవి ఎన్నికల బరిలో నిలిచారు. గుంటూరు ఈస్ట్‌ నియోజకవర్గం టిక్కెట్‌ను సిట్టింగ్‌ ముస్తఫాకు కేటాయించి ముస్లిం మైనార్టీల నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు.

నరసరావుపేట పార్లమెంట్‌ స్థానాన్ని సైతం ఎన్నడూ లేని విధంగా కమ్మ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలకు కేటాయించి ఆవర్గంపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. వైఎస్సార్‌ సీపీ టిక్కెట్ల కేటాయింపులో అన్ని వర్గాల వారికి ప్రాధాన్యం కల్పించడంతో జిల్లా ప్రజలు ఆ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా జిల్లాలో మహిళలంతా తమకు వైఎస్సార్‌సీపీ ఇచ్చిన గౌరవానికి రానున్న ఎన్నికల్లో తమ మద్దతు తెలిపి అన్ని స్థానాల్లో అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని స్పష్టం చేస్తున్నారు.

పార్టీలకు అతీతంగా మహిళలంతా ఏకమై తమకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన వైఎస్సార్‌ సీపీ వైపే ఉంటామంటూ ప్రతిజ్ఞలు చేస్తున్నారు. బ్రాహ్మణులకు సీటు కేటాయించడంతో ఆ సామాజిక వర్గం వారు సైతం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి దన్నుగా నిలుస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గం, పేద కుటుంబానికి సామాన్యుడు బాపట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నందిగం సురేష్‌తో ఎంపీ అభ్యర్థుల జాబితాను చదివించారు. 

ఎన్నికల బరిలో ఆరుగురు కొత్తముఖాలు
సార్వత్రిక ఎన్నికల్లో మొట్టమొదటి సారి ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో ఆరుగురు అభ్యర్థులు సమరానికి సై అంటున్నారు. బాపట్ల, నరసరావుపేట ఎంపీ అభ్యర్థులు నందిగం సురేష్, లావు శ్రీకృష్ణదేవరాయలు, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పెదకూరపాడు నంబూరి శంకరరావు, గురజాల కాసు మహేష్‌రెడ్డి, చిలకలూరిపేట విడదల రజిని, తాడికొండ డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి మొదటి సారి ఎన్నికల గోదాలోకి దిగుతున్నవారు కావడం గమనార్హం.
 
సామాన్యుడికి అరుదైన అవకాశం 
బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సామాన్య కార్యకర్త నందిగం సురేష్‌కు టిక్కెట్‌ ఇచ్చారు. పార్టీలో కష్టపడి పనిచేసేవారికి తగిన గుర్తింపు ఉంటుందనడానికి ఇది నిదర్శనం. దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి చెంత ఎంపీల జాబితాను చదివే అరుదైన అవకాశం నందిగం సురేష్‌కు దక్కింది. సామాన్య కార్యకర్తనైన తనకు అరుదైన అవకాశం వచ్చిందని, ఈ జన్మకు ఈ అదృష్టం చాలని సురేష్‌ సంతోషం వ్యక్తంచేశారు. 

సమైక్య ఉద్యమ పోరాట యోధుడు 
గుంటూరు పార్లమెంటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాలరెడ్డి సమైక్య ఉద్యమం సమయంలో రాష్ట్రం విడిపోకుండా ఉండేందుకు పార్లమెంటులో గట్టిగా పోరాడారు. ఉత్తరదాది ఎంపీలతో దెబ్బలు తిన్నారు. గతంలో నరసరావుపేట ఎంపీగా పనిచేశారు. తరువాత గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికైన మోదుగుల వేణుగోపాలెడ్డి టీడీపీలో అవినీతి, ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చక ఇటీవలే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆయనను గుంటూరు పార్లమెంటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. మాస్‌లీడర్‌గా మోదుగులకు గుర్తింపు ఉంది.

బరిలో విద్యాధికుడు
నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థిగా యువకుడు, విద్యావేత్త, విజ్ఞాన్‌ సంస్థల అధినేత లావు రత్తయ్య కుమారుడు శ్రీకృష్ణదేవరాయలును ఎంపిక చేశారు. వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో విద్యాభివృద్ధికి కృషిచేస్తారని, పల్నాడు ప్రాంతంలో తాగు, సాగునీటి సమస్యలు పరిష్కరించి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా పనిచేస్తాడనే నమ్మకంతో ఆయనకు ఈ బాధ్యత అప్పజెప్పారు.

తొలుత గుంటూరు పార్లమెంటు సమన్వయకర్తగా పనిచేశారు. తరువాత రాజకీయ సమీకరణలో భాగంగా నరసరావుపేట పార్లమెంటు సమన్వకర్తగా నియమితులయ్యారు. కష్టపడి పనిచేయడంతో పాటు, అనతికాలంలోనే పల్నాడు ప్రజల అభిమానాన్ని చూగొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top