వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

YSRCP Activist commits suicide   - Sakshi

పోలీస్‌స్టేషన్‌ ఎదుటే అఘాయిత్యం

పెద్దవడుగూరు/ అనంతపురం న్యూసిటీ: క్రిష్టిపాడు సింగిల్‌విండో ప్రెసిడెంట్‌ అప్పేచర్ల చిట్టెంరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి హత్య కేసులో రాజీ కావాలంటూ అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో పోలీసులు వేధింపులకు గురి చేయడంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్త చిక్కెం విజయభాస్కర్‌రెడ్డి శనివారం ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసుల తీరును నిరసిస్తూ పోలీస్‌ స్టేషన్‌ ఎదుటే పురుగుమందు తాగడం కలకలం రేపింది. బాధితుని బంధువులు తెలిపిన మేరకు.. జేసీ సోదరుల వెన్నంటి ఉండే చిట్టెంరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి 2015లో వైఎస్సార్‌సీపీలో చేరాడు. అదే ఏడాది మార్చి 31న దారుణ హత్యకు గురయ్యాడు. అప్పటి నుంచి ఆయన అనుచరులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నాయి. గ్రామంలో ఏ సంఘటన జరిగినా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలనే టార్గెట్‌ చేసుకుని వేధింపులకు గురిచేసేవారు. చిట్టెంరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి హత్య కేసులో రాజీకి రావాలని అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్లు తీవ్రం చేసి.. వ్యతిరేకించే వారిని గొడవల్లో ఇరికించి అక్రమ కేసులు బనాయించేవారు. 

పోలీసుల ఓవరాక్షన్‌
అక్టోబర్‌ 31న అప్పేచర్ల గ్రామం 521 సర్వేనంబర్‌లోని ప్రభుత్వ భూమిలో గల చింత తోపు కొలతలు వేయడానికి రెవెన్యూ సిబ్బంది వెళ్లారు. వీరి ద్విచక్రవాహనాల టైర్లను గుర్తుతెలియని వ్యక్తులు పంక్చర్‌ చేసి, ప్లగ్గులు ఎత్తుకెళ్లారు. బాధితులు పొలం అనుభవదారులపై అనుమానం వ్యక్తం చేస్తూ తహసీల్దార్‌ సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ నిమిత్తం చిక్కెం విజయభాస్కర్‌రెడ్డితోపాటు మరికొంతమందిని స్టేషన్‌కు పిలిపించారు. విచారణ పేరిట.. మరోసారి ‘రాజీ’ కోసం వేధించడంతో చిక్కెం విజయభాస్కర్‌రెడ్డి శనివారం పోలీస్‌స్టేషన్‌ ఎదుటే పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. 

వైఎస్సార్‌సీపీ నేతల పరామర్శ
అనంతపురం సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న చిక్కెం విజయభాస్కర్‌రెడ్డిని వైఎస్సార్‌సీపీ అనంతపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, వైఎస్సార్‌ సీపీ తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పరామర్శించారు. చిట్టెంరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి హత్య విషయంలో సీఐ, ఎస్‌ఐలు పదే పదే రాజీకావాలని చిక్కెం విజయభాస్కర్‌రెడ్డిపై ఒత్తిడి తీసుకు వచ్చారన్నారు. గ్రామాన్ని వదిలిపోతారా లేక రాజీ అవుతారా అంటూ బెదిరిస్తున్నారని పోలీసుల తీరును తప్పుపట్టారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఒత్తిళ్లకు తలొగ్గి ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేయడం మంచిది కాదన్నారు. పోలీసుల తీరు మార్చుకోవాలని సూచించారు. బాధితుడిని పరామర్శించిన వారిలో వైఎస్సార్‌ సీపీ జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు, పార్టీ నగరాధ్యక్షుడు సోమశేఖర్‌రెడ్డి, నేతలు చుక్కలూరు దిలీప్‌రెడ్డి, కసునూరు రఘునాథరెడ్డి, నారాయణరెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top