వీవోయేల ఆందోళనకు వైఎస్సార్‌ సీపీ మద్దతు

 YSR Congress Party Supports DWCRA Animators Protest - Sakshi

సాక్షి, అమరావతి : డ్వాక్రా యానిమేటర్ల(వీవోయేల) ఆందోళనకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే డ్వాక్రా యానిమేటర్లు (వీవోయే)లు సోమవారం నుంచి తలపెట్టిన ఆందోళనలు, చలో కలెక్టరేట్‌ కార్యక్రమాలకు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తన సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈ మేరకు వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొని సంఘీభావం ప్రకటించాలని పార్టీ పిలుపునిచ్చింది. ఆ ప్రకటనలో ‘‘వీవోయేలకు న్యాయబద్ధంగా జీతాలను చెల్లించకపోగా వారికి ఆర్థిక సహాయం అంటూ తాజాగా నెలకు రూ.3,000 సహాయం(సర్వీస్‌ ఛార్జ్‌) అంటూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జీవో జారీ చేసింది.

ఎన్నికలు నాలుగైదు నెలలు ఉన్నాయనగా జారీ చేసిన ఈ జీవోకు, ఇంతకు ముందు ప్రభుత్వం వీవోయేలతో జరిపిన చర్చల సందర్భంగా ఇచ్చిన హామీలకు సంబంధం లేదు. ప్రమోషన్లు, ప్రమాద బీమా, సెర్ఫ్‌ నుంచి గుర్తింపు కార్డుల ప్రస్తావనే ఈ జీవోలో లేదు. ప్రజా సంకల్ప యాత్ర తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతున్న నేపథ్యంలో జూలై 15న పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసి డ్వాక్రా యానిమేటర్లు తమ గోడును వెళ్ళబోసుకున్న సందర్భంగా, వారికి తమ ప్రభుత్వం వచ్చాక రూ.10,000 వేతనంగా చెల్లిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. చంద్రబాబు ఇచ్చిన తరవాత యానిమేటర్ల జీతాలను నిలిపివేయటం... ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయన్న భయంతో రూ.3000, అదీ ఈ నవంబరు నుంచి ఏడాది కాలం మాత్రమే ఇస్తాం అంటూ జీవో జారీ చేయటం దుర్మార్గమన్న వీవోయేల వాదనను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా బలపరుస్తోంద’’  పేర్కొంది. వీవోయేల ఆందోళనలకు జిల్లాల వారీగా మద్దతు పలకాల్సిందిగా వైఎస్సార్‌ సీపీ తమ పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top