కడప స్టీల్‌ ప్లాంట్‌ను అడ్డుకుంది చంద్రబాబే!

YSR Congress Party To Stage Protest For Kadapa Steel Plant - Sakshi

కడపలో వైఎస్సార్‌ సీపీ మహాధర్నా..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై పార్టీ నేతల మండిపాటు

సాక్షి, కడప‌: విభజన చట్టంలో హామీ ఇచ్చినప్పటికీ.. కడపలో ఇప్పటికీ స్టీల్‌ ప్లాంట్‌ రాకపోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు మండిపడ్డారు. కడపలో స్టీల్‌ ప్లాంట్‌ సాధన కోసం తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు. కడపలో వెంటనే స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌ సీపీ శనివారం నగరంలో మహా ధర్నాను చేపట్టింది. జిల్లాలోని పాత కలెక్టరేట్‌ వద్ద దివంగత నేత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి వైఎస్సార్‌ సీపీ నేతలు మహాధర్నాను ప్రారంభించారు. ఈ సందర్భంగా కడప స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు, టీడీపీ, బీజేపీ నేతల మోసపూరిత వైఖరిపై పార్టీ నేతలు మండిపడ్డారు. కడప్‌ స్టీల్‌ ప్లాంట్‌ గురించి నాలుగేళ్లుగా మాట్లాడని టీడీపీ నేతలు ఇప్పుడు దీక్షలు చేయడంలో అర్థమేమిటని నిలదీశారు. కేవలం ఓట్ల కోసమే టీడీపీ నేతలు దీక్షలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్‌ తలపెట్టిన స్టీల్‌ ప్లాంట్‌ను అడ్డుకుంది చంద్రబాబేనని.. ఇప్పుడు స్టీల్‌ ప్లాంట్‌ కోసం ఆయన మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.

ఈ మహాధర్నాకు వైస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలు హాజరయ్యారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ సాధన పోరాటంలో భాగంగా జూన్‌ 23 నుంచి 26 వరకు కడపలో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ నెల 24న (జూన్‌) బద్వేలులో మహాధర్నా, రాజాంపేటలో 25న మహాధర్నా, జమ్మలమడుగులో భారీ దీక్షలు చేపడుతామని చెప్పారు. జూన్‌ 27న జాతీయ రహదారుల దిగ్బంధానికి, జూన్‌ 29న రాష్ట్ర బంద్‌కు వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చింది. గత నాలుగేళ్లుగా కడప ఉక్కు- రాయలసీమ హక్కు అనే నినాదంతో ఉద్యమం జోరుగా నడుస్తున్న విషయం తెలిసిందే. కడప ఉక్కు సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తామని నేతలు చెప్పారు. ఈ మహాధర్నాలో వైఎస్సార్‌సీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రవీంద్రనాథ్‌ రెడ్డి, అంజాద్‌ బాషా, శ్రీకాంత్‌ రెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, మేయర్‌ సురేష్‌ బాబు, రాజంపేట  పార్లమెంట​ అధ్యక్షుడు అమర్‌నాథ్‌ రెడ్డి, బద్వేలు సమన్వయకర్త వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top