ఉషస్సులు నింపుతున్న ఆరోగ్యశ్రీ 

YSR Aarogyasri Scheme Expansion brings new life to poor people - Sakshi

పశ్చిమ గోదావరి జిల్లాలో సత్ఫలితాలిస్తున్న పైలట్‌ ప్రాజెక్ట్‌ 

రూ.వెయ్యి బిల్లు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు 

ఒక్క జిల్లాలోనే 12 రోజుల్లో 1,100 మందికి వైద్యం 

జనవరి 3న 2,059 జబ్బులకు ఆరోగ్యశ్రీ విస్తరణను ప్రారంభించిన సీఎం 

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పరిధిలోకి  2,059 జబ్బులను చేర్చి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న పథకం సత్ఫలితాలిస్తోంది. ఈ ఏడాది జనవరి 3వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన ఆరోగ్యశ్రీ విస్తరణ పథకం పేదల జీవితాల్లో కొత్త ఉషస్సులు నింపుతోంది. రూ.వెయ్యి బిల్లు దాటితే ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింప చేస్తున్నారు. ఈ ఒక్క జిల్లాలోనే జనవరి 3 నుంచి 14వ తేదీ వరకూ రూ.వెయ్యి బిల్లు దాటిన 1,100 మందికి పైగా పేదలు నమోదయ్యారు. విస్తరించిన పథకం ప్రారంభమైన నాటినుంచి రోజు రోజుకూ లబ్ధిదారుల సంఖ్య పెరుగుతోంది. రూ.వెయ్యి బిల్లు దాటిన వారంతా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రికి వెళుతున్నారు.

అక్కడ ఆరోగ్యమిత్ర రోగుల జబ్బులు నమోదు చేసుకుని ఆ జబ్బు జాబితాలో ఉంటే తక్షణమే అనుమతుల నిమిత్తం ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు పంపిస్తున్నారు. వీలైనంత త్వరగా అనుమతులు వస్తుండటంతో రోగుల సంఖ్య పెరుగుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఆరోగ్యశ్రీ పరిధిలో 54 ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులు 54 వరకూ ఉండగా.. వాటిలోని 34 ఆస్పత్రుల్లో గడచిన 12 రోజుల్లో రూ.వెయ్యి బిల్లు దాటిన వారు ఉచితంగా చికిత్స పొందారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పరిస్థితులను పూర్తిగా అవగాహన చేసుకుని ఏప్రిల్‌ 1నుంచి ప్రతినెలా ఒక జిల్లాలో 2,059 జబ్బులకు చికిత్సలను అందుబాటులోకి తెస్తారు.

ప్రతి రోగి వివరాలూ నమోదు చేయాలని చెప్పాం 
ప్రతి రోగి వివరాలను నమోదు చేయాలని చెప్పాం. 2,059 రకాల జబ్బులు కాకుండా కొత్తగా ఏమైనా నమోదవుతున్నాయా, అలాంటి వారెవరైనా వైద్యం కోసం వచ్చి వెనక్కి వెళుతున్నారా, జాబితాలో చేర్చిన జబ్బుల్లో వైద్యం కోసం రోగులు రావడం లేదనే వివరాలనూ నమోదు చేయిస్తున్నాం. జాబితాలో లేని జబ్బులు ఏవైనా నమోదైతే వాటిని గుర్తించటం, ఎవరూ వైద్యానికి రాని జబ్బులు ఉంటే వాటిని తీసెయ్యడం వంటి వివరాల కోసం రిజిస్ట్రీని నిర్వహిస్తున్నాం. జబ్బుల సరళిని గుర్తించి వాటి నియంత్రణకు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. 
–డాక్టర్‌ ఎ.మల్లికార్జున, సీఈఓ, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top