జగనన్నను సీఎంగా చూడాలన్నదే నాన్న కోరిక: వైఎస్‌ సునీతా రెడ్డి

Pulivendula people come first and then family, says ys vivekananda reddy daughter - Sakshi

మా జగనన్నను సీఎంను చేయాలన్నదే నాన్న కోరిక

మా కుటుంబంపై అసత్య ప్రచారాలు మానుకోండి

హత్య ఎవరు చేశారన్నది విచారణలో తేలుతుంది

విచారణ నిష్పక్షపాతంగా జరగనివ‍్వండి

సాక్షి, పులివెందుల : తన తండ్రి చనిపోయిన దుఃఖంలో తాముంటే, ఆయనపై మీడియా, పేపర్లలో వచ్చిన వార్తలు మరింత బాధ కలిగిస్తున్నాయని వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి అన్నారు. ఆమె బుధవారం పులివెందులలో మీడియాతో మాట్లాడుతూ...’ పులివెందులతో నాన్నకు చాలా అనుబంధం ఉంది. ఇక్కడి ప్రజలంటే ఆయనకు చాలా ఇష్టం. నాన్నకు ప్రజలే ముందు, ఆ తర్వాతే కుటుంబం. అన్న వైఎస్‌ జగన్‌మోహనన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని నాన్న కోరిక. అందుకోసం ఎన్నికల ప్రచారంలో భాగంగా చాలారోజుల నుంచి పులివెందులలో ఒక్కరే ఉంటున్నారు. పార్టీ కోసం ఆయన అహర్నిశలు ప్రచారం కూడా చేశారు. ఆయన ఎప్పుడూ ప్రజల మధ్యే ఉండేవారు. మా నాన్నను అందరూ అభిమానిస్తారు. 

గత కొంతకాలంగా అమ్మకు ఆరోగ్యం బాగుండటం లేదు. అందుకే ఆమె నా దగ్గరే ఎక్కువగా ఉంటున్నారు. నాన్న బతికినంత కాలం చాలా హుందాగా బతికారు. ఆయన చనిపోయిన బాధలో మేముంటే...మరోవైపు ఆయనపై వస్తున్న కథనాలు మరింత ఆవేదనకు గురి చేస్తున్నాయి. చనిపోయిన వ్యక్తి గురించి అవమానకరంగా మాట్లాడటం కూతురుగా చాలా బాధపడ్డాను. మా నాన్నను అతి కిరాతంగా హత్య చేశారు. ఆయన హత్యకు సంబంధించి సరైన విచారణ జరగడం లేదు. కేసు విచారణలో ఉన్నప్పుడు మేము మాట్లాడటం సరికాదు. సిట్‌ తన పని తాను చేసుకోనివ్వాలి. మా కుటుంబంలో గొడవలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు. మా ఫ్యామిలీలో సుమారు 700మందికి పైగా ఉన‍్నారు. అన‍్ని ప్రాంతాలకు చెందినవారు మా కుటుంబంలో ఉన్నారు. అభిప్రాయలు వేరుగా ఉన్నా, అందరం కలిసే ఉంటాం. ఒకరి అభిప్రాయాలను మరొకరం గౌరవిస్తాం. 

అధికారంలో ఉన్న కొంతమంది పెద్ద మనుషులు సిట్‌ విచారణ పూర్తి కాకముందే నిర్ణయాలు చెప్పేస్తున్నారు. అలా చేస్తే అది సిట్‌ విచారణపై ప్రభావం చూపిస్తుంది. నాన్న రాసిన లేఖ గురించి ఫోరెన్సిక్‌ నివేదికలో తెలుస్తుంది. సిట్‌ నుంచి నిష్పాక్షిమైన విచారణను మేం కోరుతున్నాం. నాన్న చనిపోవడమే పెద్ద షాక్‌, ఆ సమయంలో నాన్న మృతి తెలిసిన సన్నిహితులు చాలామంది ఇంటికి వచ్చారు. ఆ సమయంలో వాళ్లు తప్పు చేశారని ముందే ఎలా చెబుతారు?. దోషులు ఎంత పెద్దవాళ్లు అయినా శిక్ష పడాల్సిందే. దర్యాప్తు విషయంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎలా?’  అని ప్రశ్నించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top