మండు వేసవిలోనూ కోతల్లేకుండా విద్యుత్‌ | YS Jaganmohan Reddy Govt Special Focus On Electricity Charges | Sakshi
Sakshi News home page

మండు వేసవిలోనూ కోతల్లేకుండా విద్యుత్‌

Mar 3 2020 3:28 AM | Updated on Mar 3 2020 3:28 AM

YS Jaganmohan Reddy Govt Special Focus On Electricity Charges - Sakshi

సాక్షి, అమరావతి: వేసవిలో విద్యుత్‌కు ఉండే డిమాండ్‌ అంతా ఇంతా కాదు. నిర్విరామంగా నడిచే ఫ్యాన్లు ఏసీలతో డిమాండ్‌ అమాంతం పెరిగిపోతుంది. దానితో పాటే విద్యుత్‌ కోతలూ పెరిగిపోతాయి. ఈ పరిస్థితుల్లో విద్యుత్‌ శాఖ విలవిల్లాడిపోతుంది. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ఎక్కడ పడితే అక్కడ, ఎంత పడితే అంత వెచ్చించి కరెంటు కొనేస్తుంది. యూనిట్‌కు రూ.7 వెచ్చించి కొన్న సందర్భాలూ ఉన్నాయి. రూ.కోట్లు ఖర్చు పెట్టి, ఆ భారాన్నంతా విద్యుత్‌ చార్జీల రూపంలో ప్రజలపై వేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగింది ఇదే. ఈ పరిస్థితిని నివారించలేమా? విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రతిచోటా ఇదే ప్రశ్న ఎదురైంది. ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రజలపై నయా పైసా అదనపు భారం పడకుండా, విద్యుత్‌ కోతలనే మాటే విన్పించకుండా చూడాలని ఆదేశించింది. సవాల్‌గా తీసుకున్న విద్యుత్‌ అధికారులు మంచి ముందస్తు ప్రణాళిక తయారు చేశారు. అవసరమైన విద్యుత్‌ను అతి తక్కువకే కొనేందుకు రూపొందించిన ప్లాన్‌కు ఏపీఈఆర్‌సీ ఆమోదం తెలిపింది. 

ఈసారి రోజుకు 200 ఎంయూలకు పైనే డిమాండ్‌?
ఈ ఏడాది వేసవిలో మునుపెన్నడూ లేనంత విద్యుత్‌ డిమాండ్‌ ఉంటుందని అంచనా. విద్యుత్‌ ఉపకరణాలు పెరగడం, కొత్త కనెక్షన్లు రావడం, మార్కెట్‌ సర్వే ఆధారంగా అధికారులు ఈ అభిప్రాయానికొచ్చారు. ఇదివరకు మండు వేసవిలోనూ గరిష్టంగా రోజుకు 185 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ డిమాండ్‌ మాత్రమే నమోదైంది. కానీ ఈసారి మార్చి–మే మధ్య రోజుకు సగటున 200 ఎంయూలపైనే విద్యుత్‌ వాడకం ఉండొచ్చని స్టేట్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ అధికారి ఒకరు చెప్పారు. అదే సమయంలో రోజుకు సగటున గరిష్టంగా 163 ఎంయూల విద్యుత్‌ లభ్యత మాత్రమే ఉండొచ్చని తెలిపారు. 

ఈ నేపథ్యంలో 500 మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకు గాను పోటీ బిడ్డింగ్‌కు వెళ్లేందుకు విద్యుత్‌ అధికారులు రోడ్‌మ్యాప్‌ వేశారు.  విద్యుత్‌ కోతల్లేకుండా చూసేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ తరహా ముందస్తు కసరత్తు గతంలో ఎప్పుడూ జరగలేదని దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. 

ముందే పోటీ బిడ్డింగ్‌తో ప్రయోజనం 
గతంలో అప్పటికప్పుడు బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ కొనేవాళ్లు. దీంతో విపరీతమైన రేట్లు ఉండేవి. ఇప్పుడలా కాదు. వచ్చే మూడు నెలలకు ఎంతకావాలో అంతకు ముందే ఓపెన్‌ టెండర్లు పిలుస్తున్నారు. పోటీ బిడ్డింగ్‌లో ఎలాంటి అక్రమాలకూ తావుండదు. పైగా పోటీ కారణంగా అతి తక్కువకే విద్యుత్‌ లభిస్తుంది. మార్కెట్‌ అంచనాలను బట్టి ట్రాన్స్‌మిషన్, పవర్‌ గ్రిడ్‌ చార్జీలవంటివన్నీ కలిపినా.. మార్చి, ఏప్రిల్, మే నెలలో స్వల్పకాలిక కొనుగోళ్ల కింద యూనిట్‌ రూ.4.05కే లభిస్తుందని అధికారులు తెలిపారు. 

ప్రజలపై భారం పడకుండా కొనుగోళ్లకు అనుమతి 
మార్చి–మే మధ్య విద్యుత్‌ లభ్యత, డిమాండ్‌ మధ్య ఉన్న తేడా భర్తీ విషయం డిస్కమ్‌లు కమిషన్‌ దృష్టికి తెచ్చాయి. దీన్ని అన్ని కోణాల్లోనూ పరిశీలించి డిస్కమ్‌లు ప్రతిపాదించిన దానిలో 85 శాతం కొనుగోళ్లకు అనుమతించాం. ముందస్తు కొనుగోళ్లతో ఇప్పటి కన్నా చౌకగా విద్యుత్‌ లభిస్తుందని విద్యుత్‌శాఖ పేర్కొంది. అందువల్ల ప్రజలపై కూడా భారం పడదనే ఉద్దేశంతో స్వల్పకాలిక కొనుగోళ్లకు అనుమతించాం.     
    – జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి (ఏపీఈఆర్‌సీ చైర్మన్‌)

కోతలు లేకుండా చేయడానికే 
వేసవిని ఎదుర్కొనేందుకు విద్యుత్‌ శాఖ అధికార యంత్రాంగం తీవ్ర కసరత్తు చేసింది. విద్యుత్‌ సంస్థలపై ఆర్థిక భారం పడకూడదనే ఓపెన్‌ బిడ్డింగ్‌కు వెళ్తున్నాం. తద్వారా యూనిట్‌ రూ.4.05కు లభిస్తుంది. నిజానికి ఈ ధర ఇప్పుడు మేం కొంటున్న అన్ని రకాల విద్యుత్‌ ధరల కన్నా తక్కువే.    
– శ్రీకాంత్, ఇంధనశాఖ కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement