
జగన్‌ను విడిది వద్ద కలిసిన కోలగట్ల
విజయనగరం: ఎండ మండిపోతున్నా..కాళ్లు కాయలు కాస్తున్నా..అనారోగ్యాన్ని అస్సలు లెక్కచేయక అడుగులు వడివడిగా వేస్తూ ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అడుగడుగునా సమస్యలతో నిండిన జనమే ఎదురయ్యారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారి వ్యధాభరిత గాధలను విన్న జగన్ సాధ్యమైనంత వరకూ ప్రతీ సమస్యకు అప్పటికప్పుడే పరిష్కారం చూపించారు. కొన్నింటిని ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిష్కరిస్తానంటూ భరోసా ఇచ్చారు. ఆయన మాటిచ్చిన అభాగ్యులకు పాదయాత్ర సమయంలోనే సాయం అందగా, కొందరికి జిల్లాలో పాదయాత్ర పూర్తయిన తర్వాత కూడా సాయం అందించి జగన్ తానిచ్చిన మాటను నిలబెట్టుకుని, తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు.
చిన్నారి బాధను జగనన్నకు చెప్పుకున్నాం..
నా పేరు బడుగంటి సత్యనారాయణ, మాది మణ్యపురిపేట గ్రామం, గుర్ల మండలం. మా కుమారుడు బడుగంటి రోహిత్ పుట్టిన అప్పటినుంచి అంగవైకల్యంతో బాధపడుతున్నాడు, రోహిత్‌కు ట్రై సైకిల్ మంజూరు చేయాలని అధికారులకు ఎన్ని సార్లు దరఖాస్తు చేసుకున్న మంజూరు చేయలేదు. జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో భాగంగా మణ్యపురిపేట వద్దకు చేరుకున్నప్పుడు జగన్‌ను కలిసి రోహిత్ సమస్య గురుంచి తెలియజేశాం. ట్రై సైకిల్ అందిస్తామని హమీ ఇచ్చారు. హమీ మేరకు జిల్లా వైఎస్సార్‌సీపీ నాయకులు ట్రై సైకిల్ అందించారు.
ఆర్థిక సాయం చేశారు..
నా పేరు దమరశింగి సుజాత, మాది కెల్ల గ్రామం. గుర్ల మండలం. నేను ఐదేళ్లుగా కాలేయం, కిడ్ని, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నాను. రెండు నెలలుకు ఒకసారి ఆస్పత్రికి తీసుకువెళ్లి కాలేయంలో ఉన్న నీటిని తొలగించాలని వైద్యులు సూచించారు. లేకపోతే ప్రాణానికే ప్రమాదమని తెలిపారు. ఇప్పటి వరకు ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం సుమారుగా రూ.10లక్షలు ఖర్చు చేశాం. ఆర్థిక భారమైనా అప్పులు చేసి చికిత్స చేస్తున్నాం. నా భర్త రాము తాపీమేస్త్రీగా పని చేస్తున్నాడు. ఒక్కరి కూలీతోనే కుటుంబ పోషణ జరగాలి. నా వైద్యం సాగాలి. వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కెల్ల గ్రామంలో ఆయన్ని కలిసి కష్టాలు చెప్పి, వినతిపత్రం అందించాం. జగన్ మా సమస్యను గుర్తించి జిల్లా వైఎస్సార్‌సీపీ నాయకులుతో మాకు ఆర్థిక సాయం చేశారు. చాలా సంతోషంగా ఉంది.
పెద్ద మనుసుతో ఆదుకున్నారు..
నా పేరు అంబల్ల రామకష్ణ, మాది కెల్ల గ్రామం. గుర్ల మండలం. నేను తాపీమేస్త్రీగా పనిచేస్తున్న సమయంలో అదుపు తప్పి భవనం మీద నుంచి జారీ పడ్డాను. ఆ ప్రమాదంలో నా వెన్నెపూసకు బలమైన గాయమై రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. అప్పటి నుంచి నేను మంచంపైనే పడి ఉన్నా. నా తల్లిదండ్రులు సీతమ్మ, పైడినాయుడు వృద్ధులు కావడంతో కుటుంబ పోషణ కష్టం అవుతుంది. తండ్రి కూడా మంచం పట్టడంతో ఇద్దరికి చికత్స కోసం రూ.8 లక్షలపైనే ఖర్చు అవుతుంది. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని కెల్ల గ్రామంలో కలిసి ఆదుకోవాలని, ఎలక్ట్రికల్ వీల్ చైర్ అందించాల్సిందిగా కోరా. జగన్ స్పందించి అదుకుంటామని హమీ ఇచ్చారు. జిల్లాలో పాదయాత్ర ముగిసిన తర్వాత జిల్లా వైఎస్సార్ సీపీ నాయకులు ఆర్థిక సాయం అందించారు. ఎలక్ట్రికల్ వీల్‌చైర్‌ను కూడ పంపిస్తామని నాయకులు చెప్పారు.
జగన్‌ను కలిసిన కోలగట్ల
విజయనగరం రూరల్: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని అగ్రహారం ప్రాంతంలో మంగళవారం రాత్రి మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రజా సంకల్పయాత్ర ముగింపు కార్యక్రమంలో భాగంగా ముందస్తుగా పాదయాత్ర రాత్రి విడిది వద్ద జగన్‌ను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్లు కోలగట్ల తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు, బూత్ కమిటీల క్రియాశీలక పాత్ర, రావాలి జగన్– కావాలి జగన్ కార్యక్రమాలను కోలగట్ల జగన్‌కు వివరించినట్లు పేర్కొన్నారు. ప్రజా సంకల్పయాత్రతో ఏడాది కాలంగా రాష్ట్ర ప్రజల కష్టాల్లో పాలు పంచుకుంటూ ప్రజలకు భరోసా ఇచ్చి దిగ్విజయంగా పాదయాత్ర పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించారని, కోలగట్ల జగన్‌ను అభినందించినట్లు వివరించారు.