నేటి వైఎస్‌ జగన్‌ ప్రచార సభ రద్దు

YS Jagan todays Gurazala Campaign was Canceled - Sakshi

17న నర్సీపట్నం నుంచి ప్రచారం ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌/ సాక్షి, విజయవాడ: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి దారుణ హత్య కారణంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన తొలి రోజు ఎన్నికల ప్రచార సభను రద్దు చేసుకున్నారు. ఈ నెల 16న వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలో తన తండ్రి దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించి, ఆ తర్వాత పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసి అక్కడి నుంచి గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని వైఎస్‌ జగన్‌ తొలుత భావించారు. అయితే జగన్‌ చిన్నాన్న వివేకానందరెడ్డి దారుణ హత్య కారణంగా ఆయన హైదరాబాద్‌ నుంచి శుక్రవారం నాడే హుటాహుటిన కుటుంబ సభ్యులతో కలిసి పులివెందులకు వెళ్లారు. ప్రస్తుతం అక్కడే ఉన్న జగన్‌ శనివారం నాటి కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.  

4 రోజుల ప్రచార షెడ్యూలు ఖరారు
ఈ నెల 17వ తేదీ నుంచి వరుసగా నాలుగు రోజుల వైఎస్‌ జగన్‌ ప్రచార పర్యటన ఖరారైందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ తెలిపారు. ఈ నెల 17న విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నుంచి జగన్‌ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. ఆరోజు ఉదయం 9.30 గంటలకు నర్సీపట్నం, 12 గంటలకు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని డెంకాడ, సాయంత్రం 2.30 గంటలకు తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేటలో జరిగే బహిరంగ సభల్లో జగన్‌ ప్రసంగిస్తారు. ఈ నెల 18న ఉదయం 9.30 గంటలకు కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, మధ్యాహ్నం 12 గంటలకు అనంతపురం జిల్లాలోని రాయదుర్గం, 2.30 గంటలకు వైఎస్సార్‌ జిల్లా రాయచోటిలో సభలు జరుగుతాయి.

ఈ నెల 19న ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలోని కొయ్యలగూడెంలో ఉదయం 9.30 గంటలకు, కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ కేంద్రంలో మధ్యాహ్నం 12 గంటలకు, గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గ కేంద్రంలో 2.30 గంటలకు సభలు ఉంటాయి. అలాగే ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో ఈ నెల 20న ఉదయం 9.30 గంటలకు, నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ కేంద్రంలో మధ్యాహ్నం 12 గంటలకు, చిత్తూరు జిల్లా పలమనేరులో మధ్యాహ్నం 2.30 గంటలకు జరిగే సభల్లో వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తారని రఘురామ్‌ వివరించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top