
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ప్రజాక్షేమం కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పం దిగ్విజయంగా ఫలించాలని, కోట్లాది మంది జనం సంకల్ప మేవ జయతే అంటూ నినదిస్తున్నారు. రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించిన పాదయాత్ర అటు రాయలసీమ నుంచి ప్రారంభమై ఇటు ఉద్దాన సీమ వరకు దిగ్విజయంగా సాగింది. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మంగళవారం పాదయాత్ర జనసందోహం నడుమ సాగింది. ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ ఆధ్వర్యంలో ఉద్దాన ప్రాంత పల్లె జనం జగన్‌మోహన్‌రెడ్డికి జనహారతులిచ్చి స్వాగతాలు పలికారు. ముఖ్యంగా కవిటి, రాజపురం తదితర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో జనం తరలిరావడంతో ఈ ప్రాంతాలన్నీ జనసంద్రంగా మారాయి. ఈ క్రమంలో అడుగడుగునా జనం తమ సమస్యలు విన్నవిస్తుంటే వారి బాధలను ఓపిగ్గా వింటూ తనదైన శైలిలో జగన్ వారికి భరోసా ఇచ్చి, భవిష్యత్‌పై ఆశలు చిగురించారు. పాదయాత్ర నేటితో (బుధవారం) ముగింపునకు చేరుకున్నందున మంగళవారం యాత్రకు ప్రత్యేకత సంతరించుకుంది. ఎలాగైనా జగనన్నను కలవాలని, ఆయనతో కరచాలనం చేయాలని, సెల్ఫీ తీయించుకోవాలని యువకులు, మహిళలతో పాటు వైఎస్సార్‌సీపీలో వివిధ విభాగాల శ్రేణులు కూడా పోటీపడ్డారు. యాత్ర తుది లక్ష్య స్థలమైన ఇచ్ఛాపురం భారీ ఏర్పాట్లతో ముస్తాబైంది.
బ్రహ్మరథం పలికిన ఉద్దానం ప్రజలు
పేద, సామాన్య జనాల సంక్షేమం కోసం, అలాగే రాష్ట్రంలో ‘నారా’సుర పాలనకు అంతమొందించాలని జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు ఉద్దాన ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తిత్లీ తుపానుతో సర్వం కోల్పోయిన వేలాది మంది బాధితులు తమకు అండగా జగనన్న ఉంటాడన్న విశ్వాసంతో యాత్రలో జగన్ వెంట అడుగులు వేశారు. దీంతో ఉద్దాన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సమన్వయకర్త పిరియా సాయిరాజ్ ఆధ్వర్యంలో ఉద్దాన ప్రాంత ప్రజలు భారీ సంఖ్యలో జగన్‌కు స్వాగతాలు పలికారు. కవిటి మండల కేంద్రంతో పాటు రాజపురం, అగ్రహారం తదితర ప్రాంతాల్లో కూడా జనం స్వచ్ఛందంగా అధిక సంఖ్యలో తరలిరావడంతో అధికార పక్ష నేతలకు చెమట్లు పట్టాయి.
ప్రజాసంకల్పయాత్రలో నేతల హోరు..
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మంగళవారం పలువురు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నేతలు జగన్‌తో కలిసి కొంతదూరం అడుగులు వేశారు. ఆయా ప్రాంతాల్లో పార్టీ విషయాలను చర్చిస్తూనే, బుధవారం ముగింపు సందర్భంగా ఏర్పాట్లపై జగన్‌తో ముఖ్య నేతలు చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 80 నియోజకవర్గాలకు చెందిన ప్రముఖ నేతలు, కీలక నియోజకవర్గాల సమన్వయకర్తలు జగన్‌ను కలవడంతో ఉద్దాన ప్రాం తంలో నేతల జోరు, హోరు కనిపించింది.
పార్టీ ముఖ్యనేతలు బొత్స సత్యనారాయణ, కోలగట్ల వీరభద్ర స్వామి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మాజీ ఎంపి మిధున్‌రెడ్డి, గంగుల ప్రభాకరరెడ్డి, జి.అమర్‌నా«ధ్‌రెడ్డి తదితరులు జగన్‌తో కాసేపు నడిచారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ భూమన కరుణాకరరెడ్డి, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, పీఏసీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, రాష్ట్ర పార్టీల ప్రధాన కార్యదర్శులు తలశిల రఘురాం, రెడ్డి శాంతి, పాలకొండ, కురుపాం ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, పాముల పుష్పశ్రీవాణి, పలాస, టెక్కలి నియోజకవర్గాల సమన్వయకర్తలు సీదిరి అప్పలరాజు, పేరాడ తిలక్, మాజీ ఎమ్మెల్యే నరేష్‌కుమార్ అగర్వాలా (లల్లూ), పార్టీ రాష్ట్ర సీఈసీ సభ్యుడు అంధవరపు సూరిబాబు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి నర్తు రామారావు, ఇచ్ఛాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ పిలక రాజేశ్వరి, ఇచ్ఛాపురం నియోజకవర్గ మహిళా విభాగ కన్వీనర్ పిరియా విజయ, పలాస పిఎసిఎస్ అధ్యక్షుడు దువ్వాడ శ్రీధర్ (బాబా), రాష్ట్ర పార్టీ వివిధ విభాగాల నేతలు తమ్మినేని చిరంజీవినాగ్, ధర్మాన కృష్ణ చైతన్య, ఎన్ని ధనుంజయ, కామేశ్వరి, మామిడి శ్రీకాంత్ తదితరులు మంగళవారం నాటి యాత్రలో పాల్గొని జగన్‌కు సంఘీభావం ప్రకటించారు.
సురక్షిత నీరు అందిస్తా..
ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రోగులను అన్ని రకాలుగా ఆదుకుంటామని, వీరి ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరిచేందుకు చర్యలు చేపడతామని జగన్ హామీ ఇచ్చారు. భూగర్భ జలాలే ఇక్కడ కిడ్నీ రోగాలకు ఓ ప్రధాన కారణంగా చెబుతున్న నేపథ్యంలో సమీపంలో ఉన్న పలు నదుల ఉపరితల నీటిని ఉద్దాన ప్రాంతాలకు రప్పించి, సురక్షిత నీటిని సరఫరా చేస్తామని జగన్ ప్రకటించడంతో ఉద్దాన ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం జగన్ పాదయాత్రను కవిటి మండలం కవిటి కొత్తూరు క్రాస్ నుంచి ప్రారంభించగా, కవిటి పట్టణం మీదుగా, తొత్తిడి పుట్టుగ, బొర్రపుట్టుగ, చెండి పుట్టుగ, రాజపురం మీదుగా అగ్రహారం వరకు యాత్ర సాగింది. ఈ ప్రతి తోవ జనవెల్లువగా మారింది. యాత్రలో భాగంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు పెద్ద సంఖ్యలో జగన్‌ను కలిసి తమ గోడును వివరించారు.
ఈ సందర్భంగా జగన్ స్పందిస్తూ.. కిడ్నీ వ్యాధులతో వేలాది మంది చనిపోతున్నా, ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పలాస కేంద్రంగా 200 పడకల ఆస్పత్రిలో కేవలం కిడ్నీ రోగులకు చికిత్సలు చేయిస్తామని, అలాగే కిడ్నీ రోగులకు ప్రతి నెల వైద్య ఖర్చుల కోసం రూ.10 వేలను పింఛనుగా అందజేస్తామని ప్రకటించారు. అలాగే మూడో దశలో ఉన్న వ్యాధి గ్రస్తులకు పూర్తిగా పోషకాహారాన్ని అందించేలా చర్యలు చేపడతామని కూడా వివరించారు. అలాగే ఈయాత్రలో తిత్లీ తుపాను బాధితులు, కొబ్బరి, జీడి రైతులు, సామంతులు, కండ్ర, బ్రాహ్మణ, కాపు తదితర కులాల ప్రతినిధులు కూడా జగన్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. అలాగే జగనన్న చేసిన సహాయంతో తన కుమారుడు లోకేష్‌కు బ్రెయిన్‌ట్యూమర్ వ్యాధికి ఆపరేషన్ దిగ్విజయంగా పూర్తయ్యిందని, రూ.6 లక్షల విలువైన ఈ ఆపరేషన్‌ను ఉచితంగా చేయించి, నా కొడుక్కి మరో జన్మనిచ్చారని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం కొత్తగూడెంకు చెందిన వెంకట రాంబాబు తన ఆనందాన్ని జగనన్న వద్ద వ్యక్తం చేశారు.