ఇది మోసపూరిత ప్రభుత్వం!: వైఎస్ జగన్

ఇది మోసపూరిత ప్రభుత్వం!: వైఎస్ జగన్ - Sakshi


* ధ్వజమెత్తిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

* రుణాలు మాఫీ చేస్తామని చెప్పి రైతుల పేర్లను మాఫీ చేస్తున్నారు

* హామీలివ్వడం, విస్మరించడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య

* ప్రతిపక్షంలో ఉన్నాం.. ప్రజల తరఫున పోరాటం చేస్తాం

* అందరూ చేయీ చేయీ కలిపి సర్కారు మెడలు వంచుదాం


 

 సాక్షి, కడప: డ్వాక్రా రుణాలు, వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల ప్రచార సభల్లో, మేనిఫెస్టోలో ఊదరగొట్టిన చంద్రబాబు అధికారంలోకి రాగానే రుణాలు తీసుకున్న రైతుల పేర్లను మాఫీ చేస్తున్నారని వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ అధినేత, ఏపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఇది ప్రజలను వంచిస్తున్న మోసపూరిత సర్కార్ అని దుయ్యబట్టారు. ఆయన శనివారం వైఎస్సార్ జిల్లా పులివెందులతోపాటు ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. పలువురు పింఛన్లు కోల్పోయిన వృద్ధులు, రుణమాఫీ లిస్టులో పేర్లు లేని రైతులు, డ్వాక్రా మహిళలు ఆయనను కలిశారు. ఈ సర్కారు తమ జీవితాలను నాశనం చేసిందని వారు వాపోయారు. దీనిపై ఆయన స్పందిస్తూ... ప్రజలకు ఏవేవో చేస్తామని లెక్కలేనన్ని హామీలిచ్చి, ఈ రోజు చేతకాక ప్రజలను రోజుకొకమాటతో వంచనకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలప్పుడు హామీలివ్వడం తర్వాత విస్మరించడం బాబుకు వెన్నతో పెట్టిన విద్యని, అందుకే రోజురోజుకూ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని చెప్పారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాలు, పండుటాకుల పింఛన్లపై మడమ తిప్పకుండా పోరాటం చేస్తామని భరోసానిచ్చారు. ప్రజలు కూడా తమ ఆందోళనల్లో పాలుపంచుకుని ప్రభుత్వం మెడలు వంచేందుకు చేయి కలపాలని ఆయన పిలుపునిచ్చారు.

 

అండగా ఉంటా... అధైర్యపడొద్దు...

 వరుసగా ప్రజలు ఆదిరిస్తున్నారనే అసూయతో పొట్టనపెట్టుకున్నారయ్యా... ముందు సర్పంచ్ అయ్యాడు, మా వదినా సర్పంచ్ అయ్యింది... ఎంపీటీసీ గెల్చినాం... ఒకర్ని కూడ పల్లెత్తుమాట అనని నా తోడబుట్టినోన్ని తెలుగుదేశమోళ్లు చంపేశారయ్యా.. అంటూ గత జూలైలో హత్యకు గురైన మర్రిబోయిన ఓబులేసు సోదరి ఓబులమ్మ జగన్‌ను చూడగానే బోరుమన్నారు. నీతిగా ఉన్నందుకే ఇంతటి ఘోరానికి పాల్పడ్డారు సామీ... అంటూ వాపోయారు. వారి రోదనలకు జగన్ చలించిపోయారు. నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని, అధైర్యపడొద్దు, అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఏ అవసరం వచ్చినా, తన సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అండదండగా ఉంటారని చెప్పారు. అధైర్య పడకుండా ప్రజాసేవలో పాలు పంచుకోవాలని ఓబులేసు కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.

 

 అడుగడుగునా నీరాజనం...

 ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రొద్దుటూరు వెళ్తున్నారని తెలుసుకున్న ప్రజలు పులివెందుల నుంచి ప్రొద్దుటూరు వరకూ గ్రామగ్రామాన ఘన స్వాగతం పలికారు. ముద్దనూరు, చిలంకూరు, నిడ్జివి, యర్రగుంట్ల జనం రోడ్డుపై బారులు తీరారు. ప్రొద్దుటూరులో యువత పెద్ద ఎత్తున స్వాగతం పలికి కేరింతలు కొట్టింది.  ఆయన వెంట కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జయరాములు, రాచమల్లు శివప్రసాదరెడ్డి, శెట్టిపల్లె రఘురామిరెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, ఎస్‌బీ అంజాద్‌బాష, పి.రవీంద్రనాథరెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, జెడ్పీ ఛెర్మైన్ గూడూరు రవి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top