విద్యారంగంపై నిపుణుల కమిటీతో సీఎం భేటీ

YS Jagan Mohan Reddy Review Meeting On Education System - Sakshi

సాక్షి, అమరావతి : విద్యారంగంలో మార్పులపై నిపుణుల కమిటీతో తన ఆలోచనలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పంచుకున్నారు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని అధికారులకు సూచించారు. దీంట్లో భాగంగానే అమ్మ ఒడి పథక ప్రాముఖ్యాన్ని అధికారులకు వివరించారు. అమ్మ ఒడి, సంపూర్ణ ఫీజు రియింబర్స్‌ మెంట్, విద్యార్థులకు బోర్డింగ్‌ అండ్‌ లాడ్జింగ్‌ కింద ఏటా రూ.20వేల రూపాయలు చెల్లింపుపై అధికారులతో చర్చించారు. వచ్చే జనవరి 26 నుంచి అమ్మ ఒడి అమల్లోకి రానున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో నిరక్షరాస్యత ఉండకూడదని పేర్కొన్నారు. స్కూలు దగ్గర నుంచి తిరిగి ఉన్నత విద్య పూర్తి చేసుకునేంత వరకూ డ్రాప్‌ అవుట్‌ అన్నది లేకుండా చేయాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయడాన్ని ఓ సవాల్‌గా తీసుకున్నామని తెలిపారు. గత ప్రభుత్వం పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లనీయకుండా నిరత్సాహపరించదని అన్నారు. 6, 8నెలలు అయినా మధ్యాహ్నా భోజన కార్మికులకు గత ప్రభుత్వంలో సరకులకు బిల్లులు చెల్లించని పరిస్థితి ఉండేదని విమర్శించారు. పుస్తకాలు కూడా సరిగ్గా ఇవ్వలేదని అన్నారు. ఏప్రిల్‌, మే, జూన్‌ మొదటి వారాల్లో అందాల్సిన డబ్బులు అక్టోబరు వచ్చినా అందని పరిస్థితి అని మండిపడ్డారు. పాదయాత్రలో మాకు పుస్తకాలు అందలేదని అక్టోబర్‌ నెలలో పిల్లలు నాకుచెప్పిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు.

రాష్ట్రంలో 40వేల స్కూళ్లు ఉన్నాయని, ప్రతి స్కూలు ఇప్పుడు ఏస్థితిలో ఉన్నాయో ఫొటో తీసుకోమన్నామని తెలిపారు. 2–3 ఏళ్లలో మరొక ఫోటో తీసుకుని ప్రజలకు చూపిస్తామని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలకు కావాల్సిన కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. బాత్‌రూమ్స్, తాగునీరు, ఫర్నిచర్, బ్లాక్‌బోర్డ్స్, ఫ్యాన్లు, ప్రహరీ గోడలు, ఫినిషింగ్‌ వర్క్స్‌... ఇలా ప్రతి పనీ ప్రాధాన్యతా క్రమంలో చేపడతామని అన్నారు. ప్రతి పాఠశాలను ఇంగ్లిషు మీడియం చేస్తున్నామని పేర్కొన్నారు. తెలుగు భాషను తప్పనిసరి సబెక్ట్‌ చేస్తున్నామని ప్రకటించారు.

మధ్యాహ్నభోజనం నాణ్యతను బాగా పెంచుతామని హామీ ఇచ్చారు. మధ్యాహ్న భోజన రేటును పెంచే ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. ప్రతి పిల్లాడికి 3 జతల యూనిఫారాలు, షూలు అందిస్తామని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులకే స్టిచ్చింగ్‌ ఛార్జీలు ఇవ్వాలని అధికారులకు సూచించారు. పిల్లలలకు షూలు, సాక్సులకోసం డబ్బులు కూడా ఇవ్వాలని తెలిపారు. అర్బన్‌ ప్రాంతాల్లో మధ్యాహ్నం భోజనం అక్షయపాత్రకు, రూరల్‌ ప్రాంతాల్లో ఇప్పుడున్న డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు అప్పగించాలని ఆదేశించారు.

ప్రతి పాఠశాలకు విద్యాకమిటీ ఏర్పాటు చేయాలని, పాఠశాల అభివృద్ది, పర్యవేక్షణ బాధ్యత కమిటీదేనని స్పష్టం చేశారు. రాజకీయాలకు దూరంగా విద్యా కమిటీలు ఉండాలని అన్నారు. క్రమం తప్పకుండా సమావేశమై స్కూలు బాగోగులను విద్యా కమిటీలు పర్యవేక్షించాలని తెలిపారు. స్కూల్లో బాత్‌రూమ్స్‌ క్లీన్‌ చేసేవారికి రూ.4 వేలు, క్లీనింగ్‌ సామాగ్రి కోసం వెయ్యి రూపాయాలు కేటాయించాలని తెలిపారు. స్కూలు, కాలేజీ ఫీజుల మానిటరింగ్‌ అండ్‌ రెగ్యులేటరి కోసం ఒక నియంత్రణ వ్యవస్థను తీసుకొస్తున్నామని ప్రకటించారు. దీనికోసం ఈ అసెంబ్లీ సమావేశాల్లో చట్టాన్ని తీసుకొస్తామని పేర్కొన్నారు. ఇండియాలో విద్య అనేది వ్యాపారం కాదు, సేవ మాత్రమేనని అన్నారు. రూరల్‌ ఎకానమీ ఉన్న దేశంలో లక్షల ఫీజులు కట్టడం కష్టమని అన్నారు. వంద శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తామని స్పష్టం చేశారు.

బోర్డింగ్‌, లాడ్జింగ్‌ కోసం ప్రతి విద్యార్థికి ఏటా రూ. 20 వేలు అందిస్తామని తెలిపారు. ఏదశలో కూడా చదువు ఆపకూడదన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. పేదల జీవితాలు మారాలంటే.. చదువు ఒక్కటే మార్గమని అన్నారు. ఉన్నత విద్య పూర్తైన తర్వాత ఉద్యోగాలు కల్పించాలని అన్నారు. డిగ్రీ తీసుకున్నాక.. ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉండాలన్నారు. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని అసెంబ్లీ చట్టం తీసుకొస్తున్నట్లు తెలిపారు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ఓ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ను ఎంపిక చేసుకుని, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో ఉన్నవారికి శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. ఈ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌, జిల్లాలో ఉన్న పారిశ్రామిక వర్గాలతో ఇంటరాక్ట్‌ అవుతుందని పేర్కొన్నారు. వారికి కావల్సిన నైపుణ్యం ఉన్న మానవ వనరులను అందించడానికి తగిన విధంగా ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. విద్యావ్యవస్థను తీర్చి దిద్దాలన్నదే తన కల అని, ఆ దిశగా అడుగులు వేస్తున్నానని, అందుకు అధికారుల సహకారం, ప్రోత్సాహం అవసరమని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top