
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం
భోగాపురంలోని ఎయిర్‌పోర్టు బాధితులకు ధైర్యం చెప్పేందుకు వచ్చిన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
విజయనగరం నుంచి భారీ బైక్, కార్ల ర్యాలీలతో తరలి వెళ్లిన నాయకులు, కార్యకర్తలు
పోలీసుల ఆంక్షలను లెక్క చేయని అభిమానం
విజయనగరం మున్సిపాలిటీ/ డెంకాడ : భోగాపురంలోని ఎయిర్‌పోర్టు బాధితులకు ధైర్యం చెప్పేందుకు వచ్చిన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జిల్లా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. డెంకాడ మండలం మోదవలస సమీపంలోని రాజాపులోవ జాతీయ రహదారికి వద్దకు చేరుకోగానే పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్యేలు సుజయ్‌కృష్ణారంగారావు, పీడిక రాజన్నదొరలతో పాటు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు పెనుమత్స సాంబశివరాజు, మాజీ ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, మజ్జి శ్రీనివాసరావు తదితరులు పుష్పగుచ్ఛాలతో ఆయనకు సాదర స్వాగతం పలికారు.
పార్టీ అధినేతకు ఘన స్వాగతం పలికేందుకు విజయనగరం పట్టణం నుంచి వందలాది మంది యువత, పార్టీ నాయకులు, కార్యకర్తలు బైక్‌లపై, కార్లపై ర్యాలీగా తరలివెళ్లారు. ప్రతిపక్ష నేత పర్యటన విజయవంతం కాకుండా చేసేందుకు పోలీసు యంత్రాంగం పెట్టిన ఆంక్షల సంకెళ్లను సైతం లెక్క చేయలేదు. ముందుస్తుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నిర్ణీత సమయానికి వారంతా భారీగా ర్యాలీగా తరలివచ్చి అభిమాన నేతకు అపూర్వంగా స్వాగతం పలికారు.
పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా వాహనాలతో తరలి రావటంతో జాతీయ రహదారి వైఎస్సార్ పార్టీ జెండాలతో కూడిన వాహనాలతో నిండిపోయింది. విజయనగరం నుంచి విశాఖ వైపు వెళ్లే జాతీయ రహదారి వైపుగా ఎదురు చూస్తున్న సమయంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని భావించిన పోలీసులు జగన్ కాన్వాయ్‌ను శ్రీకాకుళం-విశాఖ జాతీయ రహదారి నుంచి మళ్లించారు. దీంతో జగన్ కాన్వాయ్‌ను గుర్తించి కార్యకర్తలు, అభిమానులు ఒక్కసారిగా వచ్చేశారు. దీన్ని గమనించిన జగన్ కాన్వాయ్‌ను ఆపి అందరినీ పలకరించారు. జాతీయ రహదారి పొడవునా జనం ఉండటంతో చాలా దూరం వరకూ కారులో నించుని అభివాదం చేశారు.