నేడు ఢిల్లీకి వైఎస్ జగన్

సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లను కలుసుకుని ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులను వివరించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గురువారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. ఆయనతోపాటు పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు కూడా ఢిల్లీకి వెళుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన మున్సిపల్ చైర్మన్ల, మండలపరిషత్, జిల్లా పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో టీడీపీ నేతలు చేసిన అరాచకాలు, ప్రభుత్వ అధికార దుర్వినియోగం వంటి అంశాలను ఆయన వీరిద్దరి దృష్టికి తేనున్నారు. చంద్రబాబు నాయుడు సర్కారు ఏర్పడిన నెలరోజుల్లోనే 17 మంది వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలను హతమార్చడం, 110 మందిని తీవ్రంగా గాయపర్చిన ఉదంతాలను వివరించనున్నారు. జగన్ గురు, శుక్రవారాల్లో ఢిల్లీలోనే ఉంటారు.