విజయనగరం జిల్లాలో వైఎస్ జగన్మోహన రెడ్డి పర్యటన
చెన్నైలో ఇటీవల భవనం కూలి చనిపోయన వారి కుటుంబాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీ శాసనసభాపక్ష నేత వైఎస్ జగన్మోహన రెడ్డి పరామర్శించారు.
విజయనగరం: చెన్నైలో ఇటీవల భవనం కూలి చనిపోయన వారి కుటుంబాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీ శాసనసభాపక్ష నేత వైఎస్ జగన్మోహన రెడ్డి పరామర్శించారు. మక్కువ మండలం తురుమామిడి గ్రామంలో తిరుపతిరావు, సత్యనారాయణ కుటుంబాలను ఓదార్చారు. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జగన్ను చూసేందుకు అనేకమంది తరలి వస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చి బాధితులను పలకరించి, వారి బాధలు తెలుసుకొని, వారికి భరోసా ఇస్తున్న జగన్ను చూసిన స్థానిక ప్రజలు ఆ మహానుభావుడి బిడ్డ అని, జగన్ జగనే అని అనుకుంటున్నారు.
నిన్న, ఈరోజు జగన్ విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఉదయం మక్కువ మండలంలోని గైశీలలో శంకర్రావు, సరస్వతి, భారతి కుంటుంబాలను ఆయన కలిశారు. వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. పరిహారం అందేలా పార్టీ కృషి చేస్తుందని వారికి హామీ ఇచ్చారు.
గత నెల 28న చెన్నైలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం కూలిన ఘటనలో పలువురు మరణించారు. వీరిలో విజయనగరం జిల్లాకు చెందిన 9 మంది మృతుల కుటుంబీకులను జగన్ మంగళవారం పరామర్శించారు. చెన్నై మృతుల్లో దత్తి రాజేరు మండలంలోని కోరపు కృష్ణాపురానికి చెందిన పేకేటి అప్పలరాము, లక్ష్మి (వీరిద్దరూ భార్యాభర్తలు), కర్రి తౌడమ్మ, వనం దుర్గ, పతివాడ గౌరీశ్వరి, సిరిపురపు రాము, పతివాడ బంగారినాయుడు, బాడంగి మండల కేంద్రానికి చెందిన బొమ్మి గౌరునాయడు, బొంగు శాంతి కుమారిల కుటుంబ సభ్యులను ఓదార్చారు. దుర్ఘటన జరిగిన తీరును, వారి కష్టాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాల సహాయపడగలమని వారికి హామీ ఇచ్చారు.


